శనివారం 23 జనవరి 2021
Medchal - Dec 03, 2020 , 08:02:47

ఇండ్ల మధ్యనేకార్పొరేట్‌ వైద్యం

ఇండ్ల మధ్యనేకార్పొరేట్‌ వైద్యం

  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత పరీక్షలు
  • కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలు
  • పేదలకు వరంగా మారిన బస్తీ దవాఖానలు

కూకట్‌పల్లి : పేద ప్రజలు నివసిస్తున్న బస్తీల్లోనే మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతి డివిజన్‌లో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పేద ప్రజల పాలిట సంజీవినీగా మారాయి. జలుబు, జ్వరం, దగ్గు ఇలా ఏ చిన్న రోగం వచ్చిన కార్పొరేట్‌ దవఖానాలకు పోయి వేలు ఖర్చు చేసుకుని జేబులు ఖాళీ చేసుకుంటున్న ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తోంది. ఈ దవాఖానల్లో వివిధ రకాల రక్త పరీక్షలు సైతం ఉచితంగా చేస్తున్నారు. అంతే కాకుండా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రెండు నుంచి మూడు బస్తీ దవాఖానలు సైతం వైద్య సేవలను అందిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి డివిజన్‌లో ఓ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలను అందిస్తున్నారు. మూసాపేట్‌ జనతానగర్‌ కాలనీల్లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ భవన సముదాయంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సేవలను అందిస్తున్నది. కార్పొరేట్‌ దవాఖానలకు తీసిపోని విధంగా రోజు 80నుంచి 90మంది వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్య కేంద్రానికి వస్తున్నారని డాక్టర్‌ రిషిత తెలిపారు. ఆరోగ్య కేంద్రంలో బుధ, శనివారల్లో చిన్న పిల్లలకు టీకాలు వేయడంతో పాటు శుక్రవారం, సోమవారం గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గురువారం వృద్ధులు, పెద్ద వాళ్లకు వైద్య పరీక్షలు చేస్తున్నామన్నారు. ప్రతి రోజు ఉదయం 10 నుంచి 12గంటల వరకు కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నామన్నారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రాజీవ్‌ గాంధీనగర్‌, పాండురంగ నగర్‌, కైత్లాపూర్‌ ప్రాం తాల్లో బస్తీ దవాఖానలు నిత్యం వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు. అంతే కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో విధులు నిర్వహించే ఏఎన్‌ఎంలు ఫీల్డ్‌ విజిట్‌లలో భాగంగా డెంగ్యూ, మలేరియా వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను చేపడుతుంటారని, అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆధ్వర్యంలో మురికి వాడలు, బస్తీల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తుంటామని డాక్టర్‌ రిషిత తెలిపారు.

పేదలు ఆరోగ్యంగా ఉండాలన్నదే..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ఉద్దేశంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పని చేస్తున్నది. రోజు ఆరోగ్య కేంద్రంలో 80నుంచి 90మంది వరకు వైద్య సేవలను పొందుతున్నారు. అదే విధంగా ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రతి కాలనీలో, ప్రభుత్వ పాఠశాలలో అంటు రోగాలు, డెంగ్యూ, మలేరియా వంటి రోగాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంటాం. మా ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజలకు ప్రైవేటు దవాఖానలు, ఆర్‌ఎంపీ డాక్టర్‌ల వద్దకు వెళ్లకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి.

- డాక్టర్‌ గొల్లపల్లి రిషిత, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మూసాపేట్‌ 


logo