తొగుట, ఏప్రిల్ 4: పొద్దు తిరుగుడు పంట సాగు చేసిన రైతులకు పక్షుల బెడద గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. పువ్వు పూసిన మొదలు కోత కోసే వరకు కంటికి రెప్పలా పంటను కాపాడుకోవాలి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్న డప్పు, గిన్నెలు పట్టుకొని కర్రలతో కొడుతూ శబ్దం చేస్తూ పక్షులను వెళ్లగొడుతుంటారు. దీని వల్ల ఎంతో వ్యయ ప్రయాసాలు భరించాల్సి ఉంటుంది. ఈ పక్షుల బెడద మూలంగా కొంత మంది రైతులు పొద్దుతిరుగుడు లాంటి పంటలు సాగు చేయడమే మానుకున్నారు. ఈక్రమంలో ఆధునిక టెక్నాలజీతో మైక్ సౌండ్లను పంట పొలాల్లో ఏర్పాటు చేసి పక్షుల బెడద నుంచి విముక్తి పొంది రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గ్రామాల్లో అల్లం ఎల్లిగడ్డను అమ్మే వారు తమ వాహనాలకు ఇలాంటి మైక్‌లను పెట్టుకొని అమ్మకాలు సాగించేవారు. నోటి ద్వారా.. అల్లం, ఎల్లిగడ్డ -అల్లం, ఎల్లిగడ్డ తక్కువ ధరకు అంటూ వాడ వాడకు నోటితో పెద్ద,పెద్ద శబ్దాలు చేసేవారు. బ్యాటరీల ద్వారా నడిచే మైక్‌లు అందుబాటులోకి రావడంతో చిరు వ్యాపారులు వీటిని వాడుతుండటంతో వాటి ప్రాచుర్యం బాగా పెరిగింది. పంట చేలల్లో పక్షుల మూలంగా రైతులకు కష్టాలు రావడంతో వాటి బెడద నుంచి నివారించడానికి చేలల్లో మైక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మైక్‌లో రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. ముందు రికార్డింగ్ ఆన్ చేసి పెద్ద చప్పుడు చేస్తూ , శబ్దాలు చేస్తూ రికార్డింగ్ చేస్తారు. తర్వాత మైక్ ఆన్ చేస్తే మనం రికార్డింగ్ చేసినవి మైక్‌లో వస్తాయి. మండలంలోని వెంకట్రావుపేటలో బండారి కిష్టాగౌడ్, జీడిపల్లి కొండల్‌రెడ్డి తదితరులు వారి పంట పొలాల్లో మైక్‌లను ఏర్పాటు చేశారు. గతంలో పక్షులను వెళ్లగొట్టడానికి పొలం చుట్టూ తిరగాల్సి ఉండేదని, కొద్ది సేపు శబ్దం నిలిపివేస్తే పక్షులు వచ్చి పంటను నష్టం చేసేవి. నేడు కేవలం రూ.800 ఖర్చులో లభిస్తున్న మైక్‌ల మూలంగా ఎంతో మేలు జరుగుతుందని చెప్పురు. ఒక్కసారి బ్యాటరీ చార్జింగ్ చేస్తే 7 గంటల వరకు నిర్విరామంగా పనిచేస్తుందని, మైక్‌ల ఏర్పాటు మూలంగా పక్షుల బెడద తప్పిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చాలా నయమైంది : రైతు బండారు కిష్టాగౌడ్
పొద్దు తిరుగుడు పంటను 3 ఎకరాల్లో సాగు చేశా. చేను పూతకు రాగానే పిట్టల బెడద ఎక్కువైంది. ఉదయం సాయంత్రం డబ్బాలతో పెద్ద, పెద్ద శబ్దం చేసేవాళ్లం. ఇటు చేస్తే అటు వెళ్లేవి..అటు చేస్తే ఇటు వచ్చేవి. కూలీలను పెట్టాల్సి వచ్చేది. అరిసి-అరిసి గొంతు పోయేది. నేడు రికార్డింగ్ మైక్ మూలంగా ఎంతో మేలు జరిగింది. తక్కువ ఖర్చుతో ఎంతో ఉపయోగకంగా ఉంది. పక్షుల బెడద నుంచి పంటను కాపాడుకుంటున్నాం.