బుధవారం 28 అక్టోబర్ 2020
Medchal - Aug 03, 2020 , 23:13:06

పాదచారులకు ప్రమాదం లేకుండా..

పాదచారులకు  ప్రమాదం లేకుండా..

మల్కాజిగిరి నియోజకవర్గంలో పాదచారుల సౌకర్యార్థం ఫుట్‌పాత్‌ల నిర్మాణాలు

రూ. 5 కోట్ల 48 లక్షల నిధులు మంజూరు

పలు ప్రాంతాల్లో పనులు పూర్తి

(మల్కాజిగిరి)

పాదచారుల సౌకర్యార్థం నిర్మిస్తున్న ఫుట్‌పాత్‌ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలో రూ. 5.48 కోట్ల నిధులతో ఫుట్‌పాత్‌ల నిర్మాణ పనులు చేపట్టారు. మల్కాజిగిరి సర్కిల్‌ నేరేడ్‌మెట్‌, వినాయక్‌నగర్‌, మౌలాలి, ఈస్ట్‌ఆనంద్‌బాగ్‌, మల్కాజిగిరి, గౌతంనగర్‌ అల్వాల్‌ సర్కిల్‌లో అల్వాల్‌, వెంకటాపుర్‌, మచ్చబొల్లారం డివిజన్‌లో రహదారులపై నిర్మిస్తున్నారు. పాదచారులకు ప్రమాదాలు జరుగకుండా నివారించేందుకు ఫుట్‌పాత్‌ నిర్మాణాలు చేపడుతున్నారు. మల్కాజిగిరి సర్కిల్‌15లో 19 కిలో మీటర్ల ఫుట్‌పాత్‌ల నిర్మాణాలకు గాను 6.8 కిలోమీటర్ల ఫుట్‌పాత్‌ల పనులు పూర్తికాగా 5. 95 కిలో మీటర్ల పనులు కొనసాగుతున్నాయి. మరో 2.24 కిలో మీటర్ల పనులను త్వరలోనే ప్రారంభించనున్నారు. అల్వా ల్‌ సర్కిల్‌లో 2. 2 కిలో మీటర్ల ఫుట్‌పాత్‌ పనులను పూర్తి చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 75 శాతం పనులను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. 

రద్దీగా ఉండే రహదారులలో..

నిత్యం రద్ద్దీగా ఉండే ప్రాంత రహదారులను గుర్తించి ఫుట్‌పాత్‌లను నిర్మిస్తున్నారు. పాదచారులకు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మల్కాజిగిరి సర్కిల్‌ మిర్జాలగూడ నుంచి మల్కాజిగిరి చౌరస్తా మీదుగా నేరేడ్‌మెట్‌ చౌరస్తా అక్కడి నుంచి ఈసీఐఎల్‌, డిఫెన్స్‌ కాలనీకి  వెళ్లే రోడ్లలో ఫుట్‌పాత్‌లను నిర్మిస్తున్నారు. అల్వాల్‌లో హైటెన్షన్‌ రోడ్డుపై ఫుట్‌పాత్‌ నిర్మాణం పూర్తి చేశారు. దీంతో పాదచారులకు సౌకర్యవంతంగా మారింది.

75 శాతం పనులు పూర్తి

మల్కాజిగిరి నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఫుట్‌పాత్‌ నిర్మాణ పనులు 75 శాతం పూర్తయ్యాయి. 12. 75 కిలో మీటర్ల పనులు చివరి దశలో ఉన్నాయి. మరో 2.44 కిలో మీటర్ల పనులను త్వరలోనే ప్రారంభించనున్నాం. అల్వాల్‌ సర్కిల్‌లో 2. 2 కిలో మీటర్ల ఫుట్‌ పాత్‌ పనులు పూర్తయ్యాయి.

-అనిల్‌రాజ్‌, సికింద్రాబాద్‌ జోనల్‌ ఎస్‌ఈ 


logo