మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Medchal - Sep 16, 2020 , 01:18:38

పార్కుల నిర్వహణ సమస్యలను పరిష్కరించాలి

పార్కుల నిర్వహణ సమస్యలను పరిష్కరించాలి

అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ను కోరిన ఎమ్మెల్యే వివేకానంద్‌

బోర్లు లేక ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ వాటర్‌ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని విన్నపం

దుండిగల్‌: అర్బన్‌ పార్కుల నిర్వహణలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. మంగళవారం ఆయన శాసనసభలో పలు అంశాలపై ప్రస్తావించారు. అనేకచోట్ల అర్బన్‌ పార్కుల అభివృద్ధి పనులను స్థానిక సంక్షేమ సంఘాలకు అప్పగించామన్నారు. అందుకు ప్రభుత్వం మెయింటెనెన్స్‌ నగదు ఇస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని ఎన్‌ఎన్‌రెడ్డినగర్‌, తదితర ప్రాంతాల్లో బోరుబావులు ఎండిపోవడంతో పార్కుల్లోని మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీరు పోస్తున్నారని, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ వాటర్‌ కనెక్షన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం గాజులరామారంలోని ప్రాణవాయువు పార్కు, సూరారం అర్బన్‌ లంగ్‌ స్పేస్‌లోని శ్వాస పార్కుల్లో సైక్లింగ్‌ ట్రాక్‌, స్కేటింగ్‌ ట్రాక్‌ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ నగరంలోని పబ్లిక్‌సెక్టార్‌ యూనిైట్లెన హెచ్‌ఎంటీ, ఐడీపీఎల్‌, హెచ్‌ఏఎల్‌, డిఫెన్స్‌ విభాగాలకు చెందిన వాటిలో పెద్దసంఖ్యలో ఖాళీస్థలాలు ఉన్నాయని, వాటిలో విరివిగా మొక్కలు నాటితే ఆక్సిజన్‌ శాతం పెరుగుతుందని ఆయన మంత్రిని కోరారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ పార్కుల అభివృద్ధిపై విలువైన ప్రతిపాదనలు లేవనెత్తారని అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పెద్దసంఖ్యలో పార్కుల్లో ఓపెన్‌ జిమ్‌లతోపాటు మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తున్నామని, మెయింటెనెన్స్‌ సమస్య ఉన్నచోట నిధుల కొరత రాకుండా చూస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

logo