గురువారం 24 సెప్టెంబర్ 2020
Medchal - Aug 05, 2020 , 00:19:53

ఆరోగ్య హితం.. స్ఫూర్తి పథం

ఆరోగ్య హితం.. స్ఫూర్తి పథం

ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా.. స్వయం ఉపాధి బాట

సంప్రదాయంగా స్వచ్ఛమైన నూనె ఉత్పత్తి 

నాణ్యతలో రాజీలేకుండా ముందుకు..  రోల్‌మోడల్‌గా యువకుడు

మేడ్చల్‌ రూరల్‌ : మూప్పై ఏండ్లకే కీళ్ల నొప్పులు.. మధుమేహం.. రక్తపోటు.. గుండె జబ్బులు.. ఎందుకు ఇలా..అని ప్రశ్నించుకుంటే.. మనిషి ఆరోగ్యం అతను తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందనేది వైద్య నిపుణుల మాట. దీర్ఘకాలిక వ్యాధులకు కల్తీ ఆహారమే కారణమంటున్నారు. వందేండ్లకు పూర్వం స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం లభించేవి. కానీ నేడు అది కరువైపోయింది. అయితే మళ్లీ మన పూర్వీకులను అనుసరిస్తే.. రోగాలను దరి చేరనివ్వకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చని నిరూపిస్తున్నాడో యువకుడు. ప్లాస్టిక్‌ ప్యాకెట్లు, డబ్బాలలో లభించే కల్తీ నూనెల స్థానంలో కట్టె గానుగతో తయారు చేసిన స్వచ్ఛమైన వంట నూనెతో రోగాలను తరిమికొట్టవచ్చంటున్నాడు మేడ్చల్‌కు చెందిన శ్రీకాంత్‌ గౌడ్‌. నెల నెలా జీతానిచ్చే ఉద్యోగాన్ని వదిలి.. స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకొని.. విజయం సాధించాడు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి నాణ్యతలో రాజీ పడకుండా కట్టె గానుగ నూనె తయారీ పరిశ్రమను నెలకొల్పడంతో పాటు సేంద్రియ ఆహార ఉత్పత్తులను అందిస్తూ.. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

జీవితం నేర్పిన పాఠాలతో..

వ్యవసాయ డిప్లొమా పూర్తి చేసిన శ్రీకాంత్‌ గౌడ్‌.. మేడ్చల్‌లోని ఓ విత్తన కంపెనీలో ఉద్యోగం చేశాడు. 30 ఏండ్ల వయస్సులోనే తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడ్డాడు. ఆ సమయంలో గురువుల సలహాలతో యోగాను ఆచరించడం, చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లపై నిపుణుల సలహాలు పొంది.. తన రుగ్మతలను తొలగించుకున్నాడు. ఖాదర్‌ వలీ లాంటి వారి సూచనలను పాటిస్తూ.. కల్తీ లేని నూనెలను అందించాలని సంకల్పించాడు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబతూర్‌ నుంచి  కట్టె గానుగను ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించాడు. పూర్వం గానుగను తిప్పేందుకు ఎడ్లను వినియోగించే వారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందటంతో విద్యుత్‌ మోటారుతో గానుగను నడిపిస్తూ స్వచ్ఛమైన వేరుశనగ, కొబ్బరి, నువ్వు, ఆవాలు, పొద్దు తిరుగుడు తదితర నూనెలను వినియోగదారుడి ఎదుటే తయారు చేసి ఇస్తూ.. వారి ప్రశంసలు  అందుకుంటున్నాడు. 

సేంద్రియ ఆహార ఉత్పత్తులు అందిస్తూ..

గానుగ నూనె  తయారీతో పాటు దేశ, విదేశాల నుంచి సేంద్రియ ఆహార ఉత్పత్తులు, పప్పు దినుసు లు తెప్పిస్తూ.. ప్రజలకు చేర వేస్తున్నాడు. అరకు నుంచి జాజికాయ, జాపత్రి, తేనె, కర్ణాటక నుంచి కొబ్బరి, కర్నూలు నుంచి చిరు ధాన్యాలు, కేరళ నుంచి లవంగాలు, మిరియాలు, అంకాపూర్‌ నుంచి పసుపు, గుంటూరు నుంచి మిరపకాయలు, తాటిబెల్లం, సముద్రపు ఉప్పు, హర్యానా, ఒడిశా నుంచి దేశవాళీ గిరి ఆవుల నెయ్యి, రాష్ట్రంలోని వివిధ ప్రాం తాల నుంచి పాలిష్‌ చేయని కందులు, శనగలు సేకరిస్తున్నాడు. తమిళనాడులోని సేలం నుంచి చిరుధాన్యాలతో తయారు చేసిన సేమియా, నూడుల్స్‌, యూపీలోని బృందావనంలో ఉన్న ఇస్కాన్‌ సంస్థ నుంచి ఆర్గానిక్‌ బెల్లం, పప్పులు, గో ఆధారిత సబ్బు లు, షాంపులు, గోధుమలను తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు. సొంతంగా పిండి గిర్నీ ఏర్పాటు చేసుకొని పసుపు, గోధుమ పిండి తయారు చేయిస్తున్నాడు.  త న ఉత్పత్తులకు దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుండటంతో ఆర్థికంగా ఎంతో వృద్ధి సాధిస్తూ..  నేటి యువతకు రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నాడు శ్రీకాంత్‌.

అందరూ ఆరోగ్యంగా ఉండాలి..

అందరూ ఆరోగ్యంగా ఉండాలి.. అందులో నేనుండాలన్నది నా లక్ష్యం. నేను చేస్తున్న పనిని నచ్చి కొందరు యువకులు కట్టె గానుగ పరిశ్రమ పెట్టుకోవడానికి ముందుకు వస్తే.. ఉచితంగా శిక్షణ ఇచ్చాను. ముడి సరుకులను ఎలా తెచ్చుకోవాలో గైడ్‌ చేశాను. తినే ఆహారమే అనారోగ్యానికి కారణం. ఆహారంలో నాణ్యత లేకపోవడం, రసాయనాలు ఉండటం వల్లే ప్రజలు బీపీ, షుగర్‌, గుండెనొప్పి, కీళ్ల నొప్పులు, వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు. బ్యాక్‌ టు  నేచర్‌ అని పలువురు నిపుణులు చెబుతున్న మాట ప్రకారం..నేను  ప్రజారోగ్యం కోసం నా వంతు కృషి చేస్తున్నా.

-శ్రీకాంత్‌ గౌడ్‌,


logo