శుక్రవారం 14 ఆగస్టు 2020
Mulugu - Jan 19, 2020 , 01:42:33

భూపాలపల్లి అభివృద్ధికి సహకరిస్తా..

భూపాలపల్లి అభివృద్ధికి సహకరిస్తా..


భూపాలపల్లి టౌన్‌, జనవరి 18 : భూపాలపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధికి సహకారం అందిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 2, 14, 15, 18 వార్డుల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, భూపాలపల్లి, వరంగల్‌ రూరల్‌ జెడ్పీ చైర్‌పర్సన్లు జక్కు శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, భూపాలపల్లి జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ కల్లెపు శోభ, ఎన్నికల పరిశీలకులు గుండా ప్రకాశ్‌, ఎన్నికల ఇన్‌చార్జి గోవింద్‌నాయక్‌, మాజీ జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డితో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేటీకే 2 ఇైంక్లెన్‌ నుంచి కాకతీయఖని మీదుగా జంగేడు వరకు భారీ రోడ్‌షో నిర్వహించారు. జంగేడు కూడలిలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బుర్ర రమేశ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వేదికలో వద్ద మంత్రి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను వదిలి ఎవరికి ఓటేసినా దున్నపోతుకు గడ్డి వేసినట్లవుతుందన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కవన్నారు.

ఒకరిద్దరు గెలిచినా ప్రయోజనం శూన్యమని తెలిపారు. అధికారంలో ఉన్నది టీఆర్‌ఎస్‌ అని, అభివృద్ధి చేస్తున్నది, చేసింది కూడా టీఆర్‌ఎస్‌ అని పేర్కొన్నారు. ప్రజలు తమ అభ్యర్థులను గెలిపిస్తే సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 29 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి ఎమ్మెల్యే రమణారెడ్డి చేతిలో పెడితే ఆయన కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి భూపాలపల్లి అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు తెస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. సీఎం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తాము టీఆర్‌ఎస్‌లో చేరినట్లు చెప్పారు. తెలంగాణ వస్తే నీళ్లు, కరెంటు, నిధుల సమస్యలు వస్తాయని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సభలో చెప్పారని గుర్తుచేశారు. కానీ, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, కరెంటు, నీళ్ల సమస్యలను తీర్చిన ఘనుడు సీఎం కేసీఆర్‌ అని గుర్తుచేశారు. ప్రాజెక్టులు, ఎన్నికలు ప్రతి అంశంపై కాంగ్రెస్‌ నాయకులు కేసులు వేస్తూ అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని, కేసులను ఛేదిస్తూ అభివృద్ధిలో దూసుకెళ్తున్న ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే రమణారెడ్డి, రాష్ట్రంలో సిరికొండ మధుసూదనాచారి ఉంటారని, తాను మంత్రిగా భూపాలపల్లి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. 

ఈ మున్సిపాలిటీ పరిధిలో భారీ మెజార్టీ సాధించిన నాలుగు వార్డులను ఎంపిక చేసి తాను దత్తత తీసుకుంటానని స్పష్టం చేశారు. ఆ వార్డులను తాను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రెండు రోజులు ఛాలెంజ్‌గా తీసుకొని నాయకులు, కార్యకర్తలు పని చేయాలని, నాలుగేళ్లు తాము అండగా ఉంటామన్నారు. బీజేపీ, కాం గ్రెస్‌ ఉనికి కోసమే పోటీలో దిగుతున్నాయని, వాటికి డిపాజిట్లు దక్కవన్నారు. ఒకటో వార్డు అభ్యర్థి సెగ్గం వెంకటరాణి, రెండో వార్డు అభ్యర్థి ఆకుదారి మమత రాయమల్లు, 12వ వార్డు అభ్యర్థి కొత్త హరిబాబు, 14వ వార్డు అభ్యర్థి దార పూలమ్మ, 15వ వార్డు అభ్యర్థి నాగవెల్లి సరళ రాజలింగమూర్తి, 28వ వార్డు అభ్యర్థి పెద్దిరెడ్డి దేవేంద్ర జనార్దన్‌, టీఆర్‌ఎస్‌ అర్బన్‌, మండల అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, మందల రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మందల విద్యాసాగర్‌రెడ్డి, నాయకులు మేకల సంపత్‌యాదవ్‌, దొంగల ఐలయ్య, కటకం జనార్దన్‌, మాకోటి ఓదెలు, కటకం సారంగపాణి, కటకం కిరణ్‌, దార పోశయ్య, కోల రాయమల్లు, యాళ్ల సురేందర్‌, బొట్ల స్వామి, జోగుల సమ్మయ్య, మోతె రాజు తదితరులు పాల్గొన్నారు.


logo