ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Jan 09, 2020 , 19:08:57

మున్సిపోల్స్‌కు గ్రీన్‌సిగ్నల్

మున్సిపోల్స్‌కు గ్రీన్‌సిగ్నల్

-ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రిజర్వేషన్లు ఖరారు కాకుండా షెడ్యూల్ ప్రకటించారని వేసిన పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆ పిటీషన్‌ను కొట్టి వేయడంతో ఉత్కంఠ తొలగిపోయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని పేర్కొంటూ నోటిఫిటికేషను జారీ చేసింది. ఈనెల 8వ తేదీ(నేటి) నుంచి పదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, జనవరి 11న నామినేషన్ల పరిశీలన, జనవరి 14న నామినేషన్ల ఉపసంహరణ, 22వ తేదీన పుర ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. జనవరి 25న ఓట్లలెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌లో పేర్కొంది.
-నోటిఫికేషన్ విడుదల
-ఉత్కంఠకు తెర
- నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
-11వ తేదీ నామినేషన్ల పరిశీలన
-నామినేషన్ల ఉపసంహరణకు గడువు 14వ తేదీ వరకు
-22న పోలింగ్
-25న లెక్కింపు, ఫలితాలు..
-రంగం సిద్ధం చేసిన అధికారులు
-వేడెక్కిన రాజకీయ వాతావరణం
- రేపు టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం
జయశంకర్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికలు యథావిధిగా నిర్వహించుకోవచ్చని హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు మళ్లీ వాయిదా పడుతాయా.. కోర్టు తీర్పు వాయిదా వేస్తుందా.. ఇలా అనేక సందేహాలను పటాపంచలు చేస్తూ హైకోర్టు మున్సిపాలిటీ ఎన్నికలపై మంగళవారం సాయంత్రం తీర్పునిచ్చింది. దీంతో ఆశావహులకు ఉపశమనం లభించింది. మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరగడం లేదని ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ మార్పు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీర్పునిచ్చేవరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వరాదని హైకోర్టు ఆదేశిస్తూ తీర్పును మంగళవారానికి వాయిదా వేసిన విషయం విధితమే. కాగా, సోమవారం నుంచి అన్నీ సిద్ధం చేసుకున్న ఆశావహులు కోర్టు తీర్పు కోసం ఉత్కంఠతో ఎదురు చూశారు. మంగళవారం ఉదయం నుంచి రాజకీయ పార్టీ నాయకులు, ఆశావహులు టీవీలకు అతుక్కుపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో పోటాపోటీగా వాదనలు జరిగాయి. చివరికి మంగళవారం సాయంత్రం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపుతూ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. రాజకీయ పార్టీలు, పోటీదారులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఎవరి పని వారు చేసుకుపోతున్నారు. జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించేందుకు నిర్ణయించారు.

కొనసాగుతున్న ప్రక్రియ
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఎవరి పని వారు చేసుకుపోతున్నారు. డిసెంబర్ 23న మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాగా, అధికారులు ఎన్నికల కోసం ఏర్పాట్లను ప్రారంభించారు. ప్రభుత్వం అందించిన షెడ్యూల్‌ను అనుసరిస్తూ కుల ఓటరు గణన పూర్తి చేశారు. భూపాలపల్లి పట్టణంలోని 30 వార్డుల్లో వార్డుల వారీగా కులాలు, మహిళ, పురుష ఓటరు జాబితాను సిద్ధం చేసి అభ్యంతరాలను పరిష్కరించి ఈ నెల 4న ఫైనల్ జాబితాను విడుదల చేశారు. డీఎంఏ సర్క్యూలర్ ప్రకారం ఈ నెల 5న కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు డ్రా ద్వారా వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులుండగా 50,651 మంది ఓటర్లున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా, 30 వార్డుల్లో 15 జనరల్ కేటగిరి, 15 ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు రిజర్వ్ చేశారు. ఇక నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి కాంగ్రెస్ నాయకులు కోర్టును ఆశ్రయించి నోటిఫికేషన్‌ను అడ్డుకున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

కోర్టు తీర్పుతో ఏర్పాట్లు వేగవంతం
మున్సిపల్ ఎన్నికలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పునివ్వడంతో అధికారులు పనులు వేగవంతం చేశారు. కోర్టు ఎన్నికలను వాయిదా వేస్తుందా.. తీర్పు ఎలా ఉంటుందో అనే సందేహాల మధ్య అధికారులు మంగళవారం భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో రాజకీయ పార్టీ నాయకులతో పోలింగ్ స్టేషన్లపై సమావేశం నిర్వహించారు. రేపు (బుధవారం) పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు తెలియజేయాలని, గురువారం అభ్యంతరాలు పరిష్కరించి పోలింగ్ స్టేషన్లను ఫైనల్ చేస్తామని అధికారులు రాజకీయ పార్టీ నాయకులకు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో 71 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే వార్డుల వారీగా భవనాలను గుర్తించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 71 పోలింగ్ కేంద్రాలు, మున్సిపల్ ఎన్నికలకు 235 బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి 13 మంది రిటర్నింగ్ అధికారులు వీరికితోడుగా మరో 13 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను గుర్తించారు. ప్రతి మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ ఆఫీసర్, మరో సహాయ రిటర్నింగ్ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహించేలా విధి విధానాలు ఖరారయ్యాయి. రెండు చెక్ పోస్టులు, మూడు ఫ్లయింగ్ స్కాడ్‌లు, ఒక చెక్ పోస్టును చెల్పూర్ వద్ద, మరో చెక్‌పోస్టును కాటారం రూట్‌లో ఏర్పాటు చేస్తున్నారు. మూడు ఫ్లయింగ్ స్కాడ్‌లను, మూడు ఎంసీసీ టీంలను ప్రతిపాదించారు. రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు ఇప్పటికే రెండు దఫాలుగా శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 9న పీవోలు, ఏపీవోలకు రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.


logo