మంగళవారం 04 ఆగస్టు 2020
Medchal - Jul 04, 2020 , 00:25:22

లక్ష్మాపూర్‌కు ‘గ్రామనక్ష’

లక్ష్మాపూర్‌కు ‘గ్రామనక్ష’

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో.. సాకారమైన స్వప్నం

114 ఏండ్ల్ల సమస్యకు పరిష్కారం

రైతుల ఇంటికి వెళ్లి పట్టాలు అందించిన అధికారులు

త్వరలోనే  రైతుబంధు

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ : ఆ గ్రామం పేరు లక్ష్మాపూర్‌. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లి మండలంలో రాజధానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ గ్రామంలో ఏ భూమి ఏ సర్వే నంబర్‌లో ఉంది..? ఎంత విస్తీర్ణంలో ఉంది..? ఏ దిక్కున ఉంది..? అని చెప్పేందుకు ఆ గ్రామానికి నక్ష లేదు. రెవెన్యూ రికార్డుల్లో ఆ ఊరు పేరున్నా... సర్వే నంబర్లు మాత్రం సక్రమంగా లేవు. దీంతో ఆ గ్రామ రైతుల పేర్లు పంట రుణాల అర్హుల జాబితాలో కనిపించలేదు.  రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు అందినా.. లక్ష్మాపూర్‌ అన్నదాతలు మాత్రం అనర్హుల జాబితాలోనే ఉన్నారు. ఈ 114 ఏండ్లలో ఆ పల్లె రైతులు, పాలకవర్గం సభ్యులు తిరగని కార్యాలయం లేదు, కలువని నాయకుడు లేడు. కానీ ఎవరూ కనికరించలేదు. అయితే లక్ష్మాపూర్‌ గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకున్న తరువాత 2017 జూన్‌లో రైతుల సమస్యలపై సమగ్ర నివేదిక అందించి సత్వరం పరిష్కరించాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కదిలిన అధికారులు సుమారు మూడేండ్ల పాటు శ్రమించి 114 ఏండ్ల సమస్యను పరిష్కరించారు. మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్‌ డా.వాసం వెంకటేశ్వర్లు శుక్రవారం రైతులకు ఆన్‌లైన్‌ పట్టాలను అందించారు. ఎన్నో ఏండ్ల సమస్య పరిష్కారం కావడంతో గ్రామంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే గ్రామ రైతులు పంట రుణాలు, రైతుబంధు అర్హుల జాబితాలో స్థానం పొందనున్నారు. 

గ్రామ సభలో సీఎం దృష్టికి..

లక్ష్మాపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్న తరువాత 2017 జూన్‌, జూలై నెలల్లో గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆ సమయంలో తమ గ్రామానికి నక్ష లేదని, ఎవరి భూమి ఏ సర్వే నంబర్‌లో ఉందో స్పష్టత లేదని గ్రామ పాలకవర్గ సభ్యులు, రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీఎం.... లక్ష్మాపూర్‌ గ్రామానికి సరికొత్త నక్ష రూపొందించాలని రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్స్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌తో పాటు మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాన్ని  సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రస్తావించి.. ఉమ్మడి రాష్ట్రంలో ఆ పల్లె రైతులు పడిన అవస్థలను అసెంబ్లీ సాక్షిగా వివరించారు. 

మరుసటి రోజే..

సీఎం ఆదేశించిన మరుసటి రోజునే లక్ష్మాపూర్‌ గ్రామానికి నక్ష రూపొందించేందుకు సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ మండల సర్వేయర్‌తో పాటు ఇద్దరు సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ల్లతో కూడిన సుమారు ఐదు బృందాలను రంగంలోకి దింపారు. లక్ష్మాపూర్‌ గ్రామంలో 1906లో భూ సర్వే జరిగినట్లు అధికారులు గుర్తించారు. సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ , రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌, జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ ఆధ్వర్యంలో సుమారు 5 నెలల పాటు గ్రామంలో సాంకేతిక పరిజ్ఞానంతో భూ సర్వే చేసి.. జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించారు. 

గుర్తించిన అంశాలు..

భూసర్వే చేసిన సర్వే బృందాలు 655 టిప్పన్స్‌ను, సుమారు 3వేల ఎకరాల భూములు (ప్రభుత్వ, పట్టా, ఫారెస్ట్‌)ఉన్నట్లు గుర్తించారు. 9 వందల మంది రైతులున్నారని, వీరి ఆధీనంలో సుమారు 1800-2000 ఎకరాల భూములున్నట్లు గుర్తించారు. అనంతరం పట్టా భూములున్న వ్యక్తులందరికీ నోటీసులు జారీ చేసి ‘హైలెవల్‌ రిజల్యూషన్‌ శాటిలైట్‌ ఇమేజరీ’ పరిజ్ఞానంతో గుర్తించిన భూముల మ్యాపులతో క్షేత్రస్థాయిలో పోల్చి చూసి.. రైతుల భూములకు హద్దులను నిర్ధారించారు. 

సీఎం చొరవతోనే సమస్య పరిష్కారం 

రైతుబాంధవుడైన సీఎం కేసీఆర్‌ చొరవతోనే లక్ష్మాపూర్‌ గ్రామ చిరకాల సమస్య పరిష్కారమైంది. ఇన్నాళ్లూ లక్ష్మాపూర్‌కు గ్రామనక్ష లేని కారణంగా చాలా సమస్యలు వచ్చేవి.  రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్‌ ఎన్నో ఏండ్ల సమస్యను పరిష్కరించి అన్నదాతలకు మేలు చేశారు.  ఈ గ్రామంలోని సుమారు 1000 పైచిలుకు మంది రైతులకు ఇంటికే వెళ్లి పట్టాలిస్తున్నాం.

- చామకూర మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి

పట్టాలు జారీ చేశాం...

సీఎం ఆదేశాలతో లక్ష్మాపూర్‌ గ్రామంలో వేగంగా భూ సర్వేను పూర్తి చేసి పట్టాలను జారీ చేశాం. గ్రామానికి హద్దులు, సర్వే నంబర్లు లేని కారణంగా గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా రైతులు పంట రుణాలను కూడా పొందలేని పరిస్థితి ఉండే. ఇక నుంచి ఈ కష్టాలుండవు. పంట రుణాలతో పాటు రైతుబంధు కూడా వస్తుంది. 

- డా.వాసం వెంకటేశ్వర్లు, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌.     


logo