ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Medchal - Jan 28, 2021 , 03:49:47

పారిశ్రామిక వాడలో పచ్చదనం

పారిశ్రామిక వాడలో పచ్చదనం

హరితహారం కార్యక్రమంతో  కొంపల్లి మున్సిపాలిటీ పరిధి హరితమయమవుతున్నది. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని అడవుల్లో, ప్రధాన రహదారి మధ్యలో ఆయా కాలనీల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు పార్కులను అభివృద్ధి చేస్తున్నారు.  ప్రతి మొక్కను సంరక్షించాలనే సంకల్పంతో అధికారులు తగు చర్యలు తీసుకోవడంతో హరితహారంలో నాటిన మొక్కలు చెట్లుగా ఎదుగుతున్నాయి.

ప్రత్యేక శ్రద్ధ..

కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి పారిశ్రామిక వాడలతో పాటు ఆయా ఏరియాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో హరితహారం కార్యక్రమం కింద నాటిన మొక్కలు ఇప్పుడు చెట్లుగా ఎదుగుతున్నాయి. ప్రధానంగా నగర శివారులో ఉండడంతో పాటు పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాన్ని అరికట్టేందుకు పరిశ్రమలకు చేరువలో ఖాళీగా ఉన్న స్థలాల్లో ప్రత్యేకంగా మొక్కలు నాటారు. నిత్యం వాటి పరిరక్షణతో పాటు వాటికి ప్రత్యేకంగా కంచెలను ఏర్పాటు చేసి ప్రతి మొక్కను పరిరక్షించడం ద్వారా రోజురోజుకు మొక్కలు చెట్లుగా ఎదుగుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. పారిశ్రామిక వాడల్లో ప్రతి పరిశ్రమలో మొక్కలు నాటాలి.. వాటిని పరిరక్షించాలనే నినాదంతో అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. 

సుందరీకరణ దిశగా పార్కులు..

 కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో దూలపల్లి పారిశ్రామిక వాడతో పాటు ఇతర కాలనీల్లో ప్రజలకు నిత్యం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన గ్రీనరీ పార్కుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో కొంపల్లి పరిధిలో సెంట్రల్‌ పార్కు, ఎన్‌సీఎల్‌ పార్కు, న్యూ గ్రీన్‌ సిటిలో రెండు పార్కులు, అపర్ణపార్కు, ప్రియదర్శిని ఎన్‌క్లేవ్‌తో పాటు నూతనంగా ఎన్‌హెచ్‌-44 ప్రధాన రహదారికి ఇరువైపులా, రహదారి మధ్యలో ఉన్న గ్రీనరీ అభివృద్ధిపై దృష్టి సారించారు. 

మొక్కలకు ప్రత్యేక రక్షణ..

   జాతీయ రహదారికి ఆనుకొని సుచిత్ర చౌరస్తా నుంచి గుండ్లపోంచంపల్లి ప్రధాన రోడ్డు వరకు రోడ్డుకు ఇరువైపులా ఆకర్షణీయమైన మొక్కలు, రకరకాల చెట్లతో ప్రయాణికులను ఆహ్లాదపర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వాటి సంరక్షణకు నిరంతరం కృషి చేస్తూ, సుందరీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జాతీయ రహదారికి ఆనుకొని ఓ వ్యక్తి తన వెంచర్‌కు దారితీసేందుకు ఏకంగా మొక్కలను తూడ్చి మట్టిని పోశాడు. దీంతో సంబంధిత మున్సిపల్‌ అధికారులు, ట్రాఫిక్‌ అధికారులు స్పందించి సదరు వెంచర్‌ వ్యక్తికి నోటీసులు జారీ చేయడంతో పాటు మొక్కలు నాటించి యథావిధిగా గ్రీనరీని ఏర్పాటు చేసే దిశగా తగు చర్యలు తీసుకున్నారు. 

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలి. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గ్రీనరీకి పెద్దపీటను వేస్తున్నాం. హరితహారంలో నాటిన మొక్కలు ఇప్పుడు చెట్లుగా ఎదుగుతున్నాయి. అనునిత్యం వాటి పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో పార్కులు, హరితవనాలను మరింత అభివృద్ధి చేసేందుకు  చర్యలు చేపడుతాం.- ఉదయ్‌కుమార్‌, కమిషనర్‌ కొంపల్లి మున్సిపాలిటీ

VIDEOS

logo