సోమవారం 30 నవంబర్ 2020
Medchal - Sep 29, 2020 , 00:14:08

గ్రామాల్లో.. ఎల్‌ఆర్‌ఎస్‌కు అనూహ్య స్పందన

గ్రామాల్లో.. ఎల్‌ఆర్‌ఎస్‌కు అనూహ్య స్పందన

23,714 దరఖాస్తులు స్వీకరణ

ప్రభుత్వానికి రూ.239.75లక్షల ఆదాయం  

605 అక్రమ లేఅవుట్లు గుర్తింపు

మేడ్చల్‌,నమస్తేతెలంగాణ: అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు మేడ్చల్‌ జిల్లాలోని పల్లెల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. జిల్లాలో మొత్తం 61 గ్రామాలుండగా వీటిలో సుమారు 10 గ్రామాల్లో ఎలాంటి లేఅవుట్లు లేవని అధికారులు గుర్తించారు. మిగిలిన 51 గ్రామాల్లో మొత్తం 827 లేఅవుట్లు, 1,08,504 ప్లాట్లు, 9,209.68 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 222 లేఅవుట్లు హెచ్‌ఎండీఏ అనుమతి పొంది ఉండగా, వీటి పరిధిలో 32,449 ప్లాట్లు, 3,141.34 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు జిల్లా పంచాయతీ అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో 605 అనధికారిక లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వీటి పరిధిలో 76,055 ప్లాట్లు, సుమారు 6,068.34 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయని జిల్లా పంచాయతీ అధికారి పద్మజా ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు జిల్లా కలెక్టర్‌ డా.వాసం వెంకటేశ్వర్లు సూచనల మేరకు జిల్లాలో అనధికారిక లేఅవుట్లను, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీపీఓ తెలిపారు. 

స్వీకరించిన దరఖాస్తుల వివరాలు

ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం మేడ్చల్‌ జిల్లాలోని పలు గ్రామాల నుంచి సుమారు 23,714 దరఖాస్తులు వచ్చాయని, వీటి ద్వారా రూ.239.75 లక్షల ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని అధికారులు తెలిపారు. ఇందులో ప్లాట్ల కోసం 23,685 దరఖాస్తులు (విస్తీర్ణం-66.95 ఎకరాలు), 29 లేఅవుట్లు విస్తీర్ణం (విస్తీర్ణం 10.26 ఎకరాలు) ఉందని అధికారులు తెలిపారు. అనధికారిక లేఅవుట్లు నిర్మించిన వ్యక్తులు, అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన వ్యక్తులు వెంటనే ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తులను సమర్పించాలని డీపీఓ పద్మజా సూచించారు.