ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Jan 12, 2020 , 04:24:17

ఎన్నికలేవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే..

ఎన్నికలేవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే..
  • -ప్రభుత్వ పనితీరే ఇందుకు నిదర్శనం
  • -భూపాలపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరాలి
  • -30 వార్డులను కైవసం చేసుకోవాలి
  • -పదవులు రాని వారికి గుర్తింపు ఉంటుంది
  • -నా ఓపికకు సీఎం బహుమానం ఇచ్చారు
  • -మంత్రి సత్యవతి రాథోడ్‌

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. శనివారం భూపాలపల్లిలోని భారత్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశానికి అర్బన్‌ పార్టీ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి అధ్యక్షత వహించగా, మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అందిస్తున్న పాలన దేశానికే ఆదర్శమన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఇటీవల జరిగిన ఎన్నికలు నిరూపించాయన్నారు. తెలంగాణ రాక ముందు, తెలంగాణ వచ్చాక రాష్ట్ర పరిస్థితిని గమనిస్తే అభివృద్ధి అవగతమవుతుందని చెప్పారు. సిరికొండ మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లిని ఊహించని విధంగా అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రంలో రైతుబంధు, ఉచిత కరంటు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని, వీటిని ఇతర రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయన్నారు. మినీ ఇండియాగా పేరొందిన హైదరాబాద్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్‌ నాయకత్వంలో గత ఎన్నికల్లో వంద స్థానాలు గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక ఉద్యమ స్ఫూర్తితో జరిగిన ఎన్నికల్లో 80 స్థానాలు గెలుపొందడం జరిగిందని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇలాకాలో టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు.

ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో రెండు మూడు స్థానాలు ఇతర పార్టీలు కైవసం చేసుకొని మిడిసిపడుతున్నాయని, వారి మిడిసిపాటును ప్రజలు గమనించి ఛీ కొట్టారన్నారు. గడిచిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 32 జెడ్పీలకు 32 స్థానాలు గెలిపించి ప్రతిపక్షాల చెంప చెల్లుమననేలా తీర్పునిచ్చారని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఇదే సీన్‌ రిపీట్‌ అవుతుందని తెలిపారు. కేసీఆర్‌, కేటీఆర్‌పై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగిస్తుందన్నారు. తాను టీడీపీలో పని చేసి రాజీనామా చేశానని, అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయానన్నారు. 2018లో టికెట్‌ ఆశించి సీఎం కేసీఆర్‌ సూచనతో విరమించుకున్నానని, నా ఓపికకు సీఎం కేసీఆర్‌ మంత్రి పదవిని బహుమానంగా ఇచ్చారని చెప్పారు. దయాకర్‌ ఒక ఆర్టిస్ట్‌ అని, టికెట్‌ రాలేదని అతను నిరుత్సాహం చెందలేదని, సీఎం అతడిని ఎంపీ స్థానానికి పోటీ చేయించి ఖర్చులు కూడా భరించి గెలిపించారని గుర్తు చేశారు. అభ్యర్థులకు ఓపిక అనేది అవసరమని, ఆ ఓపికే వారిని ఉన్నత స్థానానికి చేర్చుతుందన్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని అభ్యర్థులు పట్టువిడుపులతో పని చేయాలని, 30 స్థానాల్లో గెలుపొందేలా ప్రణాళిక రూపొందించి పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో వరంగల్‌ రూరల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జెడ్పీ చైర్‌పర్సన్లు గండ్ర జ్యోతి, జక్కు శ్రీహర్షిణి, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ కల్లెపు శోభ, ఎంపీపీ లావణ్య, మహిళా ఆర్గనైజర్‌ భారతిరెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి సంపూర్ణ, జెడ్పీటీసీలు జోరుక సదయ్య, తిరుపతిరెడ్డి, నేతలు మేకల సంపత్‌యాదవ్‌, బుర్ర రమేశ్‌, మందల రవీందర్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, బండారి రవి, కల్లెపు రఘుపతిరావు, కొక్కుల తిరుపతి, జక్కిరెడ్డి, పైడిపల్లి రమేశ్‌, గులాం అఫ్జల్‌, పొక్కూరి చిన్నరాజయ్య, పూలమ్మ, తిరుపతమ్మ పాల్గొన్నారు.


logo