బుధవారం 08 జూలై 2020
Medchal - Jun 04, 2020 , 02:15:36

భూమిని కోల్పోయిన పేద రైతులకు కొత్తగా సాగు భూమి కేటాయించిన ప్రభుత్వం

భూమిని కోల్పోయిన పేద రైతులకు కొత్తగా సాగు భూమి కేటాయించిన ప్రభుత్వం

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ : మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం కేశవరం ఊరు శివారులోని సర్వే నంబర్‌ 226లో సుమారు ఐదు ఎకరాల అసైన్డ్‌ భూమిని కొందరు దళిత కుటుంబాలు ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. అయితే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మించేందుకు రెవెన్యూ అధికారులు ఈ భూమిని ఎంపిక చేశారు. దీంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని, ఈ భూమిని ఎన్నో ఏండ్లుగా మేమే సాగుచేసుకుంటున్నామని ఆ పేద రైతులు ఆందోళన వ్యక్త చేశారు. ఈ విషయం కాస్త ప్రభుత్వ పెద్దల వరకు వెళ్లింది. భూమిని కోల్పోయిన ఆ పేద రైతులు సాగు చేసుకునేందుకు ప్రత్యామ్నాయంగా భూమికి బదులు భూమి కేటాయించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలొచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన శామీర్‌పేట రెవెన్యూ అధికారులు భూమిని కోల్పోయిన రైతులకు రోడ్డు పక్కనే విలువైన ప్రభుత్వ భూమిని ఒక్కో కుటుంబంకు ఒక్కో ఎకరాన్ని కేటాయించి పొజీషన్‌ చూపించడంతో ఆ పేద రైతులు బుధవారం సాగు పనులు ప్రారంభించారు. అలాగే సర్వే నంబర్‌ 40లో మరికొందరు రైతులకు భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ వారిని పలుకరించగా పేద రైతుల పెద్దన్న మా కేసీఆర్‌ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు తీసుకుంది అసైన్డ్‌ భూమి, మళ్లీ మీకు భూమి రాదు, ఎవ్వరు కూడా ఇవ్వరు అన్నారు. కానీ సీఎం కేసీఆర్‌ మా బతుకుదెరువును మళ్లీ మాకు ఇచ్చాడు. సాగుకు అనుకూలమైన సారవంతమైన భూమిని ఇచ్చారని ఆనందంతో చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ప్రభుత్వం చెప్పిన పంటలనే సాగు చేస్తామని ఆ రైతులు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. 


logo