అదేంటి.. వరుస విజయాలతో దూసుకుపోతున్న సంచలన దర్శకుడు అనిల్ రావిపూడికి షాకులు తగలడం ఏంటి అనుకుంటున్నారా..? నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఎందుకంటే 2021 ఈయనకు పెద్దగా కలిసి వచ్చినట్లు కనిపించడం లేదు. ఇప్పటివరకు ఈ ఏడాది ఆయన తెరకెక్కించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.. మరి 2021 అనిల్ రావిపూడికి కలిసి రాలేదని మీరు ఎలా చెబుతారు అని అనుమానం రావచ్చు. ప్రస్తుతం ఈయన వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ‘ఎఫ్ 3’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కేవలం తన సినిమా మాత్రమే కాకుండా ఇతర సినిమాల్లో కూడా వేలు పెడుతున్నాడు అనిల్. ఇక్కడే అసలు సమస్య వస్తుంది.
ఆయన బ్రాండ్ చెప్పుకొని వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. దాంతో తెలియకుండానే అనిల్ రావిపూడి ఇమేజ్ దెబ్బ తింటుంది. ఈమధ్య విడుదలైన ‘గాలి సంపత్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అనిల్ రావిపూడి చేశాడు. డైరెక్టర్ తేజ స్టైల్లో ఇంటర్వెల్లో తన పేరు వేసుకున్నాడు అనిల్. ఈ సినిమాను పూర్తిగా ఈయన పేరు మీద అమ్మేశారు. కానీ విడుదలైన తర్వాత గాలి సంపత్ గాలిలో కలిసిపోయింది.
ఇదిలా ఉంటే ఏడాది మొదట్లోనే అనిల్ రావిపూడికి మరో షాక్ తగిలింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో కొన్ని సన్నివేశాలు అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో చిత్రీకరించాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఈ విషయం స్వయంగా హీరో బెల్లంకొండ చెప్పాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై అత్యంత దారుణంగా నిరాశపరిచింది. దాంతో అక్కడ కూడా అనిల్ రావిపూడి మ్యాజిక్ పని చేయలేదు. దాంతో ఈ దర్శకుడికి వరుస షాకులు తగిలాయి. దర్శకుడిగా తిరుగులేని అనిల్ రావిపూడి తన సినిమాలు కాకుండా ఇతర సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టి అసలుకే మోసం వచ్చేలా చేస్తున్నాడు అంటూ అభిమానులు ఆయనపై కోపంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ‘ఎఫ్ 3’ సినిమా ఎలా వస్తుందో అని డిస్ట్రిబ్యూటర్లలో కూడా ఒకింత టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అనిల్ రావిపూడి సైడ్ బిజినెస్ మానుకొని మెయిన్ బిజినెస్‌పై ఫోకస్ పెడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు ఆయన శ్రేయోభిలాషులు.