శుక్రవారం 14 ఆగస్టు 2020
Mulugu - Jan 13, 2020 , 03:42:13

సీఎం కేసీఆర్‌ దయతోనే కాళేశ్వరం నీళ్లు..

సీఎం కేసీఆర్‌ దయతోనే కాళేశ్వరం నీళ్లు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దయతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు సాగు నీరు, తాగు నీరు అందుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

పర్వతగిరి, జనవరి 12 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దయతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు సాగు నీరు, తాగు నీరు అందుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి   ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పర్వతగిరి శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో దాదాపు రెండు గంటల సేపు కాలినడకన ఆయన కలియదిరిగారు. ఈ సందర్భంగా ట్రాక్టర్‌తో దుక్కి దున్నారు. పొలం పనుల్లో పాలు పంచుకుని కూలీలతో కలిసి నాటు వేశారు. పంచె కట్టుకుని సాదా సీదాగా పొలాల్లో తిరుగుతూ పనులపై ఆరా తీశారు. అనంతరం మంత్రి దయాకర్‌రావు విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ దయతోనే కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయిందన్నారు. ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు పల్లెల్లో గలగలా పారుతున్నాయన్నారు. తన తండ్రి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారని, గతంలో నీళ్లు లేక రైతులు అవస్థలు పడ్డారన్నారు. అప్పట్లో  నీళ్ల సౌకర్యం సరిగా లేక భూములను అమ్ముకున్నామని చెప్పారు. కానీ, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దయతో సాగు, తాగు నీటికి ఇబ్బందులు లేవన్నారు. రైతు కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు.  గొప్ప ఇంజినీర్‌గా అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించి రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేశారని కొనియాడారు. సీఎం దయతోనే చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు. 


‘ఈ రోజు  మా వ్యవసాయం చూద్దామని వచ్చాను. మూడేళ్లుగా కౌలుకు ఇస్తున్న.. బోర్లతో ఇబ్బందులు, ఎస్సారెస్పీ కాల్వ నీరు రాక గతేడాది నాటు వేయకుండా భూమి వృథాగా ఉండేది. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు రావడంతో ఆనందంగా నాట్లు వేయడానికి సిద్ధం చేస్తున్నా. కాంగ్రెస్‌ పాలనలో జనరేటర్‌ కొన్నాం. చాలా సార్లు రిపేరు వచ్చేది. మోటార్లు పని చేయకపోయేది. మోటార్లు కాలిపోయేవి. కేసీఆర్‌ పాలనలో 24 గంటలు కరంటు ఇస్తున్నారు. కాళేశ్వరం ద్వారా, ఎస్సారెస్పీ నీళ్లు వస్తున్నాయి. గతంలో రిజర్యాయర్‌ ఉన్నా ఎస్సారెస్పీ కాల్వలో నీళ్లు రాలేదు. బాబ్లీ ప్రాజెక్టు కోసం పోలీసులతో దెబ్బలు తిని జైలుకు వెళ్లా. మహారాష్ట్రకు వెళ్లి తన్నులు పడ్డా. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ దయతో ఎవ్వరికి అంతుబట్టని విధంగా నీళ్లు వస్తున్నాయి. 70 ఏళ్లలో కాళేశ్వరం నీళ్లు వాడుకోవాలనే ఆలోచన ఏ ముఖ్యమంత్రికి రాలేదు. సీఎం కేసీఆర్‌ ఇంజినీర్‌గా మారి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించారు. చెక్‌డ్యామ్‌లు నిండి చెరువులు మత్తడి పడుతున్నాయి. ఇప్పుడు నిత్యం నీళ్లు రావడంతో రైతులు సంబురంగా వ్యవసాయం చేస్తున్నారు.  మూడేళ్లుగా మా వ్యవసాయం భూమిని కౌలుకు ఇస్తున్నాం. ఇప్పుడు నీళ్లు పుష్కలంగా రావడంతో సొంతంగా చేస్తున్నా. 30 ఎకరాల్లో నాట్లు వేసేందుకు సిద్ధం చేస్తున్నా. గతంలో చదువుకునే రోజుల్లో వ్యవసాయం చేసి దున్నేవాడిని, నా కుమారుడు ప్రేమ్‌కుమార్‌రావు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడు. తనతో వ్యవసాయ పొలాలకు వెళ్లి రావాలని ఇక్కడికి వచ్చానని’ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంత్రి వెంట వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌ డైరెక్టర్‌ పల్లెపాటి శాంతిరతన్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్‌, సర్పంచ్‌ చింతపట్ల మాలతీ, ఎంపీటీసీ  మాడ్గుల రాజు, రైతు సమన్వయ సమితి నాయకులు చింతపట్ల సోమేశ్వర్‌రావు, ఉపసర్పంచ్‌ రంగు జనార్దన్‌గౌడ్‌, నాయకులు గోనె సంపత్‌, దేవిలాల్‌ నాయక్‌, నాగుల బాబు తదితరులు ఉన్నారు. 


logo