మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Jan 13, 2020 , 03:43:53

మేడారంజనసంద్రం

మేడారంజనసంద్రం

ఆదివాసీ గిరిజన దైవాలైన మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు లక్ష మంది భక్తులు అమ్మవార్ల దర్శనానికి తరలిరావడంతో గద్దెల ప్రాంగణంతోపాటు జాతర పరిసరాలు రద్దీగా మారాయి.

  • గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో భక్తుల ప్రత్యేక పూజలు
  • ఎత్తు బంగారం సమర్పణ
  • వేలాదిగా వాహనాలు రావడంతో ట్రాఫిక్‌ను మళ్లించిన పోలీసులు
  • అదనపు క్యూలైన్లు, హుండీల ఏర్పాటు

తాడ్వాయి, జనవరి12: ఆదివాసీ గిరిజన దైవాలైన మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు లక్ష మంది భక్తులు అమ్మవార్ల దర్శనానికి తరలిరావడంతో గద్దెల ప్రాంగణంతోపాటు జాతర పరిసరాలు రద్దీగా మారాయి. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం తల్లుల గద్దెల వద్దకు చేరుకొని గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్ల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తు బెల్లం, చీరె సారెలను, ఒడివాల బియ్యం, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్ల దర్శనంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు క్యూలైన్లలను ఏర్పాటు చేశారు. 


అదనపు హుండీల ఏర్పాటు 

భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కానుకలు సమర్పించేందుకు దేవాదాయ శాఖ అధికారులతో పాటు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ ఆలం రామ్మూర్తి, ఈఓ రాజేంద్రం కలిసి అదనపు హుండీలను ఏర్పాటు చేశారు. సమ్మక్క గద్దెపై 10 హుండీలను, సారలమ్మ గద్దెపై 10 హుండీలను, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలపై ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు. 


భక్తులకు దూర దర్శనం 

ఊహించని విధంగా భక్తులు తరలిరావడంతో దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దూర దర్శనం కలిగించారు. గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్‌ను మూసివేసి బయటి నుంచి దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. 


బంగారం(బెల్లం) కోసం భక్తుల అవస్థలు 

భక్తులకు బయటి నుండి దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో బంగారం(బెల్లం) కోసం ఎగబడ్డారు. భక్తులు సమర్పించిన బంగారం గద్దెల లోపల వేస్తుండడంతో ప్రసాదం భక్తులకు అందకుండా పోయింది. దీంతో కాస్తా ప్రసాదం ఇవ్వండి అంటూ పోలీస్‌, దేవాదాయ శాఖ అధికారులను కోరారు.


ట్రాఫిక్‌ మళ్లింపు 

వేల సంఖ్యలో భక్తులు వాహనాల్లో తరలిరావడంతో సమస్యలు ఏర్పడకుండా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. జంపన్నవాగు నుండి గద్దెల సమీపం వరకు రెండు వైపులా వాహనాలు నిండిపోవడంతో చిలుకల గుట్ట, హరితహోటల్‌, మ్యూజియం, జంట వంతెల వద్ద పార్కింగ్‌ ప్రదేశాలకు మళ్లించారు. అయినప్పటికి భక్తులకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు. పస్రా సీఐ అనుముల శ్రీనివాస్‌, తాడ్వాయి ఎస్సై రవీందర్‌ ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను పర్యవేక్షించారు.


logo