మంగళవారం 09 మార్చి 2021
Medchal - Jan 18, 2021 , 03:44:51

అంబేద్కర్‌ స్ఫూర్తిని చాటుదాం

అంబేద్కర్‌ స్ఫూర్తిని చాటుదాం

బోడుప్పల్‌ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అణగారిన వర్గాల స్ఫూర్తి ప్రదాత భారతరత్న డాక్టర్‌ అంబేద్కర్‌ ఆశయ స్ఫూర్తిని నలుదిశలా చాటాలని రాష్ట్ర సాంఘిక, సంక్షేమ గురుకులాల సెక్రటరీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. బోడుప్పల్‌ ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం అంబేద్కర్‌ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జాతిని జాగృతం చేసిన గొప్ప దార్శనీయుడని, అట్టడుగు వర్గాల చైతన్య దీపికగా బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ నిలిచారన్నారు. గడిచిన వంద ఆదివారాలుగా అంబేద్కర్‌కు నివాళులర్పిస్తూ, అంబేద్కర్‌ ఆశయాల్ని ప్రజలముందుకు తీసుకెళ్తున్న అంబేద్కర్‌ ఆశయ సాధన సమితి కృషిని ఆయన అభినందించారు. అంబేద్కర్‌ ఏ ఒక్క వర్గానికి పరిమితం చేయకూడదని, యావత్‌ భారతదేశం గర్వించదగ్గ గొప్ప రాజనీతి కలిగిన నేత అని కొనియాడారు. భావితరాల స్ఫూర్తి ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జాతికి చేసిన సేవలు ఎనలేనివని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామెల్‌ అన్నారు.  కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత పసునూరి రవీందర్‌, గాయకుడు ఏపూరి సోమన్న, స్థానిక కార్పొరేటర్లు, సామల పవన్‌రెడ్డి, సుమన్‌ నాయక్‌, కొత్త దుర్గమ్మ, రాసాల వెంకటేశ్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, స్థానిక అంబేద్కర్‌ ఆశయసాధన సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.


VIDEOS

logo