కుత్బుల్లాపూర్, జూన్ 3: ఓ వైపు నగరవాసులు బ్లాక్ ఫంగస్ బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు అధిక ధరలకు మందులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ డిప్యూటీ కమిషనర్ జి.సందీప్, బాలానగర్ జోన్ డీసీపీ పద్మజారెడ్డి, ఆయా పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు ఉమ్మడిగా దాడులు జరిపి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు.
పేట్‌బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు తెలిపిన వివరాల ప్రకారం… ఎర్రగడ్డ ఈఎస్ఐ దవాఖానలో జనరల్ ఫిజిషియన్‌గా పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుడు ఓబుల్‌రెడ్డి అలియాస్ బలరామిరెడ్డి బ్లాక్ ఫంగస్‌కు వాడే ఔషధం (అంఫొటరిసిన్-బి లిపోసోం ఇంజక్షన్-50ఎంజీ) ఔషధాన్ని బ్లాక్మార్కెట్లో అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవడానికి పథకం పన్నాడు. అందుకు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధి చింతల్‌లోని గాంధీనగర్‌కు చెందిన ఓ మెడికల్ షాప్ నిర్వాహకుడు సదగారి వికాస్‌రెడ్డి(30), చింతల్ శ్రీనివాస్‌నగర్‌లోని శ్రీసాయినందిని మెడికల్ హాల్ నిర్వాహకుడు చిర్ర నాగరాజు, సుచిత్రలోని మానస మెడికల్ షాప్ నిర్వాహకుడు పాపిశెట్టి శ్రీధర్(48)ల ద్వారా బ్లాక్మార్కెట్లో విక్రయించేందుకు ముందుకు వచ్చారు. సుమారు రూ. 7,858 విలువ గల ఔషధాన్ని రూ. 38 వేల నుంచి రూ.45 వేలకు విక్రయిస్తున్నారు.
ఔషధానికి ఉన్న అసలైన లేబుల్‌ను తొలగించి నకిలీ లేబుల్ స్టిక్కర్‌ను అతికించి అధిక రేట్లకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. దీనికి తోడు నిందితుల్లో ఒకరైన పాపిశెట్టి శ్రీధర్ ఏకంగా ఇతర జబ్బులకు వాడే సెప్ట్రొయిక్సొన్, తాజోమక్టమ్ ఔషధాన్ని బ్లాక్ ఫంగస్‌కు ఉపయోగించేందుకు నకిలీలేబుల్తో సీసాలను సృష్టించి విక్రయించేందుకు సిద్ధం చేసుకున్నాడు. ఎట్టకేలకు పోలీసులకు పట్టుబట్టడంతో నకిలీగా గుర్తించిన ఔషధాన్ని ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా విక్రయించలేదని పోలీసులు తెలిపారు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులతో పాటు జీడిమెట్ల, పేట్‌బషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. ఈ సంఘటనకు ప్రధాన సూత్రదారుడైన ప్రభుత్వ వైద్యుడు ఓబుల్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా నిందితుల నుంచి రూ.18లక్షల విలువ చేసే ఔషధాలతో పాటు నకిలీ లేబుల్స్, నాలుగు సెల్ఫోన్లు, కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో బాలానగర్ ఏసీపీ పురుశోత్తంరెడ్డి, పేట్‌బషీరాబాద్ సీఐ రమేశ్, జీడిమెట్ల సీఐ బాలరాజు, మాదాపూర్ ఎస్ఓటీ సీఐ శివప్రసాద్, సిబ్బంది ఉన్నారు.