బుధవారం 05 ఆగస్టు 2020
Mulugu - Jan 14, 2020 , 03:17:55

జోరుగా కోడిపందేలు!

జోరుగా కోడిపందేలు!
  • -వాజేడు ఏజెన్సీలో నిర్వహణకు రంగం సిద్ధం
  • - సంక్రాంతి సందర్భంగా బరిలో దిగేందుకు పందెంరాయుళ్ల కసరత్తు
  • - కోళ్లకు భళే డిమాండ్‌
  • -చేతులు మారనున్న లక్షలాది రూపాయలు

వాజేడు ఏజెన్సీ పరిధిలో కోడిపందేలు నిర్వహించేందుకు పందెంరాయుళ్లు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా బరిలో దిగేందుకు కసరత్తు చేస్తున్నారు.       ఈ నేపథ్యంలో రూ. 1000-2000 వరకైనా వెచ్చించి పందెం కోళ్లను కొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కోడి పందేల నిర్వహణలో లక్షలాది రూపాయలు చేతులు మారనున్నాయి.
       - వాజేడు విలేకరి

వాజేడు, జనవరి,13: సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందెలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు సిద్ధమవుతున్నారు. వాజేడు ఏజెన్సీలోని అటవీప్రాంతాల్లో నిర్వహణకోసం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కాదంటే సరిహద్దు రాష్ర్టమైన ఛత్తీస్‌గఢ్‌లోని  తాళ్లగూడెం తదితర ప్రాంతాలకు తరలివెళ్లి అక్కడ నిర్వహించేందుకు సై  అంటున్నారు.  ఎవరు ఎన్ని చెప్పినా  పందెం రాయుళ్లు మాత్రం సంక్రాంతికి పందెం వేయకుండా ఉండరనేది జగమేరిగిన సత్యం. ఏజెన్సీలో ఆనవాయితీగా వస్తున్న కోడి పందెలు ఏటా ఏదో ప్రాంతాల్లో జరుగుతూనే ఉంటాయి. నిబంధనలు ఉన్నా పందెం రాయుళ్లకు  అవి ఏమా త్రం అడ్డు రావడంలేదు.  దీంతో ప్రతి సంవత్సరం పందెలా నిర్వహణ సహజమే అవుతోంది. జనవరి  వస్తుందంటే చాలు .. కోడిపందెలకు పందెం రాయుళ్లు సన్నాహాలు చేసుకుంటారు. ఇప్పటి నుంచే సిద్ధమవుతుంటారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగే కోడిపందెలకు  మండలంనుంచే గాక వివిధ ప్రదేశా ల నుంచి పందెంరాయుళ్ల పెద్ద ఎత్తున తరలివెళ్తారు. 

భారీగా చేతులు మారనున్న నగదు..

కోడిపందెలు ఎక్కడ.. ఎప్పుడు నిర్వహించిన రూ. లక్షల్లో చేతులు మారుతుంటాయి. దీంతో గెలిచిన వారిలో ఆనందం ఓడిన వారిలో నిస్తేజం అలుముకుంటుంది.

పందెం పుంజులకు భారీ డిమాండ్‌..

నాటుకోడి తినే వారు కేజీ రూ. 250 చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. అయితే పందెం సమయంలో కోడిపుంజులకు మాత్రం భారీ డిమాండ్‌ ఏర్పడుతుంది. కొంతమంది అమ్మకం దారులు ముందస్తుగా కోడిపుంజులను పెంపకం దారుల నుంచి కేజీ రూ.250 కొనుగోలు చేసి తరువాత రూ. 1000 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తూ లాభం పొందుతున్నారు. చేసేది ఏమిలేక పందెం పై పిచ్చి ఉన్న కోడిపందెలా రాయుళ్లు ఎంత ధరైన సరే కొనుగోళ్లకు వెనకడుగు వేయడం లేదు.

పెంపకం వెనుక కఠోరశ్రమ..

పెంపకందారులు పందెంలో పాల్గొనే కోడిపుంజులకు   పౌరుషం రావడానికి ఉల్లినుంచి తీసిన రసాన్ని మోతాదు ప్రకారం తాగిస్తారు. గాయాలు ఏర్పడితే వేడినీటితో స్నానం చేయించి వాటిని కన్నబిడ్డలా సాకుతారు. కూత  వచ్చిందంటే చాలు పుంజుకు 10నెలల వయసులోనే అమ్మకాలు, కొనుగోళ్లు జరుపుతారు. కోడిపుంజులను బరిలోకి దింపే వరకు ఇక వాటికి రాజభోగం పడుతుందనే చెప్పాలి. తొలిసారి గనుక పందెంలో గెలిచిందంటే అది మహారాజు. వీటినే జాతి పుంజులు అంటారు. ఇవి పందాల్లో మూడు నుంచి నాలుగేండ్ల వరకు పోరాడుతాయి.

కోడిపుంజుల్లో పలు రకాలు..

కోడిపుంజులను వాటి రంగులు, సైజులను బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. మిశ్రమ రంగులో ఉండేవాటిని 1. కోడి నెమలి, 2.పచ్చకాకి, 3.తెలుపు, 4.గౌడు, 5.నల్లసలవ, 6.పారేడ, 7.చిత్ర, 8.మైలా, 9.సేతువా, 10,కాకిరాయి, 11. పర్ల, 12.కాకి నెమలి, 13. పచ్చకాకిడేగ,14. పింగళ, 15. పండుడేగ  వివిధ రకాల పేర్లతో పిలుస్తారు.

కత్తులు కట్టె వారికి డిమాండ్‌..

పోటీల్లో పుంజులకు కత్తులు కట్టె వారికి భారీ డిమాండ్‌ ఉంటుంది. కత్తిని వదులుగా కడితే పొట్లాటలో ఊడే ప్రమాదం ఉంది. అలానే బిగించి కడితే కోడికాలుకు బిగుసుకుపోయే ప్రమాదం ఉంది. ఈ కారణంతో అనుభవం ఉన్న వారికి ఎక్కువ డబ్బులు చెల్లించి వారితోనే కత్తులు కట్టిస్తారు.

తలనొప్పిగా మారుతున్న పందెలు..

ఏటా కోడిపందెలు వచ్చాయంటే చాలు పోలీసులకు తలనొప్పిగా మారుతుంది. రాజకీయ నాయకులు చూసి చూడనట్లు పోమ్మనడం.. దానికి అధికారులు ససేమిరా అనడం అటు నాయకులకు ఇటు పోలీసులకు మధ్య అంతర్యం పెరగడం.. పందెం సమయాల్లో సాధారణ విషయం.
కోడి పందెలు నిర్వహిస్తే కఠినచర్యలు
-కాగితోజు శివప్రసాద్‌, వెంకటాపురం సీఐ

వెంకటాపురం సర్కిల్‌లోని వెంకటాపురం, పేరూరు, వాజేడు పోలీసుస్టేషన్ల పరిధిలో కోడిపందెలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. చట్ట విరుద్ధమైన పనులు చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. 

కోడిపందెలు నిర్వహించినా, ఆడినా చర్యలు

-కొప్పుల తిరుపతిరావు, ఎస్సై వాజేడు
మండలంలో కోడిపందెలు నిర్వహించినా, ఆడినా చర్యలు తప్పవు. అదేవిధంగా  పొరుగు రాష్ర్టాలకు కోడిపుంజులతో వెళ్లి పందెలు నిర్వహించి పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 


logo