e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home బతుకమ్మ ఆ రెండూ నచ్చితే… ఓకే!

ఆ రెండూ నచ్చితే… ఓకే!

ఆ రెండూ నచ్చితే… ఓకే!

అజయ్‌ పేరు చెప్పగానే ‘విక్రమార్కుడు’చిత్రంలో క్రూర ప్రతినాయకుడు టిట్లా
గుర్తుకువస్తాడు. భయంకరమైన విలనిజానికి ప్రతీకలాఆ పాత్ర నిలిచిపోయింది. కెరీర్‌ ఆరంభం నుంచి నెగెటివ్‌ పాత్రలద్వారానే పేరు తెచ్చుకున్న అజయ్‌ క్రమంగా పంథా మార్చుకున్నారు.క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనను తాను భిన్న పార్శాల్లో ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ‘నటనలో పర్‌ఫెక్షన్‌ అంటూ ఏమీ ఉండదు! నిరంతరంకొత్తదనాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగడమే మన విధి’ అంటున్న అజయ్‘బతుకమ్మ’తో తన అంతరంగాన్ని ఆవిష్కరించారిలా..

సినీరంగంలో ప్రవేశించి 20 ఏండ్లవుతున్నది. జయాపజయాలు, ఒడుదొడుకులు ఎన్ని ఉన్నా ఇంకా నటుడిగా ప్రయాణంసాగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నా. ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ఆదరణ మరిన్నిమంచి పాత్రలు చేసే కొత్త ఉత్సాహాన్నిస్తున్నది.

‘విక్రమార్కుడు’ చిత్రం ప్రతినాయకుడిగా నా కెరీర్‌కు పెద్ద బ్రేక్‌నిచ్చింది. ఆ ఇమేజ్‌వల్ల తదుపరి సినిమాల్లోకూడా మెయిన్‌ విలన్‌గా చేస్తేనే బాగుంటుందని నిర్ణయించుకున్నా. దాదాపు ఏడెనిమిది నెలలు వేచి చూసి ‘లక్ష్మీ కల్యాణం’ చేశాను. ఆ సినిమాలోనూ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించాను. దురదృష్టవశాత్తు ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఆ తర్వాత తమిళంలో అజిత్‌ సినిమాలో మెయిన్‌ విలన్‌గా చేశాను. ‘విక్రమార్కుడు’ లాంటి భయంకరమైన ప్రతినాయకుడి పాత్రలు అరుదుగా దొరుకుతుంటాయి. నాకు తెలిసి ఇన్నేండ్ల తెలుగు సినిమా చరిత్రలో ఆ స్థాయి క్రూరత్వం పండించిన విలనీ క్యారెక్టర్స్‌ ఓ పది వరకు మాత్రమే ఉంటాయనుకుంటున్నా.

వయసుతో పరిమితులు
‘విక్రమార్కుడు’ తర్వాత ఆ స్థాయి విలన్‌ రోల్‌ ఎందుకు చేయలేద’ని చాలామంది అడుగుతుంటారు. దర్శకుడు రాజమౌళి గారు టిట్లాగా నా పాత్రను పతాకస్థాయి విలనిజమ్‌తో డిజైన్‌ చేశారు. అంతకుమించి భయంకరంగా ఎవరూ ప్రతినాయకుడి పాత్రను ఆవిష్కరించలేరు. ఆ క్యారెక్టర్‌ తర్వాత విలన్‌గా ఎన్ని కథలు వచ్చినా ఆ పాత్ర ముందు చిన్నవిగా అనిపించేవి. ఈ క్రమంలో నటుడిగా నా ప్రాథమ్యాల్ని మార్చుకున్నా. క్రమంగా కథా పరంగా మంచి క్యారెక్టర్స్‌ ఎంచుకుంటూ సినిమాలు చేశాను. ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘ఇష్క్‌’, ‘అల వైకుంఠపురములో’ లాంటి సినిమాలు నన్ను కొత్త కోణంలో చూపించాయి. ఆర్టిస్టుల వయసు పెరుగుతుంటే పాత్రల పరంగా పరిమితులు ఏర్పడతాయి. అందుకే, నేను పూర్తిస్థాయి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారాను. ప్రస్తుతం అన్ని రకాల పాత్రలు చేస్తూ కెరీర్‌లో బిజీగా ఉన్నా.

నచ్చకపోతే తిరస్కరిస్తున్నా
ఇప్పటి వరకు నేను రెండొందలకుపైగా సినిమాలు చేశాను. వాటిలో ఓ పది కథల్ని మాత్రమే ముందుగా విని ఓకే చేసుంటాను. మిగతా సినిమాల్లో నా పాత్ర గురించి సెట్స్‌ దగ్గరే అడిగి తెలుసుకునేవాణ్ణి. కొన్ని కథలు నచ్చకపోయినా చేసిన సందర్భాలున్నాయి. అయితే, కొద్దికాలంగా కథల ఎంపికలో నా ప్రాధాన్యాలు మారాయి. ఒకప్పటిలా చాన్స్‌ రాగానే ఒప్పేసుకోకుండా సినిమా కథ, నా పాత్ర గురించి పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకుంటున్నా. చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రల్ని తిరస్కరిస్తున్నా. నాణ్యమైన సినిమాల్ని ఎంపిక చేసుకోవాలన్న తపన పెరిగింది.

లీడ్‌రోల్స్‌కు దూరంగా ఉన్నా
‘సారాయి వీర్రాజు’, ‘ఆ ఒక్కడు’ చిత్రాల్లో నేను కథానాయకుడిగా నటించాను. ఆ సినిమాలు వ్యక్తిగతంగా నాకు సంతృప్తినిచ్చాయి. ఆ తర్వాత లీడ్‌ రోల్స్‌లో నటించలేదు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నన్ను నేను ఇంకా ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ చేసుకోవాలనే ఆలోచనతో లీడ్‌ రోల్స్‌కు దూరంగా ఉన్నా. నా ఉద్దేశంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టులకే వైవిధ్యమైన పాత్రల్ని పోషించే అవకాశం ఎక్కువగా దొరుకుతుంది. నటుడిగా ప్రస్తుతం ట్రాన్స్‌ఫర్మేషన్‌ టైమ్‌లో ఉన్నాననుకుంటున్నా. ఇప్పుడు నేను యంగ్‌ విలన్‌గా నటించలేను. అదే సమయంలో అన్నీ తండ్రి పాత్రలు చేయలేను. ఈ గ్యాప్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ పాత్రల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి పరిమితుల మధ్య కూడా నేను చాలా బిజీగా ఉన్నా. పెద్ద సినిమాల్లో అవకాశాలొస్తున్నాయి. ఓ రకంగా నటుడిగా ఇప్పుడే కెరీర్‌ మొదలుపెట్టాననే భావన కలుగుతున్నది. నాలోని ప్రతిభను మరింతగా ఆవిష్కరించుకోవడానికి భవిష్యత్తు వేచి చూస్తుందనే ఆశావహ దృక్పథంతో ముందుకు
సాగుతున్నా.

సంక్లిష్టమైన పాత్రలు చేయాలి
రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఆర్థికంగా సంతృప్తిగానే ఉంది. నటుడిగా మాత్రం ఇంకా మంచి పాత్రలు చేయాలనే ఆశతో ఉన్నా. క్యారెక్టర్స్‌ విషయంలో సెలెక్టివ్‌గా ఉంటున్నా. నచ్చకపోతే నో చెబుతున్నా. ఇక పాత్రల విషయంలో ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. అప్పటివరకు చేసిన పాత్రలకంటే గొప్ప పాత్ర దొరుకుతుందనే ఆశే నటుణ్ణి ముందుకు నడిపిస్తుంది. ఆ ఆకలి లేకపోతే కెరీర్‌ ఎగ్జయిటింగ్‌గా అనిపించదు. నటుడిగా నిరంతరం మనల్ని మనం తెలుసుకుంటూ వెళ్లాలనే సిద్ధాంతాన్ని నేను బలంగా విశ్వసిస్తాను. డార్క్‌ షేడ్స్‌తో సాగే సంక్లిష్టమైన పాత్రల్ని చేయాలన్నది నా డ్రీమ్‌. అలాంటి క్యారెక్టర్స్‌ కోసం ఎదురుచూస్తున్నా.

డైరెక్ట్‌గా కెమెరా ముందుకే

యాక్టింగ్‌ పరంగా ముందస్తు ప్రిపరేషన్‌ పెద్దగా చేయను. ఎక్కువగా కమర్షియల్‌ సినిమాలే చేస్తాం కాబట్టి పాత్ర గురించి చెప్పగానే వెంటనే అర్థం చేసుకొని కెమెరా ముందుకెళతాను. అయితే ఫిజికల్లీ ఛాలెంజింగ్‌ పాత్రలు చేసే సమయంలో మాత్రం ముందస్తు రిహార్సల్‌ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో హై ఇంటెన్సిటీ సీన్స్‌ ఉన్నప్పుడు అంతకుముందు సన్నివేశాలు, సందర్భం గురించి కూడా తెలుసుకొని నటిస్తుంటాను. అంతేకానీ, అద్దం ముందు నిలబడి హావభావాలు పలికించడం లాంటివి లేవు.

కోరుకున్న పాత్రలొస్తున్నాయి
సినీ పరిశ్రమలో పరిచయాలు, రిలేషన్స్‌ అవకాశాలు రావడానికి దోహదపడతాయి. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి దర్శకులు మంచి రోల్స్‌ ఇస్తున్నారు. వారితో అనుబంధం వల్ల నేనేమిటో తెలుసు కాబట్టి నాకు తగిన పాత్రల్నే డిజైన్‌ చేసుకొని సంప్రదిస్తున్నారు. అందుకే, చాలా పాత్రల్ని వినగానే ఓకే చేస్తుంటాను. అదృష్టం కొద్ది చాలావరకు నేను కోరుకున్న పాత్రలే లభిస్తున్నాయి.

అప్‌డేట్‌ అవుతున్నా

ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి. ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక దేశీయ, ప్రపంచ సినిమాపై ప్రేక్షకుల్లో అవగాహన బాగా పెరిగింది. ఈ పరిణామం మంచిదే అనుకుంటున్నా. దీనివల్ల నటన పరంగా ఆర్టిస్టులు మరింత జాగ్రత్తగా ఉంటారు. ఏదో చేసేసి వెళ్లిపోదామనే ధోరణి కాకుండా కొత్తదనం చూపించాలనే తపనతో పనిచేస్తారు. నేనూ అదే విధంగా ఆలోచిస్తున్నా. పర్‌ఫార్మెన్స్‌ పరంగా ప్రతి సినిమాకు వైవిధ్యం ప్రదర్శించాలని, వరల్డ్‌ సినిమాను గమనిస్తూ అప్‌డేట్‌ అవుతున్నా. నటుడు కూడా నిత్య విద్యార్థి లాంటివాడే. పరిశ్రమలో ఉన్నంత కాలం నేర్చుకుంటూనే ఉండాలి.

వెబ్‌సిరీస్‌ ఆఫర్లొస్తున్నాయి
ఓటీటీలో ఆఫర్లొస్తున్నాయి. అయితే సినిమాల్లో మాదిరిగా చిన్న క్యారెక్టర్స్‌ కాకుండా సెంట్రల్‌ రోల్స్‌ వస్తేనే ఓటీటీ సిరీస్‌లు చేద్దామనుకుంటున్నా. వాస్తవంగా ఓటీటీ వేదికల్లో మన ప్రతిభను పూర్తిస్థాయిలో వ్యక్తపరిచే అవకాశం దొరుకుతుంది. లీడ్‌ రోల్స్‌లో కొన్ని వెబ్‌సిరీస్‌లు చేయమని అడుగుతున్నారు. త్వరలో వాటిపై నిర్ణయం తీసుకుంటా. ప్రస్తుతం ‘ఆచార్య’, ‘పుష్ప’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నా.

-కళాధర్‌ రావు

ఇవీ కూడా చదవండి…

మీరు ఎదిగి ప‌దిమందికి సాయ‌ప‌డాలి : ఎమ్మెల్సీ క‌విత‌

సీఎం కేసీఆర్‌ను క‌లిసి వాణీదేవికి మ‌ద్ద‌తు ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ‌పై కేంద్రం ప్ర‌శంస‌లు

బడ్జెట్‌ సమావేశాలపై సీఎం సమీక్ష

గోబెల్స్‌కు తాతల్లా మారారు

ఆరేండ్లలో 1500 కోట్ల మోసం!

గొర్రెల యూనిట్లు మరో 3 లక్షలు

చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య

Advertisement
ఆ రెండూ నచ్చితే… ఓకే!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement