సోమవారం 26 అక్టోబర్ 2020
Medchal - Jun 24, 2020 , 00:38:56

ఇక్కడన్నీ నార్మల్‌ డెలివరీలే...

ఇక్కడన్నీ నార్మల్‌ డెలివరీలే...

సహజ ప్రసవ కేంద్రాలుగా పీహెచ్‌సీలు

గర్భిణులకు వరంగా మారుతున్న పీహెచ్‌సీలు 

జిల్లాలోని పీహెచ్‌సీల్లో పెరుగుతున్న నార్మల్‌ డెలివరీలు

మొత్తం ప్రసవాల్లో 80 శాతం సాధారణమే

పీహెచ్‌సీల్లో కార్పొరేట్‌కు దీటుగా వసతులు కల్పించిన ప్రభుత్వం

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద ప్రజలకు తక్షణ వైద్య సేవలను ఉచితంగా అందించే సంకల్పంతో నెలకొల్పిన దవాఖానలు అవి. కానీ సమైక్య పాలకుల చిన్నచూపుతో పూర్తి నిరాదరణకు గురి కాగా తక్షణ ఉచిత వైద్య సేవలకు దూరమయ్యాయి. స్వరాష్ట్ర సాధన తర్వాత ఉద్యమ నేత కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాగానే దవాఖానల రూపురేఖలు మారాయి. ప్రాథమిక చికిత్స కూడా చేసే స్థితిలో లేని ఆరోగ్య కేంద్రాలు నేడు ప్రసవ కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఒకప్పుడు నెలకు ఒక్క కాన్పు జరిగితేనే గొప్పగా చెప్పుకునే పరిస్థితి నుంచి ప్రతి నెల 300 నుంచి 400ల సహజ కాన్పులు జరుగుతున్నాయి. 

- మేడ్చల్‌,నమస్తేతెలంగాణ

జిల్లాలో మొత్తం 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 24 అర్బన్‌ ప్రైమరీ, 39 బస్తీ, మల్కాజిగిరి ఏరియా దవాఖానతోపాటు ఘట్‌కేసర్‌, మేడ్చల్‌లో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు (సీహెచ్‌సీ) ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 19 డెలివరీ పాయింట్లున్నాయి. అయితే మూడు నెలల నుంచి ఈ వైద్యశాలల్లో మొత్తం 1,204 ప్రసవాలు జరుగగా ఇందులో 959 సహజ కాన్పులు, మరో 245 మంది గర్భిణులకు తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్‌ చేశారు. అయితే మొత్తంగా చూస్తే  80 శాతం సహజ ప్రసవాలే కావడం గమనార్హం. మరోవైపు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లతో పోల్చితే ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలోనే ఎక్కువ ప్రసవాలు జరిగినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మేడ్చల్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో మార్చిలో 36, ఏప్రిల్‌లో 40, మేలో 45 ప్రసవాలు, ఘట్‌కేసర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో మార్చిలో 62, ఏప్రిల్‌లో 121, మేలో 117 ప్రసవాలు, మల్కాజిగిరి ఏరియా దవాఖానలో మార్చిలో 30, ఏప్రిల్‌లో 34, మేలో 58 ప్రసవాలు జరిగాయి. అంటే మొత్తం 1,204 ప్రసవాల్లో 661 ప్రసవాలు కేవ లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగితే, మల్కాజిగిరి ఏరియా, ఘట్‌కేసర్‌, మేడ్చ ల్‌ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో 543 ప్రసవాలు జరిగాయి. షాపూర్‌నగర్‌ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌సెంటర్‌లో ఒక్కో నెలలో సుమారు 45 నుంచి 100 కాన్పులు జరిగితే ఇందులో 100 శాతం సహజ ప్రసవాలేనని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. 

కరోనా సమయంలో మరింత ఆదరణ..

ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండటంతో నగరంలోని అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు వైద్యశాలకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా గర్భిణులు గ్రామంలో, సమీప పట్టణంలోని పీహెచ్‌సీలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాదిలోని మార్చి (312), ఏప్రిల్‌ (342), మే (361)లో జరిగిన ప్రసవాలతో పోలిస్తే ఈ దఫా 189 ప్రసవాలు ఎక్కువగా జరిగాయని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 

19 ప్రసవ కేంద్రాలు ఇవే.. 

జిల్లాలో అనేక పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, 39 బస్తీ వైద్యశాలలు   ఉన్నప్పటికీ ప్రసవ కేంద్రాలు 19 మాత్రమే ఉన్నాయి. ఇందులో పీహెచ్‌సీలైన అల్వాల్‌, బాలానగర్‌, మల్కాజిగిరి, దుండిగల్‌, శ్రీరంగవరం, శామీర్‌పేట, జవహర్‌నగర్‌, కీసర, నారపల్లి, ఉప్పల్‌, యూపీహెచ్‌సీలైన షాపూర్‌నగర్‌, పర్వతానగర్‌, కుత్బుల్లాపూర్‌, వినాయకనగర్‌, మల్లాపూర్‌, వెంకట్‌రెడ్డి నగర్‌, సీహెచ్‌సీలైన మేడ్చల్‌, ఘట్‌కేసర్‌, మల్కాజిగిరి ఏరియా వైద్యశాలలను ప్రసవ కేంద్రాలుగా గుర్తిస్తూ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. 

కార్పొరేట్‌కు దీటుగా.. 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం అనేక వసతులు కల్పించింది. మరీ ముఖ్యంగా కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దింది.  ప్రతీ పీహెచ్‌సీలో గైనకాలజిస్టును నియమించడంతో పాటు వైద్యశాలల పరిసరాలను క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా మార్చింది. అంతేకాక గర్భిణులకు అవసరమైన మందులు, చిన్నారులకు టీకాలు అందుబాటులో ఉంచారు. దీంతో జిల్లా పరిధిలోని పీహెచ్‌సీలకు గర్భిణులు క్యూ కడుతున్నారు. 

మంచి పరిణామం..

గర్భిణులు పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతుండటం మంచి పరిణామం. ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని సేవలను ఉచితంగా అందించడంతో పాటు సహజ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నాం. వైద్యులు సైతం రోగులు, గర్భిణులతో స్నేహభావంతో మెలుగుతూ ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మఒడి, కేసీఆర్‌ కిట్‌ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నాం. 

-డా.వాసం వెంకటేశ్వర్లు, మేడ్చల్‌ కలెక్టర్‌

పీహెచ్‌సీల్లో మూడు నెలల్లో జరిగిన ప్రసవాల వివరాలు

మాసం      మొత్తం ప్రసవాలు       సహజ ప్రసవాలు ఆపరేషన్లు

మార్చి                    322                       264                    58

ఏప్రిల్‌                    445                       358                    87

మే                             437                       337                   100


logo