బుధవారం 03 మార్చి 2021
Medchal - Feb 23, 2021 , 05:34:54

సాగుపై శిక్షణకు వేదిక

సాగుపై శిక్షణకు వేదిక

  • శాస్త్రవేత్తలతో రైతులకు త్వరలో శిక్షణ తరగతులు
  • ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయాధికారులు
  • పూర్తి వినియోగంలోకి రానున్న రైతు వేదికలు
  • మేడ్చల్‌ జిల్లాలో తొమ్మిది వేదికలు సిద్ధం

మేడ్చల్‌, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): రైతులను ఆధునిక వ్యవసాయ పద్ధతుల వైపు మళ్లించేందుకు త్వరలోనే వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిరంతర శిక్షణ తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందుకు మేడ్చల్‌ జిల్లాలో నిర్మాణాలు పూర్తయిన రైతు వేదికలను వినియోగంలోకి తీసుకొచ్చి రైతులతో సమావేశాలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం వ్యవసాయాధికారులు యాసంగి పంటల సాగు వివరాల సేకరణలో నిమగ్నమయ్యా రు. ఇది పూర్తి కాగానే రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.

పంటల సాగుపై పూర్తి అవగాహన 

పంట మార్పిడి, యాంత్రీకరణ, ఆధునిక సాం కేతిక పరిజ్ఞానంపై  రైతులకు శాస్త్రవేత్తలు పూర్తి గా శిక్షణ తరగతుల్లో అవగాహన కల్పించనున్నారు. అదే విధంగా పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌పై రైతు వేదికల్లోనే రైతుల మధ్యే అధికారులు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందు కోసం మేడ్చల్‌ జిల్లాలో తొమ్మిది రైతు వేదికలను నిర్మించి సిద్ధం చేశారు. రైతు వేదికల్లో అవసరయ్యే ఫర్నిచర్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతా మహంతి వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

త్వరలోనే శిక్షణ తరగతులు 

రైతు వేదికల ద్వారా నిరంతరం పంటల సాగుపై అవగాహన కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలతో శిక్షణ తరగతులను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. పంటల మార్పిడి, ఆధునిక పద్ధ్దతులు, మార్కెటింగ్‌, కొత్త వంగడాలు వేసే విధంగా అవగాహన కల్పిస్తాం. రైతు వేదికల ద్వారా రైతులకు పూర్తి సమాచారం అందిస్తాం. త్వరలోనే ఈ శిక్షణ తరగతులనను ప్రారంభిస్తాం. - మేరి రేఖ, జిల్లా వ్యవసాయాధికారి 

VIDEOS

logo