e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి ప్రభుత్వ పాఠశాల.. ప్రతిభ అత్యుత్తమం

ప్రభుత్వ పాఠశాల.. ప్రతిభ అత్యుత్తమం

ప్రభుత్వ పాఠశాల.. ప్రతిభ అత్యుత్తమం
  • గౌడవెల్లి ఉన్నత పాఠశాలకు ఎస్‌సీఈఆర్‌టీ గుర్తింపు
  • ఎస్‌ఎల్‌డీపీ ఎడిషన్‌లో చోటు
  • ఉపాధ్యాయుల కృషి, సమాజ చేయూత

మేడ్చల్‌ ప్రభుత్వ పాఠశాల అది.. అయితేనేం కార్పొరేట్‌కు దీటుగా రాణిస్తున్నది. ఉపాధ్యాయుల కృషి, సమాజం నుంచి అందుతున్న తోడ్పాటుతో జాతీయస్థాయిలో ప్రతిభ చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నది మేడ్చల్‌ జిల్లాలోని గౌడవెల్లి జిల్లా పరిషత్‌ పాఠశాల. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ.. విజ్ఞాన మేళాల్లో రాణిస్తూ జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారు. ఈ పాఠశాల సాధిస్తున్న విజయాలపై ఇటీవలే ఎస్‌సీఈఆర్‌టీ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఎస్‌ఎల్‌డీపీ కింద…

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పాఠశాలలను గుర్తించేందుకు ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ట్రైనింగ్‌) నడుం బిగించింది. ఎస్‌ఎల్‌డీపీ (స్కూల్‌ లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ పోగ్రాం) కింద విద్యార్థి అభివృద్ధికి ప్రతిభావంతంగా పని చేస్తున్న పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి.. మొత్తంగా 60 పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందులో గౌడవెల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలకు చోటు కల్పించి.. 60 పాఠశాలలకు సంబంధించి ఎస్‌ఎల్‌డీపీ కింద ‘ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఆఫ్‌ స్కూల్‌ ఇన్‌ టూ వైబ్రెంట్‌ లర్నింగ్‌ హబ్స్‌’తో ప్రచురించిన పుస్తకంలో గౌడవెల్లి జడ్పీహెచ్‌ఎస్‌కు సంబంధించి ‘ఓవరాల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ త్రూ సిగ్నిఫిషెయెంట్‌ చేంజస్‌ ఇన్‌ ఫంక్షనింగ్‌ ఆఫ్‌ స్కూల్‌’ పేరుతో కథనం ప్రచురితం చేసింది.

ఉత్తమంగా పాఠశాల పనితీరు

గౌడవెల్లి జిల్లా పరిషత్‌ పాఠశాల సాధించిన ఘనత వెనుక ఎంతోమంది సహకారం ఉంది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన దాతలు పాఠశాలలో మౌలిక వసతులు కల్పించగా.. ఉపాధ్యాయులు విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దారు. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 430 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా 100 శాతం ఉత్తీర్ణతతో పాటు, ఇన్‌స్పైర్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ సైన్స్‌, మ్యాథ్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ విజ్ఞాన మేళాల్లోనూ ప్రతిభ చాటారు. 2018లో లక్నోలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌లో గౌడవెల్లి పాఠశాల విద్యార్థులు డెలిగేట్స్‌గా పాల్గొని గ్రామ పర్యావరణంపై పోస్టర్‌ ప్రజెంటేషన్‌ చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్రపతి కోవిం ద్‌, కేంద్ర విజ్ఞానశాస్త్ర, పర్యావరణ మంత్రి హర్షవర్ధన్‌ను మెప్పించారు. హైదరాబాద్‌లో విశ్వేశ్వరయ్య ఇనిస్టిట్యూట్‌లో అన్వేషణ పేరుతో నిర్వహించిన విజ్ఞాన మేళాలో పాల్గొన్న విద్యార్థులు 1,3,4 స్థానాలు కైవసం చేసుకున్నారు.

ఎంతోమంది సహకారం..

గౌడవెల్లి పాఠశాలల సర్వతోముఖాభివృద్ధికి ఎందరో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామ పరిధిలోని కృషి హోమం, దుండిగల్‌ పరిధిలోని స్ఫూర్తి ఫౌండేషన్‌ ఇతోధికంగా సేవలందిస్తున్నాయి. అత్యున్నత ప్రమాణాలతో జయసూర్య ఫౌండేషన్‌ డిజిటల్‌ లెర్నింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంఎల్‌ఆర్‌ఐటీ, ఐఐసీటీ జిజ్ఞాస్‌ తోడ్పాటునందిస్తున్నాయి. ముంబైకి చెందిన హైఫై ఫౌండేషన్‌ బాస్కెట్‌బాల్‌ శిక్షణకు పాఠశాలను ఎంచుకుంది. సామర్థ్యం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి 100 మంది విద్యార్థులను ఎంపిక చేసి జెర్సీలు, బూట్లు అందించింది. పాఠశాల ఆవరణలో బాస్కెట్‌బాల్‌ కోర్టు నిర్మాణంతో పాటు మొత్తం శిక్షణ కోసం ఆ సంస్థ రూ.30 లక్షలు ఖర్చు చేయడానికి ముందుకు వచ్చింది.

బాధ్యతను పెంచింది

పాఠశాలపై ఎస్‌సీఈఆర్‌టీ కథనం ప్రచురించడంతో మా బాధ్యత మరింత పెరిగింది. పాఠశాల అభివృద్ధికి జిల్లా విద్యాధికారులు, ఉపాధ్యాయులు, దాతలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ దేవసేన పాఠశాలను సందర్శించి కితాబు ఇవ్వడం ఆనందంగా ఉంది. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు మరింతగా కృషి చేస్తాం. – రవీందర్‌రాజు, ప్రధానోపాధ్యాయుడు, గౌడవెల్లి

బాహ్య ప్రపంచంతో పోటీ..

దాతలు, ఉపాధ్యాయులు అందిస్తున్న సహకారంతో బాహ్య ప్రపంచంతో పోటీ పడుతున్నాం. సైన్స్‌ఫేర్‌ తదితర పోటీల్లో ప్రతిభ చూపుతున్నాం. పాఠశాల బయట కూడా మేం ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. -చంద్రమహేశ్‌, పదవ తరగతి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రభుత్వ పాఠశాల.. ప్రతిభ అత్యుత్తమం

ట్రెండింగ్‌

Advertisement