సోమవారం 06 జూలై 2020
Medchal - Jun 30, 2020 , 01:42:40

అందరి భాగస్వామ్యంతో హరిత తెలంగాణ

అందరి భాగస్వామ్యంతో హరిత తెలంగాణ

కౌన్సిలర్లు స్ఫూర్తిదాయకంగా నిలవాలి : మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

మేడ్చల్‌ రూరల్‌: రాష్ట్రం హరిత తెలంగాణగా మారాలంటే అందరి భాగస్వామ్యం అవసరమని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌ మున్సిపాలిటీల పరిధిలోని జాతీయ రహదారి మధ్య నిర్వహించిన హరితహారం కార్యక్రమాన్ని కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కు వద్ద మంత్రులు తలసాని, మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. హరితహారం గొప్ప కార్యక్రమం.. సీఎం కేసీఆర్‌ ఉద్యమంలా నిర్వహిస్తున్నారన్నారు.  గత పాలకులు మొక్కల పెంపకంపై శ్రద్ధ చూపలేదన్నారు. ఐదు విడుతలుగా నిర్వహించిన హరితహారంలో నాటిన కోట్లాది మొక్కలతో పచ్చదనం వెల్లివిరిసిందని తెలిపారు. ఆరో విడుత కూడా అదే స్ఫూర్తితో మొక్కలు నాటుతున్నామన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ వార్డులు, డివిజన్లలో పెద్దఎత్తున మొక్కలు నాటి, స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్‌ జిల్లాలో లక్ష్యానికి మించి మొక్కలు నాటి, నంబర్‌ వన్‌ స్థానంలో నిలుపుతామన్నారు. గత విడుతలో 90 లక్షల మొక్కల లక్ష్యాన్ని అధిగమించి, 1.20 కోట్ల మొక్కలు నాటామన్నారు. ఈసారి కూడా రెండు కోట్ల మొక్కలు నాటే దిశగా ముందుకెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఎంవో వోఎస్డీ ప్రియాంక వర్గీస్‌, మేడ్చల్‌, గుండ్లపోచంపల్లి చైర్‌పర్సన్లు మర్రి దీపికా నర్సింహారెడ్డి, మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ భాస్కర్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ శ్యాంసన్‌, కమిషనర్లు అమరేందర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మొక్కలను కాపాడేందుకు చర్యలు : మంత్రి అల్లోల 

బంజారాహిల్స్‌: హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నాటిన మొక్కలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ నేషనల్‌ పార్కులో కొత్తగా ఏర్పాటు చేసిన టికెట్‌ కౌంటర్లు, బయోమెట్రిక్‌ విధానాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే రెండు కోట్ల మొక్కలు నాటామన్నారు. మొక్కలను కాపాడేందుకు రాష్ట్రంలో 12వేలకు పైగా గ్రామాల్లో వాటర్‌ ట్యాంకర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా 85 శాతం మొక్కలు కాపాడేందుకు వీలవుతుందన్నారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పీసీసీఎఫ్‌ శోభ, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ అండ్‌ ఎండీ రఘువీర్‌, అదనపు పీసీసీఎఫ్‌లు, డీఎఫ్‌వోలు పాల్గొని మొక్కలు నాటారు. 

హరిత తెలంగాణ లక్ష్యంగా..

కొండాపూర్‌: హరిత తెలంగాణ లక్ష్యంగా ప్రారంభించిన హరితహారాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.  హరితహారం 6వ విడుతలో భాగంగా సోమవారం ఆయన కొత్తగూడలోని బొటానికల్‌ గార్డెన్‌లో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..   ప్రతి ఒక్కరూ మొక్కను నాటి, సంరక్షణ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. అంతకు ముందు మంత్రి మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో కలిసి గచ్చిబౌలిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ స్ప్రింగ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పీసీసీఎఫ్‌ శోభ, ఎఫ్‌డీసీ ఎండీ రఘువీర్‌, కొండాపూర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ షేక్‌ హమీద్‌ పటేల్‌, తదితరులు పాల్గొన్నారు. 

కేబీఆర్‌ పార్కులో వాకర్స్‌ పాసుల గడువు పెంపు

రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన కేబీఆర్‌ నేషనల్‌ పార్కులో వాకర్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. పార్కులో వార్షిక పాసుల గడువు ముగుస్తున్నదని.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పార్కు మూసి ఉన్నందున వాకర్స్‌ పాసులను సెప్టెంబర్‌ వరకు పొడిగిస్తున్నామన్నారు. అప్పటిదాకా వాకర్లు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు.

కంటోన్మెంట్‌లో మొక్కలు నాటిన మంత్రి

మారేడ్‌పల్లి: హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సోమవారం కంటోన్మెంట్‌ బోర్డు 4వ వార్డులోని పికెట్‌ డిస్పెన్సరీ ప్రాంగణంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, కంటోన్మెంట్‌ బోర్డు ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణ, బోర్డు సీఈఓలు చంద్రశేఖర్‌, అజిత్‌రెడ్డి, బోర్డు సభ్యులు నళినికిరణ్‌, పాండుయాదవ్‌, జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టీఎన్‌. శ్రీనివాస్‌, మాజీ బోర్డు సభ్యుడు వెంకట్రావ్‌, కవాడిగూడ కార్పొరేటర్‌ లాస్య నందిత, ఆలయాల చైర్మన్‌లు సి.సంతోష్‌ యాదవ్‌, గంగారాం, టీఆర్‌ఎస్‌ నాయకులు పిట్ల నాగేశ్‌ ముదిరాజ్‌, పనస సంతోష్‌, నాగినేని సరిత, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


logo