పదవి ఊడినప్పుడో
పదవి కోరినప్పుడో
నక్కకు పాదయాత్ర గుర్తొస్తుంది!
దుఃఖపు తోలు కప్పుకొని
జనం మధ్యకు బయలుదేరుతుంది
మడచిన ఆత్మగౌరవ పతాక చేతబట్టి..!
హడావుడిగా రాత్రికి రాత్రే
జనం చెవుల్లో పూలుపెట్టి
అవమానం నాదికాదు మీదంటుంది!
ఇన్నిసార్లు గెలిచింది
ఆ బీ ఫాంతో కాదు మీ ఆశీస్సులతో అంటుంది
ఆ విసిరేసిన మాటలకు అనుచరుల చప్పట్లు!
పరాయి జెండాలెత్తడం నాకలవాటే
ఇదిగో మన కొత్త జెండా అంటూ..
అనుచరుల భుజాల మీద మొలిపిస్తుంది!
ఎన్నికలు కనుచూపు మేర కానరాకున్నా
కత్తులకు పదునుపెట్టే పని మొదలైతది
కొత్త కొత్త పాటలతో నినాదాలతో హల్చల్!
కులం మతం తెరమీదకు తెచ్చి
యుద్ధం మొదలవ్వకముందే
జన విభజనకు బీజం వేస్తుంది!
ఇక చూస్కో.. మీడియా చర్చలకు
ఒకింత విరామం ఉండదు
ఒక్క ఆకు రాలిపోతే చెట్టు ఎండిపోతదా?!
ఇట్లాంటి విడ్డూరాలన్నీ
మన పవిత్ర ప్రజాస్వామ్య దేశంలోనే
గూగుల్లో ఎంత వెతికినా ఒక్కటీ కానరాదు!!
-కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 94402 33261