సోమవారం 10 ఆగస్టు 2020
Mulugu - Jan 20, 2020 , 03:14:57

భక్తులు మెచ్చేలా సేవలందించాలి

భక్తులు మెచ్చేలా సేవలందించాలి
  • - 25 వరకు పనులు పూర్తి చేయాలి
  • - ట్రాఫిక్‌ను ప్రణాళికాబద్ధంగా క్రమబద్ధీకరించాలి
  • - ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌
  • - భక్తులకు పనులు ఉపయోగ పడాలి
  • - భద్రతాపరంగా పటిష్ట చర్యలు
  • - రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో మేడారం జాతర అత్యం త ప్రసిద్ధిగాంచిన జాతర అని, జాతరకు వచ్చే భక్తులు మెచ్చేలా వారికి మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ట్రైబర్‌ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మహేశ్‌దత్‌ఎక్కా, ట్రైబర్‌ వెల్ఫేర్‌  కమిషనర్‌ క్రిస్టినా జెడ్‌ చోంగ్తూలతో కలిసి ఆయన మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న మంచె నుంచి క్యూలైన్‌లను, జంపన్నవాగు, చిలుకలగుట్ట, వీవీఐపీ, వీఐపీ బస్టాండ్‌, ఊరట్టం రోడ్డు వద్ద పార్కింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అధ్యక్షతన హరితహోటల్‌లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల పనుల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని, జాతర నిర్వహణపై రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. చాలా కష్టపడి అధికారులు పనులను చేపట్టారని, చేపట్టిన పనులను ఈ నెల 25వ తేదీ వరకు పూర్తి చేసి భక్తులకు మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్న సెక్టోరల్‌ అధికారులతో ప్రతి రోజూ మూడు సార్లు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్‌ నుంచి తాను కూడా సీనియర్‌ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ను నిర్వహించి జాతర నిర్వహణ వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని తెలిపారు. ప్రతి విభాగంలో సెక్టోరల్‌ అధికారులు పనిచేస్తున్న విధానం గమనించాలని, పూర్తి సమాచారం జిల్లా కలెక్టర్‌ వద్ద ఉండాలని అన్నారు. జాతరను పకడ్బందీగా నిర్వహించి భక్తులకు మంచి అనుభవాన్ని, భక్తి భావాన్ని కల్పించాలని సూచించారు.

పోలీస్‌ క్యాంపులో జాతర ఏర్పాట్లపై రూపొందించిన మ్యాప్‌ను పరిశీలించారు. జాతరలో ఉన్న పలు ప్రదేశాలు చిలుకగుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చే దారి, కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువచ్చే మార్గంతోపాటు జాతరకు చేరుకునే పలు మార్గాలను సీఎస్‌, డీజీపీ క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించారు. అవసరం ఉన్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

జీపీఎస్‌ ట్యాగింగ్‌ చేయాలి..

మేడారానికి చేరుకునే రోడ్డు నిర్మాణాలు, మరమ్మతులు వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతరకు వచ్చేందు కు గుర్తించిన మార్గాల కేంద్రాలను జీపీఎస్‌ ట్యా గింగ్‌ చేయాలని సూచించారు. కటాక్షాపూర్‌ చెరు వు వద్ద ఉన్న కాజ్‌వే ఇరుకుగా ఉందని, తాత్కాలి క చర్యలు చేపట్టి వెడల్పు చేసి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చూడాలన్నారు. భక్తుల రద్దీ క్రమబద్ధీకరణకు ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రద్దీ నిర్వహణపై దృష్టి పెట్టాలి..

జాతరను విజయవంతం చేసేందుకు చేపట్టిన సివిల్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. పార్కింగ్‌ ప్రదేశాల్లో ఫ్లడ్‌ లైట్లు, బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్స్‌తోపాటు మౌలిక వసతులను కల్పించాలని సూచించారు. వీఐపీ, వీవీఐపీ పార్కింగ్‌ కేంద్రం మధ్య రోడ్డును చదును చేయాలని అన్నారు. ప్రతి పార్కింగ్‌ కేంద్రానికి మంచి పేరుతో సైన్‌బోర్డు, గేట్లను ఏర్పాటు చేయాలని, కార్లు ఎన్ని వచ్చినా పార్కింగ్‌ చేయవచ్చుననే వివరాను ప్రదర్శించాలని సూచించారు.
ప్రమాదాలు జరుగకుండా చర్యలు..
మేడారానికి వచ్చే భక్తులు జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించే సంప్రదాయం ఉంద ని,  వాగులో లోతు ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రమాదాలు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అన్నారు. జంపన్నవాగులో ఇసుక లెవలింగ్‌ సక్రమంగా చే యాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు, తమతమ అధికారులు, సిబ్బంది ఎవరు ఎక్కడ ఏ విధుల్లో ఉన్నది వారి మొబైల్‌ నంబర్లతో పాకెట్‌ బుక్‌లెట్‌లను తయారు చేసి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతీ రోజు ఉద యం, సాయంత్రం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి పనుల పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు.  హైదరాబాద్‌ నుంచి ప్రతీ రోజు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు అంతరాయం లేని నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్య లు తీసుకోవాలన్నారు. అత్యవసర వైద్యం కోసం వీలైనంత ఎక్కువ సంఖ్యలో మినీ అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచాలని సూచించారు.  దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు జాతర మధుర జ్ఞాపకంగా ఉండాలని అన్నారు.

విధులను సమర్థవంతంగా నిర్వహించాలి..

డీజీపీ మహేందర్‌రెడ్డి 

జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగ కుండా అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని  రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎం మహేందర్‌రెడ్డి ఆ దేశించారు. రాష్ట్రంలో మేడారం జాతర ఒక మెగా ఈవెంట్‌గా భావించాలని సూచించారు. తెలంగాణ రాష్ర్టానికి అతి ముఖ్యమైన పండుగ మేడా రం జాతర అని, అన్ని విభాగాలకు చెందిన అధికారులు కలిసి పనిచేయాలన్నారు. భక్తుల కోసం చేసే పనులు వారికి ఉపయోగపడే విధంగా సమన్వయం, ఐక్యమత్యంగా చేసి జాతరను విజయవంతం చేశామనే అనుభూతి పొందాలని పిలుపునిచ్చారు. జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రతీ విభాగానికి చెందిన సూచిక బోర్డులను భక్తులకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సూచిక బోర్డులు గైడ్‌ మాదిరిగా ఉపయోగపడాలని, జాతరలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రతీ విభాగం వారికి సేవలు అందించాలన్నారు. సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న జాతర మేడారం జాతర అని అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తుల కోసం నిర్మించిన టాయిలెట్ల నిర్వహణ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

10వేల మంది సిబ్బందితో పటిష్టంగా భద్రత..

జాతర నిర్వహణకు  10వేల మంది పోలీస్‌ బ లగాలను వినియోగిస్తున్నట్లు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు పటిష్టమైన భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జాతరలో ఎలాంటి అపశృతులు చోటుచేసుకోకుండా బారికేడ్ల  వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్‌శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాతరను విజయవంతం చేయాలని సూచించారు. 38సెక్టార్లకు సంబంధించిన అధికారులు సమీక్షలు చేసుకోవాలన్నారు.

సమస్యలను గుర్తించాలి..

ట్రైబర్‌ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ
 మహేశ్‌దత్‌ఎక్కా
ట్రైబర్‌ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మహేశ్‌దత్‌ఎక్కా మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు అందించే వసతులలో ఏర్పడే సమస్యలను గుర్తించి సరి చేస్తూ ముందు కు సాగాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వనదేవతల జాతరకు అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తుంద ని, అధికారులు తమ విధులను పటిష్టంగా నిర్వహించి వనదేవతల ఆశీస్సులు పొందాలన్నారు. కార్యక్రమంలో ఐజీలు నాగిరెడ్డి, ప్రమోద్‌కుమా ర్‌, పోలీస్‌ కమిషనర్‌లు రవీందర్‌, సత్యనారాయణ, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌, నోడల్‌ అధికారి గౌతమ్‌, ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు, ఎ మ్మెల్యే సీతక్క, ఏఎస్పీలు సాయిచైతన్య, శరత్‌చంద్రపవార్‌, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.logo