e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home మేడ్చల్-మల్కాజ్గిరి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

మేడ్చల్‌, అక్టోబర్‌25 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్‌లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీశ్‌ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశం హాల్‌లో సోమవారం వ్యవసాయ, ఉద్యాన వనశాఖల, విత్తన డీలర్లతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫుడ్‌ కార్పొరేషన్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) రానున్న యాసంగిలో వడ్లు, ముడి బియ్యం కొనలేమని స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా చూడాలన్నారు.

అన్నదాతలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా వరి పంటకు బదులుగా వేరు శనగ, కంది, పెసర, మినుములు, కుసుములు, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆవాలతో పాటు కూరగాయల పంటలు సాగు చేసేలా చూడాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల్లో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్‌ సూచించారు. ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు అందుబాటులో ఉన్న విత్తనాల గురించి రైతులకు తెలుపాలన్నారు. అన్ని గ్రామాల్లో రైతు వేదిక సమావేశాలు ఈ నెల 29 వరకు పూర్తి చేయాలని సూచించారు. కూరగాయలు, పందిరి పంటలు సాగు చేసి ప్రభుత్వం అందించే రాయితీలను రైతులు పొందే విధంగా చూడాలన్నారు.

ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు

- Advertisement -

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ హరీశ్‌ తెలిపారు. మేడ్చల్‌ జిల్లా వ్యాప్తంగా 11 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 30 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు అంచనాలు రూపొందించినట్లు వివరించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ధాన్యం వచ్చిన 24 గంటలలోపే దించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని, దళారులను నమ్మిమోస పోవద్దన్నారు.

గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు..

జిల్లాలో గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హరీశ్‌ హెచ్చరించారు. గంజాయి సాగు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎవరైనా గంజాయి సాగు చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్సైజ్‌ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. గంజాయి సాగును అరికట్టడంలో పోలీస్‌ శాఖ సహకారం తీసుకోవాలని ఎక్సైజ్‌ అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి, వ్యవసాయాధికారి మేరీ రేఖ, ఆర్డీవో మల్లయ్య, ఉద్యానవన అధికారి సత్తార్‌, ఏడీ వెంకట్రాంరెడ్డి, విత్తన డీలర్లు పాల్గొన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement