శుక్రవారం 07 ఆగస్టు 2020
Mulugu - Jan 22, 2020 , 03:50:50

వనదేవతలకు వందనం

 వనదేవతలకు వందనం
  • -తల్లుల దర్శనం కోసం తరలివస్తున్న భక్తులు
  • -రోజురోజుకూ పెరుగుతుండడంతో సందడిగా మారుతున్న మేడారం జాతర పరిసరాలు
  • -అమ్మవార్లను దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ తదితరులు

తాడ్వాయి, జనవరి 21: ఆదివాసీ గిరిజన దైవాలైన సమ్మక్క-సారక్కను దర్శించుకునేందు మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో షవర్ల కింద స్నానాలు చేసి, తలనీలాలు ఇచ్చారు. నాగులమ్మ, జంపన్న గద్దెలకు పూజలు చేసి, తల్లుల గద్దెల వద్దకు చేరుకున్నారు. సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో గద్దెలకు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. తల్లులకు యాటపోతులు, కోళ్లను సమర్పించి గద్దెల పరిసరాలతో పాటు ఆర్టీసీ బస్టాండ్‌, జంపన్నవాగు, చిలకలగుట్ట తదితర ప్రాంతాల్లో చెట్ల కింద విడిది చేశారు. అక్కడే వంటలు వండి కుటుంబ సమేతంగా భోజనాలు చేశారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో మేడారం జాతర పరిసరాలు సందడిగా మారుతున్నాయి.

వనదేవతల సేవలో ప్రముఖులు

సమ్మక్క-సారక్కను పలువురు ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం విన య్‌భాస్కర్‌, రైతు రుణ విమోచన కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వ ర్లు, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, పశ్చిమ డివిజన్‌ కార్పొరేటర్లు, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ కుటుంబసమేతంగా, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దర్శనానికి రాగా, అమ్మవార్ల పూజారులు, జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ ఆలం రామ్ముర్తి, డైరెక్టర్లు శోభన్‌, ప్రభాకర్‌, దేవాదాయశాఖ అధికారులు డోలి వాయిద్యాలతో స్వాగతం పలికారు. వారు సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకుని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూ తన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.logo