e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి గిరి పుత్రికలకు ఉపాధి శిక్షణ

గిరి పుత్రికలకు ఉపాధి శిక్షణ

  • దుండిగల్‌ తండా-2లో చేతి వృత్తుల శిక్షణ కేంద్రం
  • రూ.1.66 కోట్లతో పైలట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు..
  • టీఆర్‌ఎస్‌ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి తోడ్పాటు
  • శిక్షణ పొందుతున్న 40 మంది గిరిజన మహిళలు

గిరిజన మహిళల వేషధారణ చాలా భిన్నంగా, అందంగా ఉంటుంది. తమ సంస్కృతిని ప్రతిబింబించేలా అద్దాల రవిక, కుచ్చుల (కాంచలి) లంగాలు, నాణేల వస్త్రాలు, తెల్లని గాజులు, ముక్కు పుడకలు, చెవిదుద్దులు, ఉంగరాలు.. ఇలా వారు ధరించే ప్రతీది ప్రత్యేకమైనదే. ఇవి చూసేందుకు ఆకర్శణీయంగా ఉన్నా తయారు చేసేందుకు మాత్రం చాలా సమయం పడుతుంది. లంబాడీ మహిళల మనసుకు నచ్చేవిధంగా దుస్తులు, ఆభరణాలను త్వరితగతిన రూపొందించి, వాటిని విక్రయించడంతో గిరిజన మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా చేతి వృత్తుల నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అత్యాధునిక యంత్రాల సహాయంతో గిరిజన మహిళలకు దుస్తులు, ఆభరణాల తయారీలో నెల రోజుల నుంచి మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు. వారు తయారు చేసిన ఉత్పత్తులతో ప్రత్యేకంగా ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసి మార్కెటింగ్‌ చేస్తారు.

పైలట్‌ ప్రాజెక్టుగాప్రారంభం

పేదరికం, నిరక్షరాస్యతతో సతమతమవుతున్న లంబాడీ మహిళల ఆర్థిక పరిపుష్టే లక్ష్యంగా మేడ్చల్‌ జిల్లా, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్‌ తండా-2లో ఈ కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించారు. గత నెల 4న ప్రారంభమైన ఈ శిక్షణా కేంద్రంలో ప్రస్తుతం 40 మంది గిరిజన మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఏడాది కాలంలో సుమారు 300మంది గిరిజన మహిళలకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కేంద్రంలో లంబాడీ మహిళలు ధరించే దుస్తులు, గాజులు, ఇతర అలంకరణ వస్తువుల తయారీపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని కేంద్రాలు ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో అత్యాధునిక యంత్రాల ఏర్పాటుకు రూ.1.66 కోట్ల వ్యయం కాగా, ప్రభుత్వం తన వాటాగా గిరిజన హబ్‌ ద్వారా రూ.1.12 కోట్లను అందించింది. మిగిలిన రూ.48లక్షలను మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ మర్రి రాజశేఖర్‌రెడ్డి తన విద్యాసంస్థల నుంచి సీఎస్‌ఆర్‌ నిధులు కింద అందజేశారు.

- Advertisement -

ఈ కేంద్రంలో గిరిజన మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు 8మంది ట్రైనర్‌లు ఉన్నారు. హైదరాబాద్‌లోని నిఫ్ట్‌, అహ్మదాబాద్‌లోని ఎన్‌ఐటీలో చదువు పూర్తి చేసిన వీరు ఇక్కడి మహిళలకు కంప్యూటర్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌(సీఎన్‌సీ)ఆపరేటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఉడ్‌కటింగ్‌, అక్రిలిక్‌, క్లే మెటీరియల్‌, మొమోంటోల తయారీతో పాటు గిరిజన మహిళల సాంప్రదాయ దుస్తులు, ఆభరణాల డిజైన్ల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం ఇక్కడ 4 సీఎన్‌సీ మిషన్‌లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు దుస్తులపై ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్‌ను సైతం మిషన్‌ల ద్వారా రూపొందించేందుకు మరో రెండు యంత్రాలు ఏర్పాటు చేశారు. చేతులతో ఏడు రోజుల్లో చేసే పనులను సీఎన్‌సీ విధానం ద్వారా ఒక్కరోజులోనే పూర్తి చేస్తున్నట్లు శిక్షణ పొందుతున్న మహిళలు తెలిపారు.

గిరిజన మహిళలకు ఉపాధి

సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో గిరిజన మహిళలకు ఉపాధి కల్పించేందుకే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. గిరిజన మహిళలను ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో నిలుపాలన్నదే మా ఆకాంక్ష. ఇందుకోసం మా విద్యాసంస్థల నుంచి సీఎస్‌ఆర్‌ నిధులను కూడా ఖర్చు చేస్తున్నాం. ఈ కేంద్రం ఏర్పాటుకు మాకు సహకరించిన ప్రభుత్వానికి, మేడ్చల్‌ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. – మర్రి రాజశేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి

శిక్షణ బాగుంది

మా దుండిగల్‌ తండాలో నెల రోజుల క్రితం ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో శిక్షణకు నేను రోజూ వెళ్తున్నాను. ముందుగా ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. ఆధునిక యంత్రాల ద్వారా దుస్తులపై ఎంబ్రాయిడింగ్‌ ఎలా చేయాలో అర్థమయ్యే రీతిలో చాలా బాగా చెప్తున్నారు. ఈ శిక్షణ ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ పని జరుగుతుంది. ఇది చాలా బాగుంది.- బానోతు కరుణ, దుండిగల్‌ తండా

ఆర్థికంగానిలదొక్కుకోవాలి

గిరిజన మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలన్నదే ఈ శిక్షణ కేంద్రం ప్రధాన ఉద్దేశ్యం. ఇక్కడి ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసి గిరిజనులను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తాం. ప్రతి గిరిజన మహిళ నెలకు కనీసం రూ. 10 వేలు సంపాదించేలా చేస్తాం. ప్రస్తుతం మా కేంద్రంలో 40 మంది ఉన్నారు. ఏడాదిలో 300 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – మహేందర్‌, ప్రాజెక్ట్‌ ఇన్‌చార్జి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement