మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Jan 12, 2020 , 04:10:13

కేసీఆర్‌పైనే ప్రజలకు విశ్వాసం

కేసీఆర్‌పైనే ప్రజలకు విశ్వాసంనర్సంపేట, నమస్తేతెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని ప్రభుత్వ చీఫ్‌విప్‌, నర్సంపేట మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. శనివారం  స్థానిక ఆర్యవైశ్య కల్యాణమండపంలో విలేకరుల సమావేశం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలపై  గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు.  ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షే పథకాలను సీఎం కేసీఆర్‌  తెలంగాణలో ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. బీడీ కార్మికులు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఉన్నారు కానీ, ఒక్క తెలంగాణలోనే బీడీ కార్మికులకు పింఛన్‌ అందిస్తున్నారని ఆయన వివరించారు. ఇలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ప్రజలందరూ  కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలుస్తుందన్నారు.  ఆరేళ్ల కిందట టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని గుర్తుచేశారు.  మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు క్యాడర్‌ లేదని, బీజేపీకి లీడర్‌ లేరని అన్నారు. నర్సంపేట పట్టణంలో పదివేల కుటుంబాలు ఉంటే 9500 కుటుంబాలకు ప్రభుత్వ పథకాలతో లబ్ధి చేకూరిందని అన్నారు.  సాయం అందిన ప్రజలు ప్రభుత్వంపై తప్పకుండా విశ్వాసం కలిగి ఉంటారని అన్నారు. లబ్ధిదారులు తప్పకుండా టీఆర్‌ఎస్‌కు ఓటు వేయడంతో 24స్థానాలు గెలుపొంది తీరుతామని శపథం చేశారు.  ప్రజలు కూడా టీఆర్‌ఎస్‌పై నమ్మకంతో ఓట్లేస్తారని అన్నారు. ఈనెల 22న జరిగే ఎన్నికల్లో  గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు.

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి రూ.260 కోట్ల నిధులతో నర్సంపేటను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారని అన్నారు. నర్సంపేటను మోడల్‌సిటీగా తీర్చిదిద్దేందుకు పెద్ది నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.  నర్సంపేటలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూస్తే  గర్వంగా ఉందన్నారు.  ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పట్టుదల, శ్రద్ధతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను ఒప్పించి నిధుల వరద పారిస్తున్నారని ప్రశంసించారు.   ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారని కొనియాడారు.  మున్సిపాలిటీలో టికెట్‌ రాని నాయకులకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని, కార్పొరేషన్‌ పదవులు కట్టబెడుతామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ  పట్టణ అభివృద్ధి కోసం నిత్యం పాటుపడుతున్నానని అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఎంతో నమ్మకంతో నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు.  నర్సంపేట ప్రాంత అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఎన్నికల్లో అన్ని వార్డులను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో  మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్‌, బీరం సంజీవరెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, డాక్టర్‌ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, కామనోగి శ్రీనివాస్‌, నాయిని నర్సయ్య, నల్ల మనోహర్‌రెడ్డి, అజీజ్‌, గుంటి కిషన్‌, జెడ్పీ వైస్‌చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, రాణాప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo