సోమవారం 03 ఆగస్టు 2020
Mulugu - Jan 14, 2020 , 03:19:49

16 మేడారంలోనే బస

 16 మేడారంలోనే బస
 • - అధికారులు స్థానికంగా ఉండాలి
 • -25 వరకు పనులు పూర్తి చేయాలి
 • -వసతులు కల్పించకపోతే కోట్ల మంది తిట్టిపోస్తరు..
 • -ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
 • -విధించిన గడువులు పెంచడం సరికాదు
 • -జంపన్నవాగులో పొరపాట్లకు తావివ్వకూడదు
 • -మేడారాన్ని పరిశుభ్రంగా ఉంచాలి
 • -పనుల్లో నాణ్యతపై థర్డ్‌ పార్టీతో విచారణ
 • -తప్పులు చేస్తే ఉపేక్షించేది లేదు
 • -గద్దెలను నిత్యం పూలతో అలంకరించాలి
 • -ప్లాస్టిక్‌ నిషేధంపై మాటల్లో కాదు చేతల్లో చూపించాలి
 • -సమీక్ష సమావేశంలో మంత్రి సత్యవతిరాథోడ్‌

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తేతెలంగాణ: ‘జాతర సమీపిస్తున్నది..అభివృద్ధి పనుల్లో వేగం పెరగాలె.. ఇందుకోసం ఈనెల 16వ తేదీ నుంచి ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు మేడారంలోనే ఉండాలె.. పనులను పరుగులు పెట్టించి 25వ తేదీకల్లా పూర్తి చేయాలి’.. అని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ ఆదేశించారు. సోమవారం మేడారం జాతర అభివృద్ధి పనులను ములుగు జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. మేడారం జాతర అభివృద్ధి పనుల్లో పురోగతి అనుకున్న స్థాయిలో లేదన్నారు. ఆయా శాఖలకు విధించిన గడువులను పెంచుకుంటూ పోవడం సబబుకాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంపన్నవాగులో నీటి నిల్వ సామర్థ్యం కోసం చేపట్టిన చదును పనులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. జంపన్నవాగుపై ఉన్న బ్రిడ్జి ఇరువైపులా ఉన్న రెయిలింగ్‌కు రంగులు వేయాలని గతంలో సూచించినా.. అధికారులు స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. జంపన్నవాగు కట్టపై ఏర్పాటు చేసిన కల్యాణ కట్టలో పరిస్థితులను భక్తులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి వచ్చి వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీవీఐపీ, వీఐపీ పార్కింగ్‌ ప్రదేశాలను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఐటీడీఏ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో లైన్‌ విభాగాలకు చెందిన అధికారులను పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తుల కోసం చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు మూడు నెలలుగా గడువులను  పెంచుతూ వస్తున్నారనే తప్ప..అనుకున్న స్థాయిలో అధికారులు పనులు చేపట్టడం లేదన్నారు. జాతర సమయం సమీపిస్తున్నదని, అభివృద్ధి పనులను పోలీసుల సాయంతో బాధ్యతాయుతంగా నిర్వహించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించాలని చెప్పారు. జాతరలో చేపట్టిన పనుల్లో అటవీ శాఖ ఇబ్బందులు కలిగించకుండా చూడాలని, ఈ విషయంపై రాష్ట్రస్థాయిలో పీసీసీఎఫ్‌ అధికారులతో మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. ఇక నుంచి మేడారం పనులను 3, 4 రోజులకోసారి వచ్చి పరిశీలిస్తానని చెప్పారు.

అమ్మవార్ల ప్రసాదం అందించేందుకు చర్యలు

మేడారం జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు అమ్మవార్ల ప్రసాదాలను అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. పోలీసులు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసేలా ప్రణాళికలను రూపొందించాలని చెప్పారు. జాతర నిర్వహణ తేదీలపై విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. జాతర ఆహ్వానాలు, ప్రచారానికి సంబంధించిన వివిధ రకాల వాల్‌ పోస్టర్లతో పాటు అనేక ప్రదేశాల్లో ప్రచార బోర్డులను ఏర్పాటు చేసి ప్రచారంపై దృష్టిసారించాలని సూచించారు.

నాణ్యతలో రాజీ లేదు

జాతరలో చేపట్టే పనుల్లో నాణ్యతపై రాజీపడేది లేదని, క్వాలిటీ కంట్రోల్‌ అధికారుల పర్యవేక్షణతో పాటు థర్డ్‌పార్టీతో పనుల నాణ్యతను పరిశీలిస్తామన్నారు. తప్పులు చేస్తే ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు మేలైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారనే అపవాదు మూటకట్టుకోవద్దని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో చిన్న మరమ్మతులతో జాతర నిర్వహించేలా పనులు నాణ్యతతో చేపట్టాలని చెప్పారు.   జంపన్నవాగులో గతంలో కొన్ని పొరపాట్లు  జరిగాయని, ఆ పొరపాట్లు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరుగుదొడ్లు, తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.

సర్వాంగసుందరంగా అలంకరించాలి..

మేడారంలోని రోడ్లను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలని, సంప్రదాయం ఉట్టి పడేలా చిత్రాలను వేయించాలని సూచించారు. జంపన్నవాగు పిల్లర్స్‌కు రంగులు వేసి, చిత్రాలను వేయాలని ఆదేశించారు. ఆదివాసీ సంప్రదాయాలకు లోటు రాకుండా చూడాలన్నారు. మేడారం జాతర ప్రాంగణాన్ని నిత్యం తోరణాలు, పూలతో అలంకరించాలని, జాతర ప్రాంగణమంతా దేదీప్యమానంగా వెలిగిపోయేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తల్లుల గద్దెల వద్ద  నూతన పందిళ్లను వేయాలని సూచించారు.

మాటలు కాదు.. చేతల్లో చూపాలి..

మేడారం జాతర ప్లాస్టిక్‌ ఫ్రీ జాతరగా సాగాలని, ఇది మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని మంత్రి అన్నారు. ప్లాస్టిక్‌ నిషేధంపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రకృతి ఒడిలో జరిగే వన జాతరకు వచ్చే భక్తులు అడవులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సహకరించాలని కోరారు. అడవులను పెంచుకోవాలని, అడవి ప్రసాదం ప్రకృతిని కాపాడుకోవాలని అన్నారు. అడవిలో విచ్చలవిడిగా వేస్తున్న ప్లాస్టిక్‌ పారిశుధ్య కార్మికులతో ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
 

25న నివేదికను అందించాలి 

జాతర నిర్వహణలో సమన్వయంతో పని చేయాలని, 25వ తేదీ వరకు అన్ని శాఖల పనులు పూర్తి కావాలని జెడ్పీచైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ అన్నారు. నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. క్వాలిటీ కంట్రోల్‌ నివేదిక తీసుకున్న తర్వాతే బిల్లుల చెల్లించాలని అన్నారు. జాతర నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అన్ని వర్గాల సహకారంతో ప్లాస్టిక్‌ ఫ్రీ జాతరను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

లోపాలను సరిదిద్దుకోవాలి 

 ఇప్పటి వరకు జరిగిన పనుల్లో లోపాలు ఉంటే అధికారులు సరిదిద్దుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క సూచించారు. వారంలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున వసతులను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. భక్తులకు కల్పించే వసతులు కేవలం 3,4 రోజులు అన్నట్టుగా కాకుండా అధికారులంతా సమన్వయంతో మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. జాతరకు 15 రోజుల సమయం మాత్రమే ఉందని అన్నారు. ఇప్పటికే భక్తులు ఎక్కువగా వస్తున్నందున ఆర్టీసీ అధికారులు అధికంగా బస్సులను నడిపించాలని కోరారు.

ప్లాస్టిక్హ్రిత జాతరకు చెక్‌పోస్టులు

మేడారం వచ్చే భక్తులు ప్లాస్టిక్‌ను తీసుకురావొద్దని, ప్లాస్టిక్‌ ఫ్రీ జాతరకు అందరూ సహకరించాలని ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు కోరారు. ప్లాస్టిక్‌ భూతాన్ని అడ్డుకోవడానికి  చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బస్సుల్లో ప్రయాణికులు ఎక్కే ముందే ప్లాస్టిక్‌ నియంత్రణపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. అన్ని బస్టాండ్‌ల వద్ద ప్లాస్టిక్‌ నియంత్రణ పోస్టర్లను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. జాతరకు వచ్చే భక్తుల కోసం 250 శాశ్వత మరుగుదొడ్లు వెంటనే ఉపయోగంలోకి తేవాలని సూచించారు. అన్ని శాఖల పనులు ఈ నెల 25 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బడే నాగజ్యోతి, జెడ్పీ సీఈవో పారిజాతం,  ఏఎస్పీ సాయిచైతన్య, డీఎఫ్‌వో నిఖిత, డీఆర్వో రమాదేవి, మేడారం పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ ఆలం రామ్మూర్తి, తాడ్వాయి ఎంపీపీ వాణిశ్రీ, మేడారం సర్పంచ్‌ బాబురావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రాంచంద్రు, డీపీవో వెంకయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ తుల రవి, డీడబ్ల్యూవో మల్లిశ్వరీ, డీఎస్‌డబ్ల్యూవో భాగ్యలక్ష్మి, ఈఈ పీఆర్‌ రాంబాబు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ మాణిక్యరావు, ఆర్‌అండ్‌బీ  వెంకటేశ్‌, ఈఓ రాజేంద్రం, అధికారులు పాల్గొన్నారు.logo