మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Jan 17, 2020 , 02:29:08

వైభవంగా బ్రహ్మోత్సవాలు

వైభవంగా బ్రహ్మోత్సవాలు


ఐనవోలు జనవరి 16 : ఐలోని మల్లన్న దండాలో..మమ్మేలు మాస్వామి.. సల్లంగ సూడు దండాలో.. అంటూ సంక్రాంతి పర్వదినం రోజున ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయం శివమెత్తింది. తెలంగాణ జానపదుల జాతరగా పేరుగాంచిన ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ అన్ని జిల్లాల నుంచి భోగి, సంక్రాంతి పర్వదినాల్లో లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తులు సంక్రాంతి పర్వదినం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవాలయంలో బోనాలు చేసి, శివసత్తుల పూనకాలతో ఎల్లమ్మ దేవతకు, మల్లికార్జునస్వామికి నైవేద్యం సమర్పించారు. సంక్రాంతి పర్వదినం రోజున అర్చకులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి, శివలింగాన్ని అలకంరించారు. మల్లికార్జునస్వామికి బంగారు మీసాలు, వెండి కిరీటం, వెండి కవచం సుగంధాలు వెదజల్లే గజ పుష్పమాలతో దేదీప్యమానంగా ముస్తాబు చేశారు. భక్తుల రద్దీతో దేవాలయ తలపులు 24 గంటలు మూసి వేయకుండా భక్తులు స్వామి వారికి  కల్యాణాలు, అర్చనలు, అభిషేకాలు, దర్శనాలు చేసుకున్నారు.

మహానివేదనతో దేవుడి పెద్ద రథం

మార్నేని వంశీయుల ఆధ్వర్యంలో అనాదిగా వస్తున్న మహానివేదన దేవుడి రథాన్ని ఎంపీపీ మార్నేని వంశీయులు హన్ గుడి ముందు సుదరంగా ముస్తాబు చేశారు. మహానివేదనతో బయలుదేరిన రథానికి వాడ వాడలా మహిళలు మంగళహారతులు, కొబ్బరికాయలు కోడుతూ స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న బండి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసింది. పెద్ద బండి కట్టి తీసుకవచ్చిన ఎంపీపీ మార్నేని రవీందర్ ఈవో నాగేశ్వర్ ఆలయా అర్చకులు, సిబ్బంది అందరు కలిసి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం ఒంటిమామిడిపెల్లి, ముల్కలగూడెం, పెరుమాండ్లగూడెం గ్రామాలను నుంచి కూడా ప్రభల బండ్ల నిర్వహకులకు ఆలయ అధికారలు సన్మానం చేశారు.

- మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్

సీఎం కేసీఆర్ పాలనలోనే ఆలయాలు అభివృద్ధి చెందాయని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ సత్యవతి రాథోడ్ అన్నారు. మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఉషా దంపతులు, మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సభ్యులతో బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదశ్ తెలంగాణ ప్రాంత దేవాలయాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేవాలయాలు అభివృద్ధి చెందాయని చెప్పడానికి నిదర్శనంగా ఐనవోలు దేవాలయం నిలుస్తోందన్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ తన కోడలుకు కుంకుమ, గాజులను దగ్గరుండి కొనుగోలు చేయించింది. తను స్వామి వారి దర్శనానికి మొట్టమొదటి సారిగా వచ్చిన్నట్లుగా ఆమె పేర్కొన్నారు. తన కొడుకు కోడలుతో స్వామి వారి సన్నిధిలో మూడుపు కట్టించారు. అలాగే, మల్లికార్జునస్వామివారిని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, అర్బన్, రూరల్ జెడ్పీ చైర్మన్ల్ సుధీర్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేశ్, గొర్లు, మేకల కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, జిల్లా నాయకులు ఇండ్ల నాగేశ్వర్ కార్పొరేటర్ జోరిక రమేశ్, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, బండి పుల్లయ్య, ఆలయ చైర్మన్ మునిగాల సంపత్ ఈవో నాగేశ్వర్ డైరెక్టర్లు తదితరులు దర్శించుకున్నారు.

ఆలయ అభివృద్ధికి రూ.3 కోట్లు కేటాయిస్తా

- ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్

మల్లన్న ఆలయ అభివృద్ధికి సుమారుగా రూ.3 కోట్లు మంజూరు చేస్తానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ అన్నారు. మల్లన్న బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని గురువారం స్థానిక ఎంపీపీ మార్నేని మధుమతి రవీందర్ కలిసి మల్లికార్జునస్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంత దేవాలయాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ఆలయాలు అభివృద్ధి చెందాయని ఆయన గుర్తు చేశారు. తను గతంలో ఎన్నికల సమయంలో ఆలయానికి వచ్చినప్పుడు మొక్కుకన్న మొక్కుబడిని తీర్చుకోవడానికి మళ్లీ స్వామి వారిని దర్శించుకున్నట్లుగా తెలిపారు.


logo