జీడిమెట్ల, జూలై 23 : భారీగా వానలు పడుతుండటంతో నాలాలు పొంగి వరదనీరు రోడ్లపైకి వస్తున్నాయని, ఓపెన్ నాలాలను పునర్నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చింతల్ డివిజన్ పరిధిలోని స్టార్ హోమ్స్ పక్కనే ఉన్న ఓపెన్ నాలాను అధికారులతో కలిసి పరిశీలించారు. నాలాను వెడల్పు విస్తరించడంతో పాటు నాలా గోడను ఎత్తు పెంచాలని స్థానిక సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వరద నీరు రోడ్లపైకి రాకుండా నాలాను పునర్నిర్మించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఈఈ కృష్ణ చైతన్య, చింతల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహ్మద్ఫ్రీ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.