మంగళవారం 07 జూలై 2020
Medchal - Jun 04, 2020 , 02:26:14

రాజీవ్‌ రహదారి హరితమయం కావాలి

రాజీవ్‌ రహదారి హరితమయం కావాలి

రోడ్డు పక్కన ఎత్తైన మొక్కలు నాటాలి

సర్పంచ్‌లతో మేడ్చల్‌ కలెక్టర్‌ సమీక్ష

 మేడ్చల్‌, నమస్తే తెలంగాణ/శామీర్‌పేట : రాజీవ్‌ రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని మేడ్చల్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో శామీర్‌పేట మండల పరిధిలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్డుకిరువైపులా రెండు, మూడు వరుసల్లో మొక్కలు నాటాలని ఆదేశించారు. రాజీవ్‌ రహదారి పచ్చదనంతో వెల్లివిరిసేలా 10 అడుగుల ఎత్తైన మొక్కలను నాటాలన్నారు. మొక్కల ఎంపికలో అటవీ శాఖ అధికారుల సూచనలు, సలహాలను తీసుకోవాలన్నారు. శామీర్‌పేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నుంచి చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా శిథిలావస్థకు చేరిన భవనాలను వెంటనే తొలిగించి, మొక్కలను నాటి చౌరస్తాను సుందరీకరించాలన్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలన్నారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే  అధికారులు, సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌, ఇన్‌చార్జి డీపీవో దైవసహాయం, డీఎల్‌పీవో స్మిత, ఎంపీడీవో వాణి, ఎంపీపీ ఎల్లూబాయి పలు గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

విరివిగా మొక్కలు నాటాలి..

 సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తూంకుంట నుంచి తుర్కపల్లి వరకు రాజీవ్‌ రహదారి వెంట మొక్కలు నాటే కార్యక్రమం, శామీర్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పారిశుధ్య, సుందరీకరణ పనులను మేడ్చల్‌ కలెక్టర్‌  బుధవారం పరిశీలించారు.  గ్యాప్‌ ఫిల్లింగ్‌, మొక్కలకు సాసరింగ్‌, మొక్కల మధ్య చెత్తా చెదారం తొలిగింపు తదితర పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశించారు. 


logo