బుధవారం 05 ఆగస్టు 2020
Mulugu - Jan 21, 2020 , 02:35:44

ఫిబ్రవరి 2 నుంచి మేడారానికి వన్‌వే

ఫిబ్రవరి 2 నుంచి మేడారానికి వన్‌వే
  • - ఈ సారి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు కాటారం మీదుగా మళ్లింపు
  • - ప్రతి 4 కిలోమీటర్లకు పోలీస్‌ ఔట్‌పోస్టు
  • - 330 బుల్లెట్‌ సీసీ కెమెరాలు
  • - పోలీస్‌, రెవెన్యూ కంట్రోల్‌ రూమ్‌లు
  • - జీపీఎస్‌ విధానం అమలు
  • - భక్తులు సేద తీరేందుకు 22 హాల్టింగ్‌ పాయింట్లు
  • - మీడియాతో ములుగు జిల్లా అడిషనల్‌ ఎస్పీ సాయిచైతన్య

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తేతెలంగాణ: 2020 ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తుల రాకపోకలకు ఫిబ్రవరి 2 నుంచి వన్‌వే విధానం అమలు చేయనున్నట్లు ములుగు జిల్లా అడిషనల్‌ ఎస్పీ సాయిచైతన్య వెల్లడించారు. సోమవారం ఎస్పీ కార్యా లయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ మాట్లాడారు. భక్తులు ముందస్తు మొక్కులతోపాటు జాతర సమయంలో వాహనాల రాకపోకలను నిర్దేశించిన మార్గాల్లో వన్‌వే ద్వారా కొనసాగిస్తామని అన్నారు. జాతరకు వచ్చే భక్తులు నిరంతరం ప్రయాణం చేయకుండా మార్గమ ధ్యలో విశ్రాంతి తీసుకునేందుకు మేడారం నుంచి మల్లంపల్లి వరకు 22 హాల్టింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రాఫిక్‌ జామ్‌ వంటి సమస్యలు తలెత్తకుండా జాతరకు వచ్చే మార్గాలను జీపీఎస్‌కు అనుసంధానం చేస్తున్నట్లు వివరించారు.

నూతనంగా కాటారం మీదుగా మేడారం

మేడారం  మహా జాతరకు వచ్చే భక్తులు గతంలో మాదిరిగానే వన్‌వేను ఫిబ్రవరి 2 నుంచి అమలులోకి వస్తుందని ఏఎస్పీ తెలిపారు. 2020 జాతరకు కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మహారాష్ట్ర, గోదావరిఖని, పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల నుంచి వచ్చే వాహనాలను కాటారం ద్వారా సింగారం, కాల్వ పల్లి నుంచి మేడారం చేరుకునే విధంగా నూతన మార్గాన్ని అనుమతిస్తున్నట్లు తెలిపారు. కాటారం, కాల్వపల్లి మినహా మిగిలిన అన్ని మార్గాలు 2018 జాతర మాదిరిగానే కొనసాగనున్నట్లు చెప్పారు. భక్తులు వన్‌వే విధానాన్ని పాటించి జాతర విజయవంతానికి సహకరించాలని కోరారు. ప్రతి భక్తుడి క్షేమం, సుఖప్రయాణం ద్వారా తల్లులను దర్శించుకోవాలని అన్నారు.

నిరంతర నిఘా

మేడారం జాతరలో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతర పరిసరాల్లో ఐదు కిలోమీటర్ల పరిధిలో 330 బుల్లెట్‌ సీసీ, 20 పీటీజెడ్‌ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పోలీస్‌, రెవెన్యూ కంట్రోల్‌ రూమ్‌ల అనుసంధానంతో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడినా, ప్రమాదాలు జరిగినా జీపీఎస్‌ విధానం ద్వారా గుర్తించి కావాల్సిన క్రేన్‌, జేసీబీ, టోన్‌ వాహనం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని అన్నారు. ఎప్పటికప్పుడు రహదారులపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తు న్నట్లు తెలిపారు. అదేవిధంగా జాతర పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వీడియో అనలెటిక్స్‌ విధానం ద్వారా పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు.

4 కిలోమీటర్లకు పోలీస్‌ ఔట్‌పోస్టు

మేడారం జాతరకు వచ్చే అన్ని మార్గాల్లో ప్రతి 4 కిలోమీటర్లకు ఒక పోలీస్‌ ఔట్‌పోస్టును ఏర్పాటు చేస్తు న్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. ఔట్‌పోస్టులో ఎస్సై, ఏఎస్సైతోపాటు పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది అందు బాటులో ఉంటారని అన్నారు. జాతర మార్గాల్లో ఏర్పడే సమస్యలను ఎప్పటికప్పుడు మొబైల్‌ పార్టీ ద్వారా కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందిస్తామని తెలిపారు. భక్తులకు అవసరమైన సేవలను అందిం చేందుకు వివిధ రకాల వాహనాలను ఏర్పాటు చేసిన ప్రదేశాలను తెలియజేసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.logo