సోమవారం 03 ఆగస్టు 2020
Mulugu - Jan 22, 2020 , 03:52:01

భక్తులు మెచ్చేలా వసతులు

భక్తులు మెచ్చేలా  వసతులు
  • -మేడారం జాతర ఏర్పాట్లు తుది దశకు..
  • -7400 టాయిలెట్లు సిద్ధం
  • - పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
  • - గ్రేటర్‌ వరంగల్‌, రాజమండ్రి, తదితర ప్రాంతాల నుంచి 2000 మంది కార్మికుల రాక
  • - 42 సెక్టార్లు.. 700 మంది ఉద్యోగులు
  • - తప్పిపోయిన వారి కోసం సెంట్రల్‌ లొకేటెడ్‌ ఎనౌన్స్‌మెంట్‌ సిస్టం
  • - జాతర పరిసరాల్లో హైజినిక్‌ ప్లాట్‌ఫాంలు
  • -ప్లాస్టిక్‌ ఫ్రీ మేడారానికి 10 చెక్‌పోస్టులు, 50 వ్యర్థాల సేకరణ కేంద్రాలు
  • -మీడియా సమావేశంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు‘భక్తులు మెచ్చేలా వసతులు కల్పించి తల్లుల దర్శనం కల్పిస్తాం. మేడారం జాతర ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి’ అని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన జాతర ఏర్పాట్లపై మాట్లాడారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా 7400 టాయిలెట్లు సిద్ధం చేశామని తెలిపారు. జాతరలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని అన్నారు. గ్రేటర్‌ వరంగల్‌, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి 2000 మంది పారిశుధ్య కార్మికులను రప్పిస్తున్నట్లు చెప్పారు. జాతర నిర్వహణకు 38 సెక్టార్లలో 700 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. భక్తులు తప్పిపోతే వారి సమాచారం కోసం సెంట్రల్‌ లొకేటెడ్‌ ఎనౌన్స్‌మెంట్‌ సిస్టంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను భక్తులు తీసుకురాకుండా            10 చెక్‌పోస్టులు, 50 ప్లాస్టిక్‌ సేకరణ బృందాలు పనిచేస్తాయని ఆయన వివరించారు.

ములుగు జిల్లా ప్రతినిధి/ నమస్తే తెలంగాణ: వచ్చేనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తులు మెచ్చేలా వసతులు కల్పించినట్లు ములుగు ఇన్‌చార్జి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయా పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో 8,400 మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామని, అందులో 7,400 మరుగుదొడ్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 6వేల వాహనాలు పార్కింగ్‌ చేసేందుకు 100 ఎకరాల్లో అన్ని వసతులతో సిద్ధం చేసినట్లు వివరించారు. జంపన్నవాగు వద్ద బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్స్‌, జంపన్నవాగులో స్నానాలు చేసిన వారు దుస్తులు మార్చుకునేందుకు 132 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కల్యాణకట్టలో నిర్ణయించిన రేటుకే కేశఖండన చేసేలా చూస్తున్నామని చెప్పారు.

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని, జాతర ముందు, తర్వాత, మేడారం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా హైజినిక్‌ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వనదేవతలను సులభంగా దర్శించుకొని మొక్కులు చెల్లించేందుకు బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జాతరలో దుమ్ము లేవకుండా చర్యలు చేపడుతున్నామని వివరించారు. పారిశుధ్య నిర్వహణకు గ్రేటర్‌ వరంగల్‌, రాజమండ్రితో పాటు ఇతర ప్రదేశాల నుంచి 2వేల కార్మికులను రప్పించామని పేర్కొన్నారు. జాతర నిర్వహణకు 42 సెక్టార్లు ఏర్పాటు చేసి అధికారులను కేటాయించామని, దేవాలయ ప్రాంగణంలో 4 సెక్టార్లు, జాతర పరిసరాల్లో 38 సెక్టార్లుగా విభజించి 700 మంది ఉద్యోగులను విధులు అప్పగించామన్నారు. జాతరలో తప్పిపోయిన భక్తుల సమాచారం కోసం సెంట్రల్‌ లొకేటెడ్‌ ఎనౌన్స్‌మెంట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. తాగునీరు, పారిశుధ్యం, వసతి కోసం ఏర్పాటు చేసిన షెడ్లను భక్తులు పరిశుభ్రంగా ఉంచాలని, జంపన్నవాగులో బ్లేడ్‌లు, ఇతర సామగ్రిని పడేయొద్దని విజ్ఞప్తి చేశారు.

ప్లాస్టిక్‌ ఫ్రీ మేడారం

సింగిల్‌ యూజ్డ్‌ (ఒక్కసారి వాడిపారేసే) ప్లాస్టిక్‌ కవర్లను భక్తులు మేడారం జాతరకు తీసుకురావొద్దని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా తెలియక తీసుకొస్తే నిలువరించేందుకు 10 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, 50 బృందాలతో ప్లాస్టిక్‌ను సేకరిస్తామని వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్‌ బ్యాగులను తీసుకురాకుండా ప్రత్యామ్నాయ జూట్‌, క్లాత్‌ సంచులను తెచ్చుకోవాలని కోరారు. జాతరకు వచ్చే వివిధ మార్గాల్లో ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయ స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

5న సారలమ్మ రాక

ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుందని కలెక్టర్‌ తెలిపారు. అదే రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ తల్లి గద్దెకు వస్తుందని, 6వ తేదీన సమ్మక్క గద్దెకు వస్తుందని, 7న మొక్కుల చెల్లింపు, 8న వనప్రవేశం ఉంటుందని వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తులు సమన్వయంతో వ్యవహరించాలని, తల్లులను భక్తి భావంతో పూజించి మొక్కులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.logo