గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Jan 13, 2020 , 03:43:00

పల్లెల అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి

పల్లెల అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి

పల్లెల అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ అన్నా రు. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం కేవలం 30 రోజులు, 10 రోజులు కాదని ఇది నిరంత ర ప్రక్రియ అన్నారు.

ములుగు, నమస్తేతెలంగాణ: పల్లెల అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ అన్నా రు.  సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం  కేవలం 30 రోజులు, 10 రోజులు కాదని ఇది నిరంత ర ప్రక్రియ అన్నారు. 2వ విడత పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలోని అంగడి మైదానంలో నిర్వహించగా జెడ్పీచైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌, ములుగు సర్పంచ్‌ బండారి నిర్మల హరినాథం, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుధీర్‌యాదవ్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీచైర్మన్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి కోసం ప్రతి  నెల గ్రామాల అభివృద్ధి రూ.339కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పల్లెలు ప్రగతి పథంలో నడవాలంటే రాజకీయాలకు తావు ఇవ్వొద్దని, అభివృద్ధిని మాత్రమే ధ్యేయంగా ఎంచుకొని ప్రజాప్రతినిధులు ముందుకు సాగాలన్నారు. గ్రామ పారిశుధ్యంలో కీలక పాత్ర పోషించేది కేవలం పారిశుధ్య కార్మికులేనని, వారి సేవలు ఎంతో విలువైనవన్నారు. రాబోయే తరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అందు కోసం సామాజిక బాధ్యతగా తమ ఇంట్లో మొక్కలను నాటాలన్నారు. ములుగు జిల్లా అడవులతో నిండిన ఆహ్లాద కర జిల్లా అని, పచ్చటి అడవులను కాపాడటంలో జిల్లా ప్రజలు తమ వంతు కృషి చేయాలన్నారు. వీధులు శుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పారిశుధ్య నిబంధనలు పాటించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో  వార్డు సభ్యులు, ఇతర వార్డు సభ్యులతో పోటీ పడి తమ వార్డులను అభివృద్ధి  చేస్తూ గ్రామ అభివృద్ధికి పాటు పడాలన్నారు. సీఎం కేసీఆర్‌ ములుగు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ములుగు అభివృద్ధికి తన వంత కృషి చేస్తానన్నారు.  


పారిశుధ్య కార్మికులకు పాదాభివందనం.. 

పల్లెలను పరిశుభ్రంగా  ఉంచడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ పారిశుధ్య కార్మికులకు పాదాభివందనం చేశారు. పల్లెల ప్రగతితోనే అభివృద్ధి  సాధ్యమని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటి విడతలో 30 రోజుల ప్రణాళికలో పల్లెలలో పరిశుభ్రత, పచ్చదనం పెంపు, డంపింగ్‌యార్డు, శ్మశాన వాటిక ఏర్పాటు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మొదటి విడతలో చేపట్టిన  మిగిలిన పనులను కొనసాగించడం కోసం ప్రభుత్వం 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పల్లెల పరిశుభ్రతలో ముఖ్యభూమిక పోషిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అపూర్వమైనవని , వారు అందిస్తున్న సేవలు ఎనలేనివని  ప్రశంసించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు.  పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తాను వాజేడు గ్రామపంచాయతీని సందర్శించిన క్రమంలో పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని గమనించానన్నారు. అలాంటి అధికారులను సస్పెండ్‌ చేయడంలో తాను వెనుకాడలేదని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. అనంతరం ‘ఈచ్‌ వన్‌-టీచ్‌ వన్‌ ’ కార్యక్రమంలో భాగంగా  నలుగురు నిరక్షరాస్యులైన వృద్ధులకు  జెడ్పీచైర్మన్‌, ఎంపీపీలు అక్షరాభ్యాసం చేయించారు. అదేవిధంగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మంజూరైన రూ.3లక్షల చెక్కును మత్స్యకార సహకార సొసైటీ సభ్యులకు అందించారు. అనంతరం 10 రోజుల పల్లె ప్రగతిని విజయవంతం చేసినందుకు గాను అధికారులు, పారిశుధ్య  కార్మికులను సన్మానించి మెమోంటోలు అందించారు. అలాగే ములుగు గ్రామ సర్పంచ్‌ బండారి నిర్మలహరినాథం జెడ్పీచైర్మన్‌, ఎంపీపీని సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీసీఈవో పారిజాతం, డీఆర్‌డీఏ పీడీ వసంతరావు, ఎంపీడీవో భూక్య రవి, డీఎల్‌పీవో దేవరాజు, ఎంపీవో హనుమంతరావు, ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య, ఉప సర్పంచ్‌ వంగ రవి సుమలత యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు. 


జేసీబీ,ట్రాక్టర్‌కు పూజలు..

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ములుగు గ్రామపంచాయతీకి మంజూరైన జేసీబీ, ట్రాక్టర్‌కు జెడ్పీచైర్మన్‌ జగదీశ్వర్‌.. సర్పంచ్‌, ఎంపీపీ, ఎంపీటీసీలు, వార్డు సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జేసీబీ, ట్రాక్టర్లను నడిపారు. ఈ సందర్భంగా జెడ్పీచైర్మన్‌ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌ను కేటాయిస్తుందన్నారు. ములుగు జిల్లాకు సీఎం కేసీఆర్‌ రెండు జేసీబీలను మంజూరు చేసినట్లు తెలిపారు. ట్రాక్టర్‌, జేసీబీని సద్వినియోగం చేసుకుని మేజర్‌ ములుగులో  పరిశుభ్ర వాతావరణం కల్పించాలన్నారు.  జిల్లా కేంద్రం అన్ని విధాలా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. 


logo