శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Jan 15, 2020 , 02:50:46

మేడారం భక్తులకు సకల సౌకర్యాలు

మేడారం భక్తులకు సకల సౌకర్యాలు
  • - 80 శాతం నిర్మాణాలు పూర్తి
  • - మిగతావి త్వరలో పూర్తి చేసేలా చర్యలు
  • - జాతరకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం
  • - పసుపు బియ్యం, కుంకుమలకు ప్రత్యేక కౌంటర్లు
  • - జాతరలో డైరెక్టర్లతో విధులు
  • - మేడారం ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ ఆలం రామ్మూర్తి

ములుగు జిల్లా ప్రతినిధి/ నమస్తే తెలంగాణ: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సమ్మక్క-సారక్క మహాజాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని మేడారం ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ ఆలం రామ్మూర్తి స్పష్టం చేశారు. మేడారం జాతర ఏర్పాట్లపై ‘నమస్తే తెలంగాణ’తో చైర్మన్‌ మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే.. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినై. మంచి పంటలు పండినై. ప్రజలు సుఖఃసంతోషాలతో ఉండాలని వనదేవతలను కోరుకునేందుకు కుటుంబ సమేతంగా వచ్చే అవకాశాలున్నాయి. కోటిన్నరకు పైగా భక్తులు వస్తారని అధికారులు, మేం అంచనా వేసినం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సారి జాతరకు ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది. వాటితో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు స్థానిక మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జెడ్పీచైర్మన్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు జాతర పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నాణ్యతను చూస్తున్నారు. తల్లులను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పునరుద్ధరణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పిస్తున్నాం.

80 శాతం పనులు పూర్తి

మహాజాతరకు తరలివచ్చే భక్తుల అవసరాల చేపట్టిన అభివృద్ధి పనులు 80 శాతం పూర్తి కావచ్చాయి. భక్తులకు మిషన్‌ భగీరథ ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. వాటర్‌ ట్యాంకుల నిర్మాణం పూర్తికావచ్చాయి. కానీ, జాతర సమయానికి వినియోగంలోకి రాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. జాతర గద్దెల సమీపంలో రంగుల అలంకరణ సైతం 80 శాతం పూర్తి అయింది. 20వ తేదీ వరకు అన్ని పనులు పూర్తి చేయిస్తాం.

ప్రత్యేక కౌంటర్లు

వనదేవత సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరూ తల్లులకు బంగారం, పసుపు, కుంకుమ, పసుపు బియ్యం, సారె తదితర మొక్కులు చెల్లించే ఆనవాయతీ, సంప్రదాయం కొనసాగుతోంది. భక్తులు తెచ్చే పసుపు బియ్యం, కుంకుమను తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తాం. 1970-80వరకు తల్లుల ప్రసాదాన్ని పంపిణీ చేశాం. ప్రస్తుతం తల్లుల ప్రసాదాన్ని పంపిణీ చేయాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. పూజారులు, ఆదివాసీ సంఘాలతో మాట్లాడి వారి అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. వారి మనోభావాలను గౌరవిస్తూ వారి సూచనల మేరకు చర్యలు చేపడతాం.

డైరెక్టర్లతో విధులు

ఫిబ్రవరిలో జరిగే మేడారం మహాజాతరను విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరం శక్తివంచన లేకుండా పనిచేస్తాం. మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌, డైరెక్టర్లు 15 మంది 4 రోజుల పాటు ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి లోటు పాట్లు రాకుండా చూస్తారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తారు. ఎప్పటికప్పుడు దేవాదాయ శాఖ, వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ జాతరను విజయవంతంగా నిర్వహిస్తాం.logo