గురువారం 13 ఆగస్టు 2020
Medchal - Jul 13, 2020 , 00:04:52

అక్రమాలు నేలమట్టం

అక్రమాలు నేలమట్టం

మేడ్చల్‌ జిల్లాలో అనధికార నిర్మాణాలు.. 

ఖాళీ స్థలాల్ల్లో ప్రత్యక్షమవుతున్న ‘అక్రమ’ లేఅవుట్లు 

చౌకబేరం పేరుతో వల..అనుమతులు పొందినవే అంటూ ప్రచారం

పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తున్న కొనుగోలుదారులు  

నిర్మాణాలపై అధికార యంత్రాంగం ఉక్కుపాదం 

బహుళ అంతస్తులైనా సరే.. కూల్చివేతలే..

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: వ్యవసాయ భూములు.. చెరువు శిఖం స్థలాలు.. ఏదైనా సరే.. ఖాళీ జాగా కనిపిస్తే చాలు... అక్రమార్కుల కన్నుపడుతున్నది. వాటిలో రాత్రికిరాత్రే జెండాలు వెలుస్తున్నాయి. హద్దురాళ్లు ప్రత్యక్షమవుతున్నాయి. హెచ్‌ఎండీఏ అనుమతులు పొందిన స్థలాలంటూ.. వాటిలో బోర్డులు కనిపిస్తున్నాయి. కానీ ఆ లే అవుట్‌లకు ఇటు గ్రామ పంచాయతీ గానీ, అటు హెచ్‌ఎండీఏ గానీ, మున్సిపాలిటీలు గానీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌లు గానీ ఎలాంటి అనుమతులు జారీ చేయలేదు. అయితేనేం మోసపోయేటోడు ఉన్నన్ని రోజులు మోసం చేసేటోడు ఉంటాడు కదా. మేడ్చల్‌ జిల్లాలో ఇప్పుడదే జరుగుతున్నది.  ఇలా అనధికార భవంతులు పుట్టగొడుగుల్లా వెలుస్తుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను నేలమట్టం చేసే ప్రక్రియను చేపట్టింది.

పక్కా ప్రణాళికతో..

జిల్లాలో వెలుస్తున్న అక్రమ లేఅవుట్లను నియంత్రించేందుకు జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పక్కా ప్రణాళిక రూపొందించారు. అనధికార నిర్మాణాలతో ప్రభుత్వానికి నష్టం కలుగుతుండటంతో పాటు అమాయక ప్రజలను మోసం చేస్తున్న డెవలపర్స్‌/  రియల్టర్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. మండలాలు, మున్సిపాలిటీలు,  గ్రామాల వారీగా హెచ్‌ఎండీఏ అనుమతులు లేకుండా వెలసిన లేఅవుట్ల వివరాలను సేకరించాలని ఇప్పటికే జిల్లా పంచాయతీ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇందులోభాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి.. అక్రమ లేఅవుట్లు, వాటి విస్తీర్ణం, సర్వే నంబర్లు, నిర్మాణదారుల వివరాల జాబితాను సిద్ధం చేస్తున్నారు. 

కూల్చివేతల కోసం ప్రత్యేక డ్రైవ్‌..

మేడ్చల్‌ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు తయారు చేసి..చౌకబేరం పేరుతో వల వేస్తున్నారు. దీంతో వారం రోజుల్లోనే వందల స్థలాలకు క్రయ విక్రయాలు జరిగిపోతున్నాయి. మరో నెల రోజుల్లోనే బహుళ అంతస్తుల భవనాలు దర్శనమిస్తున్నాయి. అయితే వీటిని  కొనుగోలు చేసిన వారు నిరక్షరాస్యులేం కాదు... ఉన్నత విద్యావంతులే. అందులో  ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. ఇలా అక్రమ లేఅవుట్లు, అనధికార భవంతులు ఇష్టారాజ్యంగా వెలుస్తుండటంతో వీటిపై చర్యలకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ముఖ్యంగా ఆయా నిర్మాణాలపై మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.వాసం వెంకటేశ్వర్లు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే రెండు నెలలుగా అక్రమ వెంచర్లు, చెరువు శిఖం, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో వెలసిన కట్టడాలను నేలమట్టం చేయిస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు.  

క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం..

జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా వెంచర్లు, నిర్మాణాలు చేపట్టే వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్మాణాలు జరుగాలి. లేదంటే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దు. అక్రమ వెంచర్లను పూర్తిగా కూల్చివేస్తాం. అలాగే ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తే నేలమట్టం చేస్తాం. అనధికార కట్టడాలకు ఎవరైనా అధికారులు సహకరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

- డా.వాసం వెంకటేశ్వర్లు, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌


logo