సోమవారం 10 ఆగస్టు 2020
Mulugu - Jan 18, 2020 , 04:06:30

మేడారంలో భక్తుల రద్దీ

మేడారంలో భక్తుల రద్దీ
  • -రోజురోజుకూ పెరుగుతున్న జనం
  • -జంపన్నవాగులో పుణ్యస్నానాలు
  • -సంప్రదాయబద్ధంగా అమ్మవార్లకు పూజలు
  • -ఎత్తు బంగారంతో మొక్కులు
  • -వన దేవతలను దర్శించుకున్న ప్రముఖులు
  • -వాహనాల దారి మళ్లింపు
  • -కిటకిటలాడుతున్న జాతర పరిసరాలు

తాడ్వాయి, జనవరి 17: వనదేవతలు సమ్మక్క-సారక్కను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్య లో తరలివస్తున్నారు. మహాజాతరకు కొద్ది రోజుల సమయం మిగిలి ఉండడంతో ముందస్తుగా మొ క్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం 25 వేల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు చెప్పారు. జంపన్నవాగులో స్నానాలు చేసిన తర్వాత అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించారు. గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో మొక్కులు చెల్లించారు. తల్లులకు యాటలు, కోళ్లు బలిచ్చి చెట్ల కింద విడిది చేసి, భోజనాలు చేశారు. మేడారం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ఎటు చూసినా జనమే కనిపించారు. వేలాది మంది భక్తులు రావడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉదయం వేళ గద్దెలకు దగ్గరగా పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. జంపన్నవాగు దాటిన అనంతరం హరిత హోటల్‌ వద్దకు వాహనాలను అనుమతించి, పార్కింగ్‌ ప్రదేశాలకు మళ్లించారు. అక్కడి నుంచి భక్తులు కాలినడకన దర్శనానికి వెళ్లారు. మధ్యాహ్నం సమయం లో వాహనాల సంఖ్య పెరగడంతో అరగంట పాటు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను ఏటూరునాగారం ఏఎస్పీ శరత్‌చంద్ర తొలిగింపజేశారు. గంటపాటు అక్కడే ఉండి వాహనాలను పంపించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.logo