మంగళవారం 20 అక్టోబర్ 2020
Medchal - Sep 27, 2020 , 01:29:46

ముంచెత్తింది..

ముంచెత్తింది..

పలు కాలనీలు జలమయం

ఇండ్లలోకి చేరిన వర్షం నీరు

ప్రజాప్రతినిధుల పర్యటన 

పొంగిన నాలాలు,మ్యాన్‌హోళ్లు

సహాయక చర్యలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది

కంట్రోల్‌ రూంల ఏర్పాటు 

అత్యధికంగా పాశమైలారంలో 7.2సెం.మీల వర్షపాతం

రాగల మూడు రోజులు గ్రేటర్‌కు భారీ వర్ష సూచన

మణికొండ/మేడ్చల్‌, నమస్తే తెలంగాణ/సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: మరోసారి గ్రేటర్‌ను భారీ వర్షం ముంచెత్తింది. తెలంగాణ, రాయలసీమ మీదుగా ఛత్తీస్‌ఘడ్‌ నుంచి కర్ణాటక వరకు  ఏర్పడిన ఉపతల ద్రోణి ప్రభావంతో గ్రేటర్‌లోని పలుచోట్ల శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పలు కాలనీలు నీటమునగగా, ఇండ్లల్లోకి  నీరు చేరింది. గ్రేటర్‌ పరిధిలోని పటాన్‌చెరు పాశమైలారంలో అత్యధికంగా 7.2సెం.మీల వర్షపాతం నమోదు కాగా, కార్వాన్‌లో అత్యల్పంగా 1.0సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్‌ అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజులు గ్రేటర్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీచేశారు. 

    శనివారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 24.8డిగ్రీల సెల్సియస్‌, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.1డిగ్రీల సెల్సియస్‌, గాలిలో తేమ 93శాతంగా నమోదైంది.  వచ్చే మరో మూడు రోజులు భారీ వర్షసూచన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ విజ్ఞప్తిచేశారు. ప్రజల సహాయార్థం కంట్రోల్‌ రూమ్‌ను 24గంటలూ పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముంపు సమస్య తలెత్తడంతో సహాయక చర్యలకోసం మాన్సూన్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎటువంటి సహాయం కావాలన్నా బల్దియా కాల్‌ సెంటర్‌ 21111111కు, లేక విపత్తుల నిర్వహణ విభాగం నంబరు 040-29555500కు, అత్యవసర సహాయం కోసం డయల్‌- 100కుఫోన్‌ చేయాలని కోరారు. మరోవైపు, వర్షం కారణంగా 16వ తేదీనుంచి శనివారం ఉదయం వరకు బల్దియాకు మొత్తం 875ఫిర్యాదులు అందాయి. ఇందులో నీరు నిలిచిన ఘటనలకు సంబంధించి 394, గోడలు, పురాతన నిర్మాణాలు కూలినవి, పాక్షికంగా దెబ్బతిన్నవి-29, చెట్లు, చెట్ల కొమ్మలు కూలినవి-158,  రోడ్లకు సంబంధించినవి-294 ఫిర్యాదులున్నాయి. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ వివరించారు. అదేవిధంగా మేడ్చల్‌ జిల్లాలోని సుమారు 350 వరకు చెరువులు పూర్తిస్థాయిలో నిండి మత్తడి పోస్తున్నాయి.శామీర్‌పేట చెరువులో నీటిమట్టం క్రమం గా పెరుగుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చెరువులో 20ఫీట్ల వరకు నీటి మట్టం చేరింది.

జంటజలాశయాలకు పోటెత్తిన వరద

మొయినాబాద్‌: ఈసీ వాగు  ఉప్పొంగి ప్రవహించ డంతో హిమాయత్‌సాగర్‌ జలాశయానికి వరద నీరు పొటెత్తడంతో నిండుకుండలా మారింది. దీంతో కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, ఆర్‌డీవో చంద్రకళ జలాశయాన్ని శనివారం రాత్రి పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని అడుగులు నీరు చేరిందని జలమండలి అధికారులను అడిగి తెలుసుకున్నారు. శనివారం రాత్రి 9 గంటల వరకు 1757.50 అడుగులకు నీటి మట్టం పెరిగింది. జలాశయం పూర్తి నీటి మట్టం 1763.50 అడుగులు ఉండగా 2.97 టీఎంసీలు నీటి నిలువ ఉంది.

     జలాశయం దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలను వెంటనే అప్రమత్తం చేయాలని ఆర్‌డీవోను ఆయన ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు జలాశయం గేట్లను ఏ సమయంలోనైనా ఎత్తివేసే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు గ్రామాల్లో దండోరా వేయించారు.2010లో జలాశయం నిండుగా నిం డటంతో గేట్లను ఎత్తి నీటిని వదిలారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షాలు పెద్దగా లేకపోవడం తో ఇప్పటి వరకు జలాశయంలోనికి వరదనీరు రాలేదు.

      పదేండ్ల్ల తరువాత మొదటిసారి జలాశయం నిండుకుండను తలపించడంతో గేట్లను ఏ సమయంలోనైనా ఎత్తడానికి జలమండలి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక నగర తాగునీటి అవరాలకు ఎలాంటి ఢోకా లేదని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా గండిపేట జలాశయం కూడా జలకళ ను సంతరించుకుంది. దీని పూర్తి నీటి సామర్థ్యం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1768 అడుగు ల వరకు నీరు  చేరింది.

ప్రాంతాల వారీగా వర్షపాతం  

ప్రాంతం                                   వర్షపాతం  సెం.మీలలో

పాశమైలారం 7.2

మాదాపూర్‌ 6.6

కూకట్‌పల్లి, కెపీహెచ్‌బీ కాలనీ 4.6

గచ్చిబౌలి                                              4.3

ఖాజాగూడ                                            3.8

శేరిలింగంపల్లి, చందానగర్‌          3.2

ఆల్విన్‌కాలనీ                                           3.1

రామచంద్రాపురం                               3.0

మియాపూర్‌                                           2.6

షేక్‌పేట, బాలానగర్‌                          2.4

కాప్రా, ఆసిఫ్‌నగర్‌                               2.2

అల్వాల్‌, గోల్కొండ, రాజేంద్రనగర్‌ 2.0

కుత్బుల్లాపూర్‌                                        1.8

గాజులరామారం                                  1.6

మల్కాజిగిరి, ఖైరతాబాద్‌              1.6

చార్మినార్‌,కీసర, ఉప్పల్‌                1.5

బహుదుర్‌పురా, 

సరూర్‌నగర్‌, అమీర్‌పేట 1.3

ముషీరాబాద్‌, సైదాబాద్‌                  1.1

మారేడుపల్లి, కార్వాన్‌, 

మలక్‌పేట, మారేడుపల్లి        1.0
logo