ఆదివారం 24 జనవరి 2021
Medchal - Dec 03, 2020 , 07:54:28

పేదల కోసం‘గుడ్‌ విల్‌ స్టోర్‌'

పేదల కోసం‘గుడ్‌ విల్‌ స్టోర్‌'

  • మీకు ఉపయోగంలో లేని వస్తువులు, బట్టలు వదిలి వెళ్లండి అవసరం ఉన్నవి తీసుకెళ్లండి
  • సొంత నిధులతో  స్టోర్‌ను ఏర్పాటు చేసిన వైద్యాధికారి

కూకట్‌పల్లి, డిసెంబర్‌ 2 : పేద వారికి సాయం అందించాలంటే లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని నిరూపించారు కూకట్‌పల్లి సర్కిల్‌ వైద్య అధికారి చంద్రశేఖర్‌రెడ్డి. ‘మీకు ఉపయోగంలోని వస్తువులు, బట్టలు వదిలి వెళ్లండి మీకు అవసరం ఉన్నవి తీసుకు వెళ్లండి’ అన్న నినాదంతో మన ఇండ్లలో అవసరం లేని వస్తువులు, బట్టలు అవసరం ఉన్న వారికి అందించేందుకు కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలోని హుడా ట్రక్‌ పార్కు సమీపంలో ఓ గుడ్‌విల్‌ స్టోర్‌ను ఏర్పాటు చేశారు కూకట్‌పల్లి సర్కిల్‌ అధికారులు. మన ఇండ్లలో ఉపయోగంలో లేని వస్తువులు, పాత బట్టలు, చెప్పులు, పుస్తకాలు తదితర వస్తువులను ఈ గుడ్‌ విల్‌ స్టోర్‌లో ఉంచితే అవసరం ఉన్న వారు అక్కడి నుంచి తీసుకెళ్లవచ్చు. గుడ్‌ విల్‌ స్టోర్‌ ఏర్పాటు చేయాలంటే లక్షలు వెచ్చించి ఓ గది లేదా ప్రత్యేక నిర్మాణం చేయించాల్సి ఉంటుంది. అలా కాకుండా వైద్య అధికారి చంద్రశేఖర్‌రెడ్డి హుడా ట్రక్‌ పార్కు సమీపంలో ఖాళీగా శిథిలావస్థలో ఉన్న చిన్న గదిని తన పారిశుధ్య సిబ్బంది సహాయంతో దగ్గరుండి సొంత నిధులతో మరమ్మతులు చేయించారు. స్టోర్‌ పరిసరాలలో మొక్కలు నాటారు. గుడ్‌విల్‌ స్టోర్‌ ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. చాలామంది తమ తమ ఇండ్లలో ఉన్న పాత వస్తువులను, బట్టలను, పుస్తకాలు, ఫర్నీచర్‌లను ఇక్కడ వదిలి వెళ్లారు. వాటిని ఎంతో మంది అవసరం ఉన్న వారు వచ్చి తీసుకువెళ్లినట్టు వైద్య అధికారి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

పేదలకు సాయం అందించడం కోసమే..

కూకట్‌పల్లి సర్కిల్‌ డీసీ ప్రశాంతి మేడం ఒక మంచి ఆలోచనతో సర్కిల్‌ కార్యాలయం వద్ద ఓ గుడ్‌ విల్‌ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. కూకట్‌పల్లి హుడా ట్రక్‌ పార్కు స్థలంలో శిథిలావస్థలో ఉన్న గదిని గుడ్‌ విల్‌ స్టోర్‌గా మార్చలని నాకు ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన వెంటనే సొంత నిధులను వెచ్చించి పారిశుధ్య సిబ్బంది సహాయంతో గదిని తిరిగి నిర్మించి దానికి రంగులు వేయడం జరిగింది. గుడ్‌ విల్‌ స్టోర్‌ పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి మా సిబ్బంది తోడ్పాటు ఎంతో ఉంది. పేదలకు సాయం చేయడంలో నేను భాగస్వాముని కావడం ఆనందగా ఉంది.

- కే. చంద్రశేఖర్‌రెడ్డి, వైద్యాధికారి, కూకట్‌పల్లి సర్కిల్‌ 


logo