e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జనగాం బోడగుట్టే చిట్టడవై..

బోడగుట్టే చిట్టడవై..

బోడగుట్టే చిట్టడవై..

‘హరితహారం’తో నేలకు పునర్జీవం
నాటి పాలకుల నిర్లక్ష్యంతో వృథాగా..
నేడు బీహెచ్‌ఏ ప్లాంటేషన్‌తో పచ్చగా..
కంపా నిధులతో 13.25 హెక్టార్లలో 6928 మొక్కలు
నాలుగేళ్లలో ఏపుగా పెరిగి.. మహా వృక్షాలుగా మారి
జిల్లా అటవీ అధికారుల కృషికి దక్కిన ఫలితం

ములుగు, జూలై 16 (నమస్తే తెలంగాణ) : ఎక్కడచూసినా రాళ్లూరప్పలు, గుంతలతో వ్యవసాయానికి కూడా పనికి రాని ములుగు మండలంలోని బోడగుట్ట.. ఇప్పుడు పచ్చని వనమైంది. నాటి పాలకుల నిర్లక్ష్యంతో 13.25 హెక్టార్ల స్థలం వృథాగా పడి ఉండగా, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ తలపెట్టిన ‘హరితహారం’తో ఈ నేల పునర్జీవం పోసుకుంది. ఇలాంటి ప్రాంతాల్లో అనుసరించే బీహెచ్‌ఏ(బ్యారెన్‌ హిల్‌ అఫారెస్టేషన్‌) విధానం ద్వారా నాలుగేళ్ల క్రితం మర్రి, రావి, కానుగ, వేప, నెమలినార జాతికి చెందిన 6,928 మొక్కలు నాటగా, నేడు అవి వృక్షాలై చిట్టడవిని తలపిస్తోంది. కంపా నిధుల సహకారం, జిల్లా అటవీ శాఖ ప్రత్యేక కృషితో ప్లాంటేషన్‌ సక్సెస్‌ కాగా, త్వరలో ఫెన్సింగ్‌ ఏర్పాటుకానుంది.

పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తున్నది. కంపా నిధులతో బ్యారన్‌ హిల్‌ అఫారెస్టేషన్‌ (బీహెచ్‌ఏ) పద్ధతిలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నాలుగేళ్లలో మహావృక్షాలుగా మారాయి. ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ శివారులోని బోడగుట్ట వద్ద 13.25 హెక్టార్ల ప్రభుత్వ భూమిలో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటి చిన్నపాటి అడవినే సృష్టించారు. నాడు రాళ్లు, రప్పలతో నిండి నిర్జీవంగా ఉన్న ప్రాంతం ఇప్పుడు పచ్చని చెట్లతో ఆహ్లాదం పంచుతున్నది.
2004-2005 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల డివిజన్‌లో రామకృష్ణాపూర్‌ ఓపెన్‌ కాస్టు ఏర్పాటు కోసం అటవీ శాఖకు చెందిన 202.50 హెక్టార్ల భూమిని అప్పగించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామం వద్ద సర్వే నంబర్‌ 638లో సీఏ ల్యాండ్‌ కింద 13.25హెక్టార్ల భూమిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఆ సంవత్సరం అటవీ శాఖ అధికారులు ఈ భూమిలో 400 మొక్కలు నాటారు. నిధుల కొరత, అప్పటి అధికారుల అలసత్వంతో కేవలం 35 మొక్కలు మాత్రమే దక్కాయి. దీంతో బోడగుట్టపై మొక్కలను బతికించడం కష్టమని భావించి గాలికి వదిలేశారు.

- Advertisement -

స్వరాష్ట్రంలో మారిన పరిస్థితి..
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ఈ గుట్టపై అడవిని సృష్టించేందుకు అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. మట్టి శాతం తక్కువగా ఉండి రాళ్లు, రప్పలు ఉన్న ప్రదేశాల్లో ఏ జాతికి చెందిన మొక్కలు బతుకుతాయో నిర్ధారించుకుని వాటినే నాటారు. 2014-15లో నాలుగు హెక్టార్ల విస్తీర్ణంలో 10 మీటర్ల దూరానికి ఒక మొక్క చొప్పున మొత్తం 400 మొక్కలు నాటారు. ప్రతి సంవత్సరం సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు ఎండిపోయిన వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటారు. 2018-19 సంవత్సరంలో హరితహారంలో భాగంగా 13.25 హెక్టార్లలో మర్రి, రావి, కానుగ, వేప, నెమలినార జాతికి చెందిన 6,928 మొక్కలు నాటారు. రాళ్లను తొలగించి ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టానికి చెందిన కూలీలతో సుమారు ఆరు నెలల పాటు ప్లాంటేషన్‌ పనులు చేయించారు. ఏటా 20శాతం మొక్కలు చనిపోతున్న క్రమంలో వాటి స్థానంలో ఎప్పటికప్పుడు మొక్కలు నాటించి డిసెంబర్‌ నుంచి జూన్‌ మాసం వరకు ట్యాంకర్ల సాయంతో నీటిని అందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాచర్‌ను నియమించారు. అప్పటి ఎఫ్‌డీవోలు ప్రకాశ్‌, రామ్మోహన్‌రావు, సెక్షన్‌ ఆఫీసర్లు బాలాజీ, రమేశ్‌, వాచర్‌ సాంబయ్య మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రభుత్వ బంజరు భూమిని అటవీ శాఖకు అప్పగించే క్రమంలో అడ్డు చెప్పిన గ్రామస్తులు సైతం ప్రస్తుతం పచ్చదనంతో విలసిల్లుతున్న బోడగుట్టను చూసి ప్రభుత్వం, ఫారెస్ట్‌ అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

త్వరలో ఫెన్సింగ్‌ ఏర్పాటుచేస్తాం..
క్షీణించిన అడవుల స్థానంలో కంపా నిధులతో చేపట్టిన బోడగుట్ట ప్లాంటేషన్‌ చుట్టూ త్వరలో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయనున్నాం. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటి సంరక్షిస్తాం. నాలుగేళ్లుగా అటవీ అధికారులు చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. అందరం కలిసి చిన్నపాటి అడవినే సృష్టించగలిగాం.

  • డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌ శెట్టి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బోడగుట్టే చిట్టడవై..
బోడగుట్టే చిట్టడవై..
బోడగుట్టే చిట్టడవై..

ట్రెండింగ్‌

Advertisement