మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Medchal - Aug 14, 2020 , 22:43:02

ఒకేసారి చెల్లిస్తేనే లబ్ధి

ఒకేసారి చెల్లిస్తేనే లబ్ధి

16,166 మందికి ప్రయోజనం

90 % వడ్డీ మాఫీతో కదులుతున్న చెల్లింపుదారులు

కాప్రా సర్కిల్‌లో 12 రోజుల్లో ఆస్తిపన్ను బకాయిలు చెల్లించిన 929 మంది

 కాప్రా: ఒకేసారి ఆస్తిపనున్న బకాయిలు చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ అవుతుందని తెలిసి చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు ప్రజలు. ఆస్తి పన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే . ఇందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌లో పన్ను బకాయిలు ఉన్న వేలాదిమంది చెల్లించేందుకు సమాయత్తవుతున్నారు. తమ బకాయిలపై ఆరా తీస్తూ..మేర చెల్లించాలో తెలుసుకుంటున్నారు. కాప్రా, ఏఎస్‌రావునగర్‌, చర్లపల్లి, హెచ్‌బీకాలనీ, మల్లాపూర్‌, నాచారం డివిజన్ల పరిధిలోని 35వేలకుపైగా ఉన్న ఆస్తిపన్ను చెల్లింపుదారుల్లో 16,166మందికి సంబంధించి ఆస్తిపన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వీరి నుంచి రూ.24.51 కోట్ల మేర ఆస్తిపన్ను బకాయిలు రావాల్సి ఉండగా వడ్డీ 90 శాతం రూ.22.059 కోట్లను జీహెచ్‌ఎంసీ మాఫీ  చేయనున్నది. ఫలితంగా 16,166 మందికి  వడ్డీ మాఫీతో ప్రయోజనం కలుగనున్నది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్‌ 15లోపు ఒకేసారి మొత్తం బకాయిలను చెల్లించేవారికే ఇది వర్తిస్తున్నదని అధికారులు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. 

929 ఆస్తుల నుంచి రూ.82.74లక్షల పన్ను వసూలు

ఆస్తిపన్ను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌లో భాగంగా వడ్డీబకాయిల్లో 90శాతం మాఫీ ప్రకటించాక ఆగస్టు 1 నుంచి 12వ తేదీ వరకు 929మంది ఆస్తిపన్ను బకాయి చెల్లింపుదారులు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. వీరినుంచి సర్కిల్‌కు రూ.82.74లక్షల మేర పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను చెల్లింపులు జరిగాయి.

గతేడాది 

రూ.40.41కోట్లు ఆస్తిపన్ను వసూలు..

2019-20 సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను వసూలు టార్గెట్‌ రూ.51.40కోట్లు ఉండగా, 2020 మార్చి 31వరకు  సర్కిల్‌లో 43,172 ఆస్తుల నుంచి రూ.40.41కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 30 జూలై వరకు (ఎర్లీబర్డ్‌ చెల్లింపులతో కలిపి) 29,687 ఆస్తుల నుంచి రూ.20.79 కోట్ల పన్ను వసూలైనట్టు సర్కిల్‌ రెవెన్యూవర్గాలు తెలిపాయి. 

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి 

ఆస్తిపన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ అవకాశాన్ని చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలి. ఒకేసారి బకాయిలన్నీ చెల్లించేవారికి ఈ పథకం వర్తిస్తుంది. వడ్డీ మాఫీతో 16,166 మంది పన్ను చెల్లింపుదారులకు రూ.22.059కోట్ల వడ్డీమాఫీ ప్రయోజనం కలుగుతుంది. ఆస్తిపన్నును బకాయిలను చెల్లించి జీహెచ్‌ఎంసీ అభివృద్ధికి సహకరించాలి. 90శాతం వడ్డీమాఫీ చేస్తూ పన్నులు వసూలు చేసేందుకు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. ఇంకా నెలరోజులే ఉన్నందున చెల్లింపుదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

- ఎ.శైలజ, డిప్యూటీ కమిషనర్‌, కాప్రాసర్కిల్‌


logo