శనివారం 04 జూలై 2020
Medchal - Jun 04, 2020 , 01:54:37

ఉత్తమ గ్రామాలకు రూ.50వేలు ప్రోత్సాహం

ఉత్తమ గ్రామాలకు రూ.50వేలు ప్రోత్సాహం

పరిశుభ్రతతో కరోనాను తరిమికొట్టాలి

మంత్రి చామకూర మల్లారెడ్డి, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

మేడ్చల్‌ రూరల్‌/మేడ్చల్‌ / కీసర/శామీర్‌పేట/మూడుచింతలపల్లి/మేడిపల్లి : పల్లె ప్రగతిలో నిర్వహించే కార్యక్రమాల్లో జిల్లా స్థాయిలో ఉత్తమంగా నిలిచే గ్రామాలకు రూ. 50వేల ప్రోత్సాహం అందజేస్తానని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని మునీరాబాద్‌ గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా మంత్రి, జడ్పీ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పర్యటించారు. వైకుంఠధామం, ఉన్నతపాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత విడతలో జిల్లా స్థాయిలో ఉత్తమంగా నిలిచిన మునీరాబాద్‌కు రూ.50వేల ప్రోత్సాహాన్ని అందజేశామన్నారు. ఈ సారి కూడా ఉత్తమ పంచాయతీగా ఎంపికైతే ఇస్తానని చెప్పారు. కరోనా, సీజనల్‌ వ్యాధుల నేపథ్యంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందన్నారు. జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, కలెక్టర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సర్పంచ్‌, వార్డు సభ్యులు అంకితభావంతో పని చేసి, మునీరాబాద్‌ను అందంగా తీర్చిదిద్దారని, ఈపేరు నిలబెట్టుకోవడానికి మరింత కష్టపడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయేందర్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్లు విద్యాసాగర్‌, శ్యాంసన్‌, జడ్పీ సీఈవో దేవసహాయం, గ్రామ సర్పంచ్‌ చిట్టిమిల్ల గణేశ్‌, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు రాగజ్యోతి, ఎంపీటీసీ రఘు, ఎంపీడీవో శశిరేఖ, తహసీల్దారు సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మండలాల్లో ప్రత్యేక పారిశుధ్యం..

 మేడ్చల్‌ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గ సభ్యులు పర్యటించారు. కీసర మండలంలోని గ్రామాల్లో ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, ఎంపీడీవో పద్మావతి, ఎంపీవో మంగతాయారు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పర్యటించారు. కాచవానిసింగారంలో చెత్త చెదారాన్ని తొలగించి, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి, హైడ్రోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేశారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంతో సమస్యలు సత్వరమే పరిష్కారమై మున్సిపాలిటీలు సుందరంగా మారుతున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ మున్సిపాలిటీలో బుధవారం కలెక్టర్‌ వెంకటేశ్వర్లుతో కలిసి పర్యటించిన మంత్రి పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మేడ్చల్‌ పెద్ద చెరువు, తుమ్మ చెరువు నాలా పూడికతీత పనులు, పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్మాణ పనులను ప్రారంభించి, కాలనీల్లో పర్యటించారు. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, పట్టణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు జాన్‌ శ్యాంసన్‌, విద్యాసాగర్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దీపికా నర్సింహారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రమేశ్‌, ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, జడ్పీటీసీ శైలజా రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. 

వివిధ మున్సిపాలిటీల్లో ..

మున్సిపాలిటీల్లో మూడో రోజు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు, అధికారులు పర్యటించి సమస్యలను గుర్తించారు. నాగారం మున్సిపల్‌ పరిధిలోని కుమ్మరికుంటను మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుట్ల చంద్రారెడ్డి, కమిషనర్‌ వాణి పరిశీలించారు. దమ్మాయిగూడ మున్సిపల్‌ పరిధిలోని 16, 9, 8 వార్డుల్లో చైర్‌పర్సన్‌ ప్రణీత, వైస్‌ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు పర్యటించారు. బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కార్పొరేటర్లు పర్యటించారు. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లో మేయర్‌ మేకల కావ్య, డిప్యూటీ మేయర్‌ పర్యటించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 13,14 వార్డుల్లో చైర్‌ పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు పర్యటించారు.


logo