గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Jan 20, 2020 , 03:16:27

వనమంతా జనం!

వనమంతా జనం!
  • - కిక్కిరిసిన మేడారం జాతర పరిసరాలు
  • - తరలివచ్చిన ఐదు లక్షల మంది భక్తులు
  • - క్యూలైన్ల ద్వారా దర్శనం
  • - జంపన్నవాగులో పుణ్యస్నానాలు
  • - వన దేవతలకు భక్తుల ప్రత్యేక పూజలు
  • - అమ్మవార్లకు ఎత్తు బెల్లం, పసుపు, కుంకుమ సమర్పణ
  • -తల్లుల సేవలో తరించిన సీఎస్‌, డీజీపీ
  • - మేడారం జాతర అభివృద్ధి పనుల పరిశీలన


వనమంతా జనంతో నిండిపోయింది. మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఆదివారం కావడం, జాతర సమీపిస్తుండడంతో భక్తులు పోటెత్తారు. సుమారు ఐదు లక్షల మందికి పైగా జనం వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం సమర్పించి మొక్కులు చెల్లించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో క్యూలైన్ల ద్వారా దర్శనానికి పంపించారు. ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రద్దీ కొనసాగింది. తల్లులకు యాటలు, కోళ్లను బలిచ్చిన భక్తులు జాతర పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో విడిది చేశారు. మేడారం నుంచి తాడ్వాయి, పస్రా వెళ్లే దారుల్లో సుమారు 10 కిలోమీటర్ల మేర సేద తీరారు. వన దేవతలను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ మహేందర్‌రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మహేశ్‌దత్‌ ఎక్కా, కమిషనర్‌ క్రిస్టీనా చోంగ్తు, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మేడారం జాతర అభివృద్ధి పనులను సీఎస్‌, డీజీపీలు పరిశీలించారు. పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
- ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ, తాడ్వాయి విలేకరి

తాడ్వాయి, జనవరి 19: ఆదివారం సెలవుదినం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు మేడారం తరలివచ్చారు. ముందస్తుగా మొక్కులు చెల్లించేందుకు తెల్లవారుజాము వరకే బారులుతీరారు. చిలకలగుట్ట, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్‌ తదితర ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. మొదట జంపన్నవాగులో స్నానాలు చేసి, జంపన్న గద్దెకు, నాగులమ్మ గద్దెకు పూజలు నిర్వహించారు. తల్లుల గద్దెల వద్ద సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించారు. ఆదివారం సుమారు ఐదు లక్షల మందికి పైగా ప్రజలు మేడారం రాగా, ఉదయం గద్దెల వరకు భక్తులను అనుమతిచ్చారు. పదిగంటల సమయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేలాది వాహనాల్లో వచ్చిన వారు ఒక్కసారి గద్దెల వద్దకు చేరుకోవడంతో ఆ ప్రాంగణం కిక్కిరిసింది. దీంతో భక్తులను క్యూలైన్ల ద్వారా దర్శనానికి పంపించారు. పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రద్దీ కొనసాగింది. ఈ మేరకు దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఒకవైపు క్యూలైన్లలో రద్దీ పెరిగిన సమయంలో, మరోవైపు ఉన్న క్యూలైన్లను తెరిచి భక్తులను అమ్మవార్ల దర్శనానికి పంపించారు. దర్శనం చేసుకునే సమయంలో ఆలస్యం కాకుండా చర్యలు చేపట్టారు. తల్లులకు యాటలు, కోళ్లను బలిచ్చిన భక్తులు గద్దెల ప్రాంగణతో పాటు జాతర పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో విడిది చేశారు. మేడారం నుంచి తాడ్వాయి, మేడారం నుంచి పస్రా వెళ్లే దారుల్లో సుమారు 10 కిలోమీటర్ల మేర దూరంలో వంటలు వండుకుని కుటుంబ సమేతంగా కలిసి భోజనాలు చేసి, ఆహ్లాదంగా గడిపారు. ఆదివారం ఒక్కరోజే సుమారు ఐదు లక్షల మంది భక్తులు మేడారం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

తల్లుల సేవలో సీఎస్‌, డీజీపీ

ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారక్కను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మహేశ్‌దత్‌ ఎక్కా, కమిషనర్‌ క్రిస్టీనాజెడ్‌చొంగ్తు, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, డీజీపీ మహేందర్‌ ఆదివారం దర్శించుకున్నారు. హెలిప్యాడ్‌లో వచ్చిన వారికి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌, ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అమ్మవార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు, మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ ఆలం రామ్మూర్తి, దేవాదాయశాఖ అధికారులు డోలి వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. వారు సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మర్యాదలతో కండువాలు కప్పి సత్కరించారు. అమ్మవార్ల ప్రసాదం, వస్ర్తాలను అందజేశారు. గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సోలార్‌ లైట్లను సీఎస్‌ ప్రారంభించారు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ తరపున సోలార్‌ లైట్లను ఏర్పాటు చేసేందుకు రూ. 2 కోట్లు మంజూరు చేయగా, ఐటీడీఏ అధికారులు రెండు సోలార్‌ సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.logo