ముంబై : రాష్ట్రాలకు సరిపడా కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్ధాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వ్యాక్సిన్ సరఫరాల కొరతతో పుణే నగరంలో గత వారం రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించింది. టీకాలు అందుబాటులో లేకపోవడంతో వారంలో కొన్ని రోజుల్లోనే వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోందని పుణే నగరపాలక సంస్థ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం 191 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేపట్టగా టీకాల కొరతతో బుధవారం కేవలం 60 కేంద్రాల్లోనే వ్యాక్సిన్లు వేశారని చెప్పారు.
జాన్సన్ అండ్ జాన్సన్‌తో పాటు స్పుత్నిక్ వీ ఇతర టీకాలు అందుబాటులోకి వచ్చేవరకూ వ్యాక్సిన్ల కొరత వెంటాడేలా ఉందని పుణే సర్కిల్ వైద్యాధికారి సంజయ్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో అతిత్వరలో అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ల కొరతతో నగర యంత్రాంగం వారంలో కొన్ని రోజులు వ్యాక్సిన్ హాలిడేను ఇస్తున్నాయి.