శుక్రవారం 30 అక్టోబర్ 2020
Medchal - Aug 29, 2020 , 23:01:59

బాహుబలి శివలింగం

బాహుబలి శివలింగం

ఓ సినిమాలో హీరో తల్లి తన మొక్కును తీర్చేందుకు నదిలో నీరుతెచ్చి 1,016 బిందెల నీళ్లతో జలభిషేకం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇది తెలిసి 

ఆ హీరో ఏకంగా అక్కడ ఉన్న శివలింగంను తన భుజాలపై ఎత్తుకెళ్లి నిత్యం 

పారుతున్న ఓ నది ప్రవాహం వద్ద ప్రతిష్ఠిస్తాడు. దీంతో ఆ శివ లింగంపై నుంచి నిత్యం గంగ పారుతుంది. ఈ కాన్సెఫ్ట్‌ను ప్రామాణికంగా తీసుకొని సహజసిద్ధంగా వెలిసిన 

ఓ ఆరుఫీట్ల ఎత్తున్న బండరాయిని శివలింగం ఆకృతిలో చెక్కి ఆ లింగంపై నుంచి నిత్యం గంగ ప్రవహించేలా శిల్పులు తీర్చిదిద్దుతున్నారు. ఇది ఎక్కడో కాదు నగర శివారు మేడ్చల్‌ జిల్లాలోని కీసరుగుట్టపైనున్న కొలనుకు సమీపంలో. అవును.. పురాతన శైవక్షేత్రాల్లో ఒకటిగా కీర్తి గడిస్తున్న కీసర ఆధ్యాత్మిక క్షేత్రంలో సందర్శకులకు, భక్తులకు ఆహ్లాదాన్ని పంచే అందాలు వేగంగా సిద్ధమవుతున్నాయి. 

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ కీసర రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకుని తన ఎంపీ నిధుల నుంచి సుమారు రూ.3కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న సంగతి విధితమే. సుమారు 15 వందల పైచిలుకు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రిజర్వు ఫారెస్ట్‌లో విస్తారంగా చెట్లను నాటి దట్టమైన అడవిగా మార్చడంతో పాటు కీసర దేవాలయంకు వెళ్లే ప్రధానదారి పక్కనే ఉన్న పెద్దమ్మ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా, అలాగే చెరువు కత్వ పై నుంచి ఓ వంతెన (బ్రిడ్జి) నిర్మాణం, అడవి మధ్యలో గజబోల నిర్మాణం, వీవ్‌ పాయింట్‌ వంటి పనులు జరుగుతున్నాయని జిల్లా ఫారెస్ట్‌ అధికారులు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ముందస్తుగా రూ.70లక్షలతో ఈ పనులను చేపట్టడం జరిగిందని, ఈ పనులు మరో ఆరునెలల్లో పూర్తవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పనులు పూర్తయితే కీసర రామలింగేశ్వర దేవాలయం దర్శనంకు వచ్చే భక్తులకు ఆహ్లాదం పంచే అందాలు స్వాగతం పలుకనున్నాయని చెప్పవచ్చు.