సోమవారం 26 అక్టోబర్ 2020
Medchal - Jul 20, 2020 , 22:44:58

ప్రతి ఇంటికి తాగునీరే లక్ష్యం

ప్రతి ఇంటికి తాగునీరే లక్ష్యం

జవహర్‌నగర్‌కు రూ.9.32 కోట్లు..

నిర్మాణం పూర్తి చేసుకున్న మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకులు 

65 శాతం పనులు పూర్తి...

త్వరలో మిగతా పనులు పూర్తి చేసి.. ప్రతి ఇంటికీ తాగునీరు

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు 

 జవహర్‌నగర్‌ : కొన్నేండ్లుగా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న జవహర్‌నగర్‌ ప్రజల తాగునీటి కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా రూ. 9.32 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో బాలాజీనగర్‌, అంబేద్కర్‌నగర్‌లో 1200  , చెన్నాపురం 1200 , శాంతినగర్‌లో 1000, మల్కారంలో 500 లీటర్ల సామర్థ్యంతో వాటర్‌ ట్యాంకుల నిర్మాణ పనులకు 2017, సెప్టెంబర్‌ 23న భూమిపూజ చేశారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు పనులను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించడంతో ట్యాంకు నిర్మాణ పనులను అధికారులు ఇప్పటికే పూర్తి చేయించారు. మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి దివ్యాంగుల కాలనీలో నిర్మించిన వాటర్‌ ట్యాంకును ప్రారంభించారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

65 శాతం పనులు పూర్తి..

ఇటీవల మేయర్‌ మేకల కావ్య మిషన్‌ భగీరథ, (హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ వాటర్‌ సైప్లె అండ్‌ సీవరేజీ బోర్డు) హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ అండ్‌ ఎస్‌బీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్‌లో ఇప్పటి వరకు 65 శాతం మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులు పూర్తయ్యాయని, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. కార్పొరేషన్‌లో హౌస్‌సర్వీస్‌ కనెక్షన్‌లను (హెచ్‌ఎఫ్‌సీ) ఇచ్చే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

వేసవిలో ప్రజల నీటి కష్టాలను తీర్చేందుకు మంత్రి మల్లారెడ్డి సహకారంతో మేయర్‌ రాంకీ ఫౌండేషన్‌ సౌజన్యంతో మూడు నెలల పాటు 13 వాటర్‌ ట్యాంకర్లతో  ప్రతిరోజు నీటి ఎద్దడి అధికంగా ఉన్న కాలనీల్లో సరఫరా చేయించి నీటి సమస్యను తీర్చారు. గతంలో ఉన్న  నల్లా కనెక్షన్‌ల ద్వారా కొన్ని ప్రాంతాలకు నీరు సరఫరా అవుతుందని, మిషన్‌ భగీరథ పనులు వంద శాతం పూర్తయితే ట్యాంకుల ద్వారా సురక్షితమైన తాగునీరు ప్రతి ఇంటికి రానున్నదని అధికారులు పేర్కొన్నారు.  

ట్యాంకుల ఏర్పాటు అభినందనీయం 

జవహర్‌నగర్‌లో ప్రతి ఇంటికీ తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చించి ట్యాంకులను నిర్మించడం అభినందనీయం. ఇప్పటికీ మంచి నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రజల కష్టాలను గుర్తించి  ట్యాంకులను నిర్మించడం సంతోషంగా ఉంది. త్వరలో పనులు పూర్తి చేసి తాగునీరివ్వాలి.

 -భూమ విజయ, ప్రొఫెసర్‌, జయశంకర్‌ కాలనీ 

 ఇంటింటికీ తాగునీరిస్తాం.. 

కార్పొరేషన్‌లో ఉన్న ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తాం. మిషన్‌ భగీరథ పనులు 65 శాతం పూర్తయ్యాయి. వంద శాతం పనులు పూర్తి చేసేలా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాం. త్వరలోనే జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లోని ప్రజల నీటి కష్టాలు తీరనున్నాయి.

-మేకల కావ్య, మేయర్‌, జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 


logo