ఎవరి ప్లాట్లు వారికి ఇచ్చేస్తాం..

- పొరపాటు జరిగింది... 30 ఏండ్ల కిందటే విక్రయించాం..
- పాస్ బుక్కులు పొందాం.. రైతు బంధు తీసుకుంటున్నాం
- ఆర్డీఓ ఎదుట తప్పు ఒప్పుకున్న అక్రమ పట్టాదారులు..
- ప్రతాపసింగారంలో మూడేండ్ల భూ సమస్యకు పరిష్కారం
మూడేండ్ల సమస్య... 390 మంది, బాధితులు.. 25 ఎకరాల 17 గుంటల భూమి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. తెలంగాణ సర్కారు పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో.. సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు నేరుగా క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ప్రతాప సింగారం గ్రామంలో అక్రమంగా పట్టాలు పొందిన వారు.. తాము చేసిన తప్పును ఒప్పుకున్నారు. 30 ఏండ్ల కిందటే తాము ప్లాట్లు చేసి విక్రయించామని.. పాసు బుక్కులు పొంది రైతు బంధు కూడా తీసుకున్నామని తెలిపారు. మంగళవారం జరిగిన విచారణలో ఎవరి ప్లాట్లు వారికి ఇచ్చేస్తామని ప్రకటించడం బాధితుల్లో ఆనందాన్ని నింపింది.
ఘట్కేసర్ మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలో వివాదాస్పదంగా మారిన సర్వే నంబర్లు 315, 316, 317లలోని 25.17 ఎకరాల భూములను మంగళవారం ఆర్డీఓ మల్లయ్య, తహసీల్దార్ విజయలక్ష్మి, సర్వేయర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాట్ల యజమానులు, అక్రమంగా పాస్ పుస్తకాలు తీసుకున్న వారిని (పట్టాదారులు) ఆర్డీఓ, తహసీల్దార్ స్వయంగా విచారించారు. అధికారులు చేపట్టిన విచారణలో నిజాలన్నీ వెల్లడయ్యాయి. వివాదంలో ఉన్న సర్వే నంబర్లలో అసలు వ్యవసాయ భూమి లేదని, ప్లాట్లు మాత్రమే ఎందుకున్నాయని ఆర్డీఓ ప్రశ్నించడంతో.. అసలు విషయం చెప్పుకొచ్చారు వారు. 1988 సంవత్సరంలో జీపీఏ ద్వారా 390 ప్లాట్లు చేసి విక్రయించామని, జీపీఏ ఇచ్చిన మూడేండ్ల తర్వాత రద్దు చేసుకున్నామని ఎం.మధుసూదన్‌రెడ్డితో పాటు మిగతా పట్టాదారులు తెలిపారు. ఇందులో కొన్ని ప్లాట్లు విక్రయించని మూలంగా అప్పటి తహసీల్దార్ రాజేశ్వర్‌రెడ్డి సహకారంతో పాస్ పుస్తకాలు పొందామన్నారు.
30 ఏండ్ల కిందటే ప్లాట్లు చేసి విక్రయించామని.. మూడేండ్ల కిందట పాస్ బుక్కులు తీసుకొని అప్పటి నుంచి రైతుబంధు తీసుకుంటున్నామన్నారు. అయితే ఇది తమకు తెలియకుండానే జరిగిందని కొందరు తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు. అసలైన జీపీఏ హోల్డర్ మలిపెద్ది బుచ్చిరెడ్డి నుంచి నేరుగా ప్లాట్లు కొన్న వారికి ప్లాట్స్ ఇచ్చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. వారు పొజిషన్లోకి వెళ్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆర్డీఓకు వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మల్లయ్య మాట్లాడుతూ.. నిజమైన ప్లాట్ల యజమానులకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. స్వతాహాగా డబ్బులు పెట్టి కొని రిజస్ట్రేషన్ చేయించుకున్న అమాయక ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మార్చి 2న ప్రత్యేక సమావేశం నిర్వహించి అక్కడే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, గ్రామ సర్పంచ్, సుమారు 300 మంది ప్లాట్ల యజమానులు, భవానీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, పట్టాదారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సభ్యత్వ నమోదులో టీఆర్ఎస్దే ప్రథమ స్థానం
- ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్.. స్నేహితురాలి తండ్రి పనేనా.!
- విద్యార్థులు లక్ష్యాలను సాధించాలి
- వైరల్ వీడియో : ఆవు క్యాట్ వాక్
- ఆటోపైనే ఇళ్లు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..!
- ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు
- సెంచరీతో సెలక్టర్లను ఆకర్శించిన దేవ్‌దత్
- దేవ్రీ ఆలయంలో పూజలు చేసిన ధోనీ
- సందీప్ కిషన్ నా ఫోన్ కాల్ ఎత్తాలంటే భయపడ్డాడు
- చిన్నారుల విద్యకు సోనూ సూద్‌తో చేతులు కలిపిన ఎంఐ మొబైల్స్