బుధవారం 28 అక్టోబర్ 2020
Medchal - Sep 26, 2020 , 00:46:41

నాలాల ఆధునీకరణ

నాలాల ఆధునీకరణ

మల్కాజిగిరి నియోజకవర్గంలో సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు

మల్కాజిగిరిలో రూ. 27.18 కోట్లు, అల్వాల్‌లో రూ. 40 కోట్లతో ప్రతిపాదనలు

మల్కాజిగిరి, సెప్టెంబర్‌25: నాలాల ఆధునీకరణ-విస్తరణ పనులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో వరదనీటి శాశ్వత సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. నాటి పాలకుల నిర్లక్ష్యం మూలంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం నిధులను మంజూరు చేయనున్నది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నాలాల ఆధునీకరణ-విస్తరణ పనులపై చర్యలు తీసుకుంటున్నారు. 

మల్కాజిగిరి ప్రాంతంలో..

మల్కాజిగిరిలోని వివిధ డివిజన్లలో నాలాల ఆధునీకరణ-విస్తరణ పనులను ప్రారంభించారు. ప్రమాదాలు జరగకుండా నాలాల చుట్టూ ఫెన్సింగ్‌ పనులు చేపట్టారు. వరదనీరు బయటకు రాకుండా నాలాలపై స్లాబ్‌ల నిర్మాణాలు, అవసరమైన చోట విస్తరణ పనులను చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొదటి విడుతగా రూ. 4 కోట్ల 68 లక్షల నిధులు మంజూరుతో 15 నాలాల వద్ద పనులు ప్రారంభించనున్నారు. మరో 49 నాలాల వద్ద పనుల ప్రారంభానికి రూ. 27 కోట్ల 18 లక్షల  మంజూరు కానున్నాయి. 

అల్వాల్‌ ప్రాంతంలో..

8.65 కిలోమీటర్ల మేర నాలాల ఆధునీకరణ-విస్తరణ పనులను అల్వాల్‌ ప్రాంతంలోని మూడు డివిజన్లలో చేపట్టనున్నారు. మోత్కులకుంట చెరువు నుంచి కొత్త చెరువు, కొత్త చెరువు నుంచి చినారాయడి చెరువు హకింపేట్‌ నుంచి హస్మత్‌పేట్‌ చెరువు వరకు ఉన్నవాటిని ఆధునీకరించి నాలాలు లేని చోట నూతన నిర్మాణాలు చేపట్టేందుకు నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించారు. 

 శాశ్వత పరిష్కారానికి చర్యలు

నియోజకవర్గంలో వరదనీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. నాలాల ఆధునీకరణ-విస్తరణ పనులకు నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించాం.  మల్కాజిగిరి, అల్వాల్‌ సర్కిళ్లలో భవిష్యత్‌లో వరదనీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నిధులను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. నాలాల ఆధునీకరణ-విస్తరణ పనులకు ప్రజలు సహకరించాలి.

- మైనంపల్లి హన్మంతరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే


logo